iDreamPost
android-app
ios-app

విజయవాడ విజేత నుంచి వైజాగ్ వీరయ్య దాకా రవితేజ

  • Published Jan 09, 2023 | 5:53 PM Updated Updated Jan 09, 2023 | 5:53 PM
విజయవాడ విజేత నుంచి వైజాగ్ వీరయ్య దాకా రవితేజ

కొందరి హీరోల ప్రయాణం స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. వాళ్ళు ఇప్పుడీ స్థాయికి ఎదగడానికి చేసిన కృషి వెనుక ఎంత పట్టుదల ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అలాంటిదే మాస్ మహారాజా జర్నీ. తాజాగా జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ స్వయంగా చెప్పిన కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 1985లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై విడుదలైన విజేత అద్భుత విజయాన్ని సాధించింది. శతదినోత్సవ వేడుకలు విజయవాడ పిడబ్ల్యూడి గ్రౌండ్స్ లో కనివిని ఎరుగని రీతిలో నిర్వహించారు. దానికి వచ్చిన జన సందోహం గురించి అప్పటి పత్రికల్లో ప్రత్యేక కథనాలు వచ్చాయి. చిరులో యూత్ ఫాలోయింగ్ ని చూపించిన సందర్భమది

అక్కడి వచ్చిన లక్షలాది జనంలో రవితేజ ఉన్నాడు. తన స్నేహితులతో కలిసి వచ్చాడు. ఎక్కడో స్టేజి మీద దూరంగా ఉన్న చిరంజీవి కంటికి కనిపించడం లేదు. ఎప్పటికైనా పరిశ్రమలోకి వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్న తను ఫ్రెండ్స్ తో ఏదో ఒక రోజు సుప్రీం హీరో పక్కన కూర్చుంటానని అన్నాడు. వాళ్ళు తేలికగా తీసుకున్నారు. కట్ చేస్తే 1992లో గ్యాంగ్ లీడర్ హిందీ రీమేక్ ఆజ్ కా గూండారాజ్ లో చిరు పక్కన ఉండే బ్యాచ్ లో చిన్న వేషం దక్కింది. సినిమా హిట్ అయ్యింది కానీ అదంతా చిరు ఖాతాలోకి వెళ్లిపోయింది. దానికన్నా ముందు నాగార్జున చైతన్య, విజయశాంతి కర్తవ్యం, రాజశేఖర్ అల్లరి ప్రియుడులో చాలా చిన్న వేషాలు వేశారు రవితేజ

అలా కష్టపడి కష్టపడి మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ మెల్లగా విజయాలు దక్కించుకుంటున్న టైంలో 2000లో వచ్చిన అన్నయ్య అవకాశం రవితేజ కలను నిజం చేసింది. అందులో సపోర్టింగ్ రోలే అయినా చిరుతో స్క్రీన్ పంచుకోవడం. కామెడీ ఎమోషన్స్ లో భాగమవ్వడం మంచి పేరు తెచ్చింది. తర్వాత ఇడియట్ లాంటి బ్లాక్ బస్టర్లతో రవితేజ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. అప్పటి నుంచే మెగా బాండింగ్ అలా కొనసాగుతూ వచ్చింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వాల్తేరు వీరయ్యలో మరోసారి భాగమయ్యాడు. ఇంత డీటెయిల్డ్ గా రవితేజ చెప్పకపోయినా కీలక అంశాలను క్రోడీకరించుకుంటే జరిగింది ఇదే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చినవాళ్ళలో చిరు తర్వాత మంచి స్థాయికి వెళ్లినవాళ్ళలో రవితేజ పేరు మొదటిది