ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘జవాన్’ మూవీ గురించే వినిపిస్తోంది. నార్త్ నుంచి సౌత్ వరకు అంతా షారుక్ ఖాన్ లేటెస్ట్ ఫిల్మ్ గురించే మాట్లాడుకుంటున్నారు. కింగ్ ఖాన్ డ్యుయల్ రోల్లో నటించిన ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. షారుక్ కెరీర్లో ఇప్పటిదాకా అతిపెద్ద హిట్టుగా ‘పఠాన్’ మూవీని చెప్పొచ్చు. రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లతో ఈ సినిమా ట్రేడ్ పండితులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. వరుస పరాజయాలు రావడంతో కొంత గ్యాప్ తీసుకున్న షారుక్.. ‘పఠాన్’తో సూపర్బ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ‘పఠాన్’ రికార్డులను ‘జవాన్’ బ్రేక్ చేయడం ఖాయంలా కనిపిస్తోంది.
‘జవాన్’ మూవీ నార్త్‌తో పాటు సౌత్‌లోనూ హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ మూవీ రచ్చ రచ్చ చేస్తోంది. తెలుగు నాట మాత్రం ‘జవాన్’ హిందీ వెర్షన్‌కు భారీగా వసూళ్లు వస్తున్నాయి. ఈ సినిమాలో షారుక్ సరసన సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార నటించారు. అయితే ఈ మూవీలో ఆమె రెమ్యూనరేషన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ‘జవాన్’ కోసం నయన్‌కు భారీగా డబ్బుల్ని ముట్టజెప్పారట మేకర్స్. హీరోల రేంజ్లో ఆమెకు పారితోషికాన్ని అందజేశారని సమాచారం. కింగ్ ఖాన్‌తో నటించేందుకు లేడీ సూపర్‌స్టార్ ఏకంగా రూ.11 కోట్లు తీసుకున్నారని వినికిడి.
ఒకవేళ నయనతారకు పదకొండు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చుంటే మాత్రం విశేషమనే చెప్పాలి. ఒక సౌత్ హీరోయిన్‌కు బాలీవుడ్లో అంత పారితోషికం ఇవ్వడం గొప్పేనని సినీ పండితులు అంటున్నారు. అయితే స్టార్ హీరోల సినిమాలతో పాటు ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తూ సూపర్ స్టార్డమ్ సంపాదించిన నయన్‌కు అంత రెమ్యూనరేషన్ ఇవ్వడంలో తప్పే లేదని కొందరు నెటిజన్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే.. బాక్సాఫీస్ వద్ద బ్రేకుల్లేకుండా దూసుకెళ్తున్న ‘జవాన్’ మూవీ ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా అన్ని భాషల ఓటీటీ హక్కులు కలిపి రూ.250 కోట్లు ఆఫర్ చేశారట. అయితే ఇందులో ఎంత నిజం ఉందో మేకర్స్‌కే తెలియాలి.
ఇదీ చదవండి: ‘లియో’ తర్వాత అసలు కష్టాలు!