Venkateswarlu
Venkateswarlu
నర్గీష్ ఫక్రీ.. ఈ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, హిందీ సినిమాలు చూసే వారికి ఓ ఐడియా ఉండే ఉంటుంది. బాలీవుడ్ సినిమాల్లో నటిగా, ఐటమ్ గాళ్‌గా నర్గీష్ చాలా ఫేమస్. ఆమె 2011లో వచ్చిన ‘రాక్‌స్టార్’ అనే హిందీ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో సినిమాలు చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ పీరియాడికల్ డ్రామా ‘హరిహరవీరమళ్లు’ సినిమాతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
ఈ సినిమాలో రోషనార పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక, అసలు విషయానికి వస్తే.. అమెరికా పౌరురాలైన ఆమె బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు పెరిగిన తర్వాతే ఇండియాకు వచ్చి స్థిరపడ్డారు. కొన్నేళ్ల క్రితం ముంబైలో శ్మశానం పక్కనే ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఉండేవారు. ఆ సమయంలో ఆమెకు దారుణమైన దెయ్యం అనుభవాలు ఎదురయ్యాయి. ఆ విషయాల గురించి ఆమే స్వయంగా చెప్పుకొచ్చారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ నేను ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌లో దిగాను. అది కొండ ప్రాంతంలో ఉంది. అది కూడా శ్మశానానికి దగ్గరగా.. నేను కొన్ని రోజులు మాత్రమే అక్కడ ఉన్నాను.
నాకు ప్రతీరోజూ భయంకరమైన దెయ్యం కలలు వచ్చేవి. సరిగ్గా ఉదయం మూడు గంటలకు మెలుకువ వచ్చేది. అది చాలా భయంకరమైన అనుభవం. ఓ కల నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ కలలో ఓ వ్యక్తి నాకు దెయ్యంలా కనిపించాడు. దాదాపు 6 అడుగుల పైనే ఉన్నాడు. అతడు నన్ను శ్మశానానికి తీసుకెళ్లాడు. అక్కడ తన చేతుల్తో సమాధుల్ని తవ్వాడు. శవాల ఎముకల్ని బయటకు తీశాడు. శవాల మాంసాన్ని తిన్నాడు. నన్ను కూడా మాంసం తినమని అడిగాడు. దాదాపు వరుసగా నాలుగు రోజులు ఈ కల వచ్చింది. ఆ ఫ్లాట్‌లోనే నా పని మనిషి నా నెక్లెస్‌ను దొంగిలించింది’’ అని చెప్పుకొచ్చారు.