iDreamPost
android-app
ios-app

విక్రమ్ రివ్యూ

  • Published Jun 04, 2022 | 12:14 PM Updated Updated Dec 05, 2023 | 4:57 PM

ఇక్కడ నితిన్ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడంతో థియేటర్ల పరంగా మంచి కౌంట్ దక్కింది.

ఇక్కడ నితిన్ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడంతో థియేటర్ల పరంగా మంచి కౌంట్ దక్కింది.

విక్రమ్ రివ్యూ

చాలా కాలంగా సరైన హిట్టు లేక మార్కెట్ తగ్గిపోయిన కమల్ హాసన్ కొత్త సినిమా విక్రమ్ నిన్న భారీ ఎత్తున విడుదలయ్యింది. ఇక్కడ నితిన్ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడంతో థియేటర్ల పరంగా మంచి కౌంట్ దక్కింది. మొదటి ఆట నుంచే తమిళనాడులో రికార్డుల వేట మొదలుపెట్టిన విక్రమ్ తెలుగులో ఆ స్థాయి స్పందన కాదు కానీ హౌస్ ఫుల్స్ అయితే మొదలుపెట్టింది. గత దశాబ్దంలో లోకనాయకుడి మూవీకి సోల్డ్ అవుట్ బోర్డులు కనిపించడం దీంతోనే కనిపించిందని చెప్పొచ్చు. మరి అంతగా చెప్పుకుంటున్న విక్రమ్ లో నిజంగా బలమైన మ్యాటర్ ఉందా, అందరినీ మెప్పించిందా, కమల్ రీ ఎంట్రీకి ఉపయోగపడిందా రివ్యూలో చూద్దాం

కథ

చెన్నై నగరంలో ముసుగులు కప్పుకున్న ఒక ముఠా కొందరిని కిడ్నాప్ చేసి వాళ్ళను దారుణంగా హత్య చేసి ఆ వీడియోలను పోలీసులకు పంపిస్తుంది. అలా చనిపోయిన వాళ్ళలో కర్ణన్(కమల్ హాసన్)ఉంటాడు. ఈ కేసుని అండర్ కవర్ గా ఉంటూ పరిశోధిస్తాడు అమర్(ఫహద్ ఫాసిల్). ఈ వ్యవహారానికి డ్రగ్స్ దందా నడిపించే సంతానాని(విజయ్ సేతుపతి)కి కనెక్షన్ ఉందని తెలుసుకుంటాడు. ఒక్కో చిక్కుముడి విప్పే క్రమంలో కర్ణన్ చనిపోలేదని, అతని అసలు 1986 తర్వాత కనిపించకుండా పోయిన ఏజెంట్ విక్రమ్ అని తెలుస్తుంది. అసలు అతను ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, వీళ్ళందరికీ ఉన్న కనెక్షన్ ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా

నటీనటులు

ఇది కమల్ హాసన్ వన్ మ్యాన్ షో. ఈ స్థాయిలో ఎలివేషన్ హీరోయిజంతో ఆయన్ను చూసి సంవత్సరాలు గడిచిపోయిన వాళ్లకు విక్రమ్ నిజంగా ఫుల్ మీల్స్ లాంటిది. ఫస్ట్ హాఫ్ లో కనిపించేది కాసేపే అయినా రెండో సగం మొత్తం తన కంట్రోల్ లోకి తీసుకున్నారు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో ఈ వయసులోనూ ఇంత కష్టపడటం చూస్తే ఇందుకే కదా ఇండియా బెస్ట్ యాక్టర్ ని అందరూ పొగుడుతారనిపిస్తుంది. గ్రాఫిక్స్ వర్క్ ఉన్నప్పటికీ కమల్ కష్టం చాలా ఫ్రేమ్స్ లో కనిపిస్తుంది. వయోభారాన్ని లెక్కచేయకుండా ఫ్యాన్స్ ని ఎలాగైనా సరే మెప్పించి తీరాలన్న కసి, కోపం, తపన చాలా చోట్ల స్పష్టంగా గమనించవచ్చు.

