KGF Chapter 2 : రాఖీ భాయ్ టార్గెట్ చాలా పెద్దది

KGF Chapter 2 : రాఖీ భాయ్ టార్గెట్ చాలా పెద్దది

ఆర్ఆర్ఆర్ హడావిడి జరుగుతోంది కాబట్టి కెజిఎఫ్ 2 టీమ్ ఇంకా పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. రాజమౌళి సినిమా చల్లబడ్డాక తమ అస్త్రాలను బయటికి తీయబోతున్నారు. ఇప్పటికి సైలెంట్ గా అనిపిస్తోంది కానీ ఏప్రిల్ 14 లోపు హైప్ అమాంతం ఎక్కడికో వెళ్ళిపోతుంది. స్టార్ హీరోల రేంజ్ లో దీనికీ తెల్లవారుఝామున ప్రీమియర్లు వేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. కర్ణాటకలో కాదు ఇక్కడే తెలుగు రాష్ట్రాల్లో కూడా షోలు వేస్తారట. రాఖీ భాయ్ అంచనాలు అలా ఉన్నాయి మరి. ఒక రోజు ముందు విజయ్ బీస్ట్ ఉన్నప్పటికీ దాని ప్రభావం తమిళనాడులో మాత్రమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి కెజిఎఫ్ నిర్మాతలు ధైర్యంగా ఉన్నారు.

ఇక ఏపి తెలంగాణకు సంబంధించి కెజిఎఫ్ 2 ఎంత బిజినెస్ చేయొచ్చనే దాని మీద రకరకాల లెక్కలు వినిపిస్తున్నాయి. 50 నుంచి 80 కోట్ల మధ్యలో నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలిమ్స్ ఆశిస్తున్నట్టుగా తెలిసింది. అయితే దీని హక్కులు సొంతం చేసుకున్న శ్రేయాస్ తో పాటు ఇతర సంస్థలు ఎంత పెట్టుబడి పెట్టాయనే వివరాలు మాత్రం బయటికి రాలేదు. ప్రతి ఏరియాకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ కొటేషన్లు అందుతున్న మాట వాస్తవం. కెజిఎఫ్ 1 తెలుగులో 25 కోట్ల దాకా రాబట్టింది. అలా చూసుకుంటే ఇప్పుడీ సీక్వెల్ కి వినిపిస్తున్న మొత్తం చాలా ఎక్కువ. అప్పటికి ఇప్పటికి సినిమా మీద బజ్ లో చాలా మార్పు వచ్చిందిగా.

కెజిఎఫ్ 2 రిలీజయ్యే నాటికి ఆర్ఆర్ఆర్ ఇప్పుడున్న రేంజ్ లో సందడి ఉండకపోవచ్చనే విశ్లేషణ ఉంది కానీ ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేం. టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్న కారణంగా ట్రిపులార్ చూడని శాతం ఇంకా భారీగానే ఉంది. మరి వాళ్ళు రెండు వారాలు అయ్యాక థియేటర్లకు వస్తారా అంటే చూడాలి. ఒకవేళ అదే జరిగితే కెజిఎఫ్ 2 మీద కొంత ప్రభావం ఉంటుంది. ట్రైలర్ వచ్చాక హైప్ ఎక్కడికో వెళ్ళిపోయిన రాఖీ భాయ్ ఈసారి ఏ రేంజ్ లో అలరిస్తాడోనని యాక్షన్ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. హిందీలో అదే తేదీకి ఇంకే బాలీవుడ్ మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ధైర్యం చేయలేకపోయారు. దెబ్బ అలా ఉంది మరి

Also Read : Prabhas : కమర్షియల్ వైపే చూస్తున్న ప్రభాస్

Show comments