Naam 18 ఏళ్ళ తర్వాత సినిమా రిలీజ్

ఒక పెద్ద స్టార్ హీరో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల దాకా ఆగిపోతే మహా అయితే రెండు మూడేళ్ళకు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి సపోర్ట్ తో రిలీజవుతుంది. కానీ ఏకంగా 18 సంవత్సరాలు ల్యాబ్ లో ఉండి ఇప్పుడు బయటికి వస్తోందంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. అజయ్ దేవగన్ నటించిన నామ్ అనే మూవీ 2022లో థియేటర్లలో రానుంది. అనీజ్ బాజ్మీ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఇన్నేళ్లు బయటికి రాకుండా ఉండటం ఆశ్చర్యమే. అజయ్ అనీజ్ కాంబోలో ఇప్పటిదాకా మూడు చిత్రాలు వచ్చాయి. అవి దీవాన్ గీ, ప్యార్ తో హోనా హీ తా, హల్చల్. మూడు కమర్షియల్ హిట్లే. అయినా ఇలా జరగడం వింతే.

నామ్ లో కథానాయకుడు తన గతాన్ని మర్చిపోతాడు పేరుతో సహా. చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. తానెవరో తన ఉనికి ఏంటో తెలుసుకోవడానికి వేట మొదలుపెడతాడు. ఈ క్రమంలో జరిగే సంఘటనలే దీని కథ. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ బార్న్ ఐడెంటిటి ఆధారంగా రాసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి థీమ్ తోనే 1990లో కమల్ హాసన్ విజేతలు వచ్చింది. మంచి విజయం సాధించింది. మళ్ళీ ఈ నామ్ కూడా ఇంచుమించు అదే ప్లాట్ గా రూపొందింది. సరే ఇంత లేట్ కదాని నిర్మాతలు ఓటిటికి ఇవ్వడం లేదు. సమ్మర్ లో గ్రాండ్ థియేటర్ రిలీజ్ కే ప్లాన్ చేశారు. ఆ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు.

పోస్టర్ లో అజయ్ దేవగన్ మొహం చూస్తే చెప్పొచ్చు ఇదెంత పాత సినిమానో. ఇలా జరగడం చాలా అరుదు. సుమారు ముప్పై ఐదేళ్ల క్రితం అక్కినేని నాగేశ్వర్ రావు గారు నటించిన ప్రతిబింబాలు ఇలాగే రిలీజ్ కు నోచుకోకుండా ఆగిపోయింది. గత ఏడాది దీన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు కానీ వర్కౌట్ కాక వదలేశారు.అసలు వస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఇప్పుడీ నామ్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. అజయ్ దేవగన్ ఫాన్స్ కి మంచి ఉత్సాహం అనిపిస్తుంది కానీ సాధారణ ప్రేక్షకులు ఈ నామ్ ని రిసీవ్ చేసుకోవడం అనుమానమే. కొత్త సినిమాలకే థియేటర్ జనం గ్యారెంటీ లేదు. అలాంటిది ఇంత పాత చింతకాయ పచ్చడి అంటే వేరే చెప్పాలా

Show comments