ఫహస్ ఫాసిల్ అదృష్టవంతుడు. కమల్ హాసన్ లాంటి లెజెండ్ మూవీలో గంటకు పైగా సోలోగా స్క్రీన్ స్పేస్ దక్కడమంటే మాములు విషయం కాదు. బక్కపలచని దేహంతో సీక్రెట్ ఆఫీసర్ గా ఫహద్ దానికి సంపూర్ణ న్యాయం చేశాడు. విజయ్ సేతుపతి రాను రాను మరీ బి గ్రేడ్ ఆరవ విలన్ లా మారిపోతున్నాడు. ఛాలెంజింగ్ క్యారెక్టర్ లాంటి పెద్ద పెద్ద మాటలు కాదు కానీ ఇలాంటి పాత్రలు చూడనివి కాదు ఎవరూ చేయనివి కాదు. కాకపోతే మక్కల్ సెల్వన్ ఇమేజ్ మార్కెట్ బిజినెస్ కి హెల్ప్ అవుతోంది. సూర్య కనిపించేది నాలుగైదు నిమిషాలే. మిగిలిన ఆర్టిస్టులు చాలానే ఉన్నారు కానీ కమల్ విజయ్ ఫహద్ ల ముందు ఎవరు గుర్తుటారు

డైరెక్టర్ అండ్ టీమ్

సీనియర్ స్టార్ హీరోలను డీల్ చేయడం ఈ రోజుల్లో పెద్ద సవాల్ గా మారుతోంది. పాత స్టైల్ లో చూపిస్తేనేమో అవుట్ డేటెడ్ అంటున్నారు. కొత్తగా చేస్తేనేమో ఈ వయసులో అవసరమా అంటారు. అందుకే యంగ్ జెనరేషన్ డైరెక్టర్లు వీళ్ళతో పెద్ద రిస్క్ చేయడం లేదు. హీరోల ఎలివేషన్లే సక్సెస్ ఫార్ములాగా మారుతున్న ట్రెండ్ లో దాని మీద ఆధారపడి కథను పెద్ద సీరియస్ గా పట్టించుకోవడం లేదు. విజయ్ తో మాస్టర్ తీసినప్పుడు లోకేష్ కనగరాజ్ ఫాలో అయ్యింది ఇదే. ఎప్పుడో వచ్చిన కమల్ హాసన్ ప్రొఫెసర్ విశ్వం, చిరంజీవి మాస్టర్, నసీరుద్దీన్ షా సర్ లను కలిపేసి తన హీరో ఇమేజ్ కి తగ్గట్టు కొలతలు వేసుకుని సూపర్ హిట్ కొట్టేశాడు.

విక్రమ్ లోనూ లోకేష్ అదే చేశాడు. ఇందులో గొప్ప కథంటూ పెద్దగా లేదు. సింపుల్ గా చెప్పుకుంటే కొడుకుని చంపిన గ్యాంగ్ ని ఒక్కొక్కరుగా మట్టుబెట్టి ఫైనల్ గా మెయిన్ విలన్ ని సఫా చేయడం. ఇంతే. ఇది వందల సార్లు తెరమీద ప్రయోగింపబడ్డ రొటీన్ ఫార్ములా. కానీ విక్రమ్ చూసి బయటికి వస్తున్నప్పుడు కనీసం అవును కదా అనే తలంపు కూడా రాదు. అంత గొప్పగా తన టేకింగ్ తో మేజిక్ చేశాడు లోకేష్. ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. కామన్ ఆడియన్స్ కొందరికి అసలేం జరుగుతుందో అర్థం కానంత కన్ఫ్యూజన్ కూడా అక్కడక్కడా ఉంటుంది. కానీ టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఆ లోపాన్ని కాపాడుతూ వచ్చింది.

