వడివేలు.. ఈ పేరు తెలియని సౌత్ మూవీ లవర్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. కామెడీ అంటే వడివేలు, వడివేలు అంటే కామెడీ అనే రేంజ్లో తన హాస్య ప్రతిభతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారాయన. తన కెరీర్లో దాదాపుగా తమిళంలోనే చిత్రాలు చేస్తూ వచ్చారాయన. అయితే అవి తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లోకి డబ్ కావడంతో ఆయన క్రేజ్ బాగా పెరిగింది. ముఖ్యంగా తెలుగు సినీ ప్రేక్షకులు వడివేలును బాగా ఆదరించారు. ఆయన హీరోగా నటించిన ‘హింసించే రాజు 23వ పులికేశి’ సినిమా ఇక్కడ కూడా మంచి స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ‘చంద్రముఖి’ మూవీ తెలుగు నాట వడివేలుకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.
తమిళంలో ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచిన ‘చంద్రముఖి’ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలసి వడివేలు కామెడీని అద్భుతంగా పండించారు. ఈ మూవీలో వడివేలు పాత్రకు తెలుగులో మరో స్టార్ కమెడియన్ బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పారు. ఆయనకు బ్రహ్మీ వాయిస్ సరిగ్గా సరిపోయింది. అలా కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పాపులారిటీ సంపాదించిన వడివేలు.. దాదాపు దశాబ్ద కాలం పాటు ఫిలిం ఇండస్ట్రీకి దూరమయ్యారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరమయ్యారాయన. ఒకటి, రెండు కాదు.. ఏకంగా పదేళ్లు లైమ్ లైట్‌కు దూరమయ్యారు వడివేలు. ఆయన పనైపోయిందని, ఇకపై ఈ కమెడియన్‌ను తెరపై చూడలేమని అంతా డిసైడ్ అయిపోయారు.
వడివేలు మాత్రం స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చారు. తన పని అయిందని అందరూ అనుకున్న టైమ్‌లో గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంగా తిరిగొచ్చారు. ఎప్పటిలా కమెడియన్ రోల్లో కాకుండా ఈసారి సీరియస్ క్యారెక్టర్లో మెరిశారు. ఉదయనిధి స్టాలిన్, ఫాహద్ ఫాజిల్, కీర్తి సురేష్ లాంటి స్టార్ నటులు యాక్ట్ చేసిన ‘మామన్నన్’ అనే తమిళ చిత్రంతో ఘనంగా రీఎంట్రీ ఇచ్చారు వడివేలు. ఇందులో ఈ కమెడియన్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. వడివేలు కామెడీనే చేస్తారనుకున్నాం.. ఆయనలో ఇంత మంచి నటుడు ఉన్నారా అని అందరూ ఆశ్యర్యపోతున్నారు. వడివేలుకు నేషనల్ అవార్డు పక్కా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.