iDreamPost
iDreamPost
ప్రముఖ నటులు, దర్శకులు, నిర్మాత బాలయ్య (92) ఇవాళ కన్నుమూశారు. ఈ రోజే ఆయన పుట్టినరోజు కావడం కాకతాళీయం. యూసఫ్ గూడలోని స్వగృహంలో అనారోగ్యంతో తుదిశ్వాస తీసుకున్నారు. సౌమ్యుడిగా పేరున్న ఈయన తెలుగు సినిమా ప్రస్థానంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు. యువకుడిగా పరిశ్రమలో అడుగు పెట్టిన బాలయ్య మొదటి చిత్రం 1958లో విడుదలైన ఎత్తుకు పై ఎత్తు. పార్వతి కళ్యాణం, చివరకు మిగిలేది, బభృవాహన, బొబ్బిలి యుద్ధం, శ్రీకృష్ణ పాండవీయం, బాలభారతం, భక్త కన్నప్ప, కురుక్షేతం, చిరంజీవి రాంబాబు, పెద్దరికం, గాయం, అన్నమయ్య లాంటి ఎన్నో సూపర్ హిట్స్ లో గొప్ప పాత్రలు దక్కించుకున్నారు.
బాలయ్య నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్నారు. 1971లో కె విశ్వనాథ్ దర్శకత్వంలో శోభన్ బాబు హీరోగా తీసిన ‘చెల్లెలి కాపురం’ సూపర్ హిట్ అయ్యింది. 1973లో కృష్ణతో తీసిన ‘నేరము శిక్ష’ గొప్ప విజయం సాధించి మంచి లాభాలు కూడా ఇచ్చింది. ఈ రెండు సినిమాలకూ కథ ఆయనే అందించడం విశేషం. తర్వాత కృష్ణతోనే ఈనాటి ఈబంధం ఏనాటిదో, చుట్టాలున్నారు జాగ్రత్త, కిరాయి అల్లుడు లాంటి విజయవంతమైన చిత్రాలు తీశారు. చిరంజీవి ‘ఊరికిచ్చిన మాట’ ప్రొడ్యూసర్ బాలయ్యే. దీనికి స్టోరీ రైటర్ గా నంది అవార్డు అందుకున్నారు. దీనికన్నా ముందు చెల్లెలి కాపురం కూడా ఇదే పురస్కారాన్ని అందించింది.
ఇక దర్శకుడిగా బాలయ్య ప్రతిభ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 1983లో కృష్ణంరాజుతో తీసిన ‘నిజం చెబితే నేరమా’ యావరేజ్ గా నిలిచింది. 1986లో ‘పసుపుతాడు’ ఫెయిల్ కాగా 1994లో ‘పోలీస్ అల్లుడు’ భారీ బడ్జెట్ తో రూపొందినా సూపర్ స్టార్ కు హిట్ ఇవ్వలేకపోయింది. రఘుపతి వెంకయ్య అవార్డు బాలయ్యను వరించింది. స్వంత తండ్రిలాగా బాబాయ్ లాగా ఈజీగా కనెక్ట్ అయ్యే బాలయ్యది ఎంతో సహజమైన నటన. గుమ్మడి తర్వాత ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వస్తాయని అభిమానులు ఆశించారు. 300కి పైగా సినిమాల్లో భాగమైన బాలయ్య భౌతికంగా మనమధ్య లేకపోయినా వివిధ పాత్రల్లో సినిమాల్లో మాత్రం నిత్యజీవే