లోకేష్ పాత కమల్ హాసన్ ని బయటికి తీయాలని తాపత్రయపడ్డాడు. అందులో సక్సెస్ అయ్యాడు కూడా. ఉత్తమ విలన్, విశ్వరూపం 2 లాంటి డిజాస్టర్లు ఆయా దర్శకుల పొరపాట్ల వల్ల ఫెయిలయ్యాయి కానీ పెర్ఫార్మన్స్ పరంగా కమల్ వాటిలోనూ బెస్ట్ ఇచ్చాడు. ఇది పసిగట్టిన లోకేష్ ఆ తప్పుని రిపీట్ చేయకుండా యాక్షన్ బ్లాక్స్ ని తీర్చిదిద్దిన తీరు మాస్ కి బాగా ఎక్కేస్తుంది. నిడివి మరీ ఇంత ఎక్కువ ఎందుకు పెట్టారో అంతు చిక్కదు. ఓ అరగంట కోత వేసుకుని ఇంటర్వెల్ బ్లాక్ ని త్వరగా సెట్ చేసుకుని ఉంటే ఎగ్జైట్ మెంట్ లెవెల్స్ పెరిగేవి. కర్ణన్ చనిపోయి ఉండడని చిన్నపిల్లాడు కూడా గెస్ చేస్తాడు. అదేదో పెద్ద ట్విస్ట్ లాగా అంత సుదీర్ఘంగా సాగదీయడం బాలేదు.

దర్శకుడిగా లోకేష్ పనితనం ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి మొదలవుతుంది. లెన్త్ ఎక్కువగా అనిపించే ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేసిన తీరు చూస్తే యూత్ ఇతన్ని ఎందుకు అంతగా ఇష్టపడతారో అర్థమవుతుంది. తన ఆలోచనా విధానం ప్రశాంత్ నీల్ కు దగ్గరగా ఉండటం క్లైమాక్స్ లో గమనించవచ్చు. ట్యాంకర్ సైజులో ఉండే మెషీన్ గన్ తో విధ్వంసం చేయడం ఇటీవలే కెజిఎఫ్ 2లో చూశాం కాబట్టి అది మరీ అంత కొత్తగా అనిపించకపోవచ్చు కానీ ఫ్యాన్స్ మాత్రం పూనకంతో ఊగిపోతారు. స్క్రీన్ ప్లే పకడ్బందీగా ఉండాలనే ఉద్దేశంతో సన్నివేశాలు నెమ్మదిగా చూపించే లోకేష్ కనగరాజ్ వేగం పెంచితే ఇతన్నుంచి మరిన్ని బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ని ఆశించవచ్చు.

ఒకటి మాత్రం నిజం. లోకేష్ ఖైదీ హ్యాంగోవర్ లోనే ఉన్నాడు. అందుకే పదే పదే ఆ సినిమా చూసి విక్రమ్ ని ఎంజాయ్ చేయండంటూ చెప్పుకుంటూ వచ్చాడు. నిజానికి ఆ అవసరం లేదు. అదేదో హోమ్ వర్క్ లాగా ఇలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. దానికి ఇందులో చిన్న లింక్ ఉన్న మాట వాస్తవమే కానీ అది మరీ అబ్బురపరిచే స్థాయిలో లేదు. ఇవన్నీ మీకు పాజిటివ్ కార్నర్ లో చెప్పడంలా అనిపించవచ్చు. కానీ మైనస్సులూ ఉన్నాయి. తన వైపు వేలెత్తి చూపించడానికి లోకేష్ అవకాశం ఇచ్చాడు. మూడు పవర్ హౌసెస్ ని డీల్ చేస్తున్నప్పుడు మొదటి నుంచి చివరి దాకా మైండ్ బ్లోయింగ్ అనిపించే కంటెంట్ ఉండాలి. కానీ అది పూర్తి స్థాయిలో లేదు.

