iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. ‘బాడీగార్డ్‌’ చిత్ర దర్శకుడి కన్నుమూత!

ఇండస్ట్రీలో విషాదం.. ‘బాడీగార్డ్‌’ చిత్ర దర్శకుడి కన్నుమూత!

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. టాలీవుడ్‌ టు హాలీవుడ్‌ ప్రముఖులంతా కన్నుమూస్తున్నారు. ముఖ్యంగా గుండెపోటు మరణాలు ఎక్కువయిపోయాయి. మొన్న ప్రముఖ కన్నడ చిత్ర హీరో రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించింది. ఈ విషాదంనుంచి తేరుకునే లోపే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్ధిఖీ గుండెపోటు కారణంగా మరణించారు. సోమవారం ఉదయం ఆయన గుండెపోటుకు గురికాగా.. కొచ్చిలోని అమ్రిత ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులు నుంచి ఆయన అక్కడే చికిత్స తీసుకుంటూ ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో వైద్యుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూశారు. గత నెల సిద్ధిఖీ లివర్‌ సంబంధిత వ్యాధికి శస్త్ర చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. సిద్ధిఖీ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఇక, సిద్ధిఖీ అంత్యక్రియలు ఈరోజు ఏర్నాకులంలో జరగనున్నాయి. సాయంత్రం 6 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.

ఈ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని ఉంచనున్నారు. కాగా, సిద్ధిఖీ తన మిత్రుడు లాల్‌తో కలిసి అసిస్టెంట్‌ సినిమా దర్శకుడిగా కెరీర్‌ను మొదలుపెట్టారు. 1983లో దర్శకుడు ఫాజిల్‌ దగ్గర పనికి కుదిరారు. తర్వాత రామ్‌జీ రావ్‌ స్పీకింగ్‌ అనే సినిమాతో దర్శకుడిగా మారారు. మలయాళంలో ఎన్నో హిట్టు సినిమాలను తెరకెక్కించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేశారు. 2020లో వచ్చిన ‘బిగ్‌ బ్రదర్‌’ ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా కావటం గమనార్హం. మరి, చిత్ర పరిశ్రమలో పెరుగుతున్న గుండెపోటు మరణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.