కలకాలం ఉట్టి ఎలివేషన్లతో సినిమాలు నడిచే పరిస్థితి ఉండకపోవచ్చు. ఒక స్టేజి దాటాక జనానికి ఇవి బోర్ కొట్టేస్తాయి. ఎమోషనల్ ఫ్యాక్టర్ చాలా కీలకం. విక్రమ్ లో ఇది పూర్తిగా మిస్ అయ్యింది. తన కొడుకుతో బాండింగ్, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ కోసం మొదట్లో లేనిపోని కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయడం ఇవన్నీ పంటి కింద రాళ్లలా తోస్తాయి. మూడు గంటలకు దగ్గరగా వెళ్లేంత లెంతీ మెటీరియల్ కూడా ఇందులో లేదు. అలాంటప్పుడు రేసీగా సెట్ చేసుకుంటే బాగుండేది. దాదాపు సినిమా డార్క్ టోన్ లో సాగడం ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.కెజిఎఫ్,ఖైదీ, విక్రమ్ ఇలా చూసుకుంటూ పోతే బ్లాక్ థీమ్ అనే కామన్ ఎలిమెంట్ కనిపిస్తుంది.

అనిరుద్ రవిచందర్ కి యువత ఎందుకు వెర్రెక్కిపోతారో మరోసారి ఋజువయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాములుగా ఆడుకోలేదు. కొన్ని చోట్ల బిజిఎం గతంలో విన్నట్టే అనిపించినా ఫైనల్ గా మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ లో చూసినప్పుడు మాత్రం బెస్ట్ అనిపించుకుంటాడు. పాటలు సోసో. గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం టాప్ నాచ్. ఇంత కాంప్లికేటెడ్ టేకింగ్ ని ప్రతిభావంతంగా తెరకెక్కించడంలో ఈయన పాత్ర చాలానే ఉంది. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాగా మొహమాటపడింది. నిర్మాణ విలువలు మాత్రం రాజీ అనే పదానికి చోటివ్వలేదు. కంటెంట్ మీద నమ్మకంతో కాంప్రోమైజ్ కాకుండా ఖర్చు పెట్టేశారు.

ప్లస్ గా అనిపించేవి

ది ఓన్లీ కమల్ హాసన్
యాక్షన్ ఎపిసోడ్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఇంటర్వెల్ బ్లాక్

మైనస్ గా తోచేవి

ఫస్ట్ హాఫ్ ల్యాగ్
నిడివి
ఎమోషనల్ కనెక్టివిటీ
కొంత కన్ఫ్యూజ్ చేసే కథనం

కంక్లూజన్

మీరు కమల్ హాసన్ వీరాభిమాని లేదా యాక్షన్ మూవీ లవర్ అయితే థియేటర్ లోనే అనుభూతి చెందాల్సిన సినిమా విక్రమ్. అలా అని ఇదేదో నాయకుడు, విచిత్ర సోదరులు, భారతీయుడు సరసన చోటు కల్పించాల్సిన క్లాసిక్ కాదు. తప్పిపోయిన బిడ్డ ఓ పదేళ్ల తర్వాత తిరిగి వస్తే తండ్రికి ఎంత ఆనందం ఉంటుందో ఎన్నో ఏళ్లుగా మిస్ అయ్యాడనుకున్న వింటేజ్ కమల్ ని ఇందులో చూసుకోవడం ఫ్యాన్స్ కి అచ్చం అలాంటి ఫీలింగే కలిగిస్తుంది. సగటు ఫ్యామిలీ ఆడియన్స్ కి పెద్దగా నచ్చకపోవచ్చు కానీ గన్ ఫైరింగులు, ఫైట్లు, మాస్ ఎలివేషన్లు ఉంటే చాలు ఏదో మూడు గంటలు టైం పాస్ చేసేసుకుంటాం అనుకునేవాళ్లు విక్రమ్ ని ట్రై చేయొచ్చు.

ఒక్క మాటలో – యాక్షన్ బిర్యానీ

రేటింగ్ – 2.5 / 5