iDreamPost
android-app
ios-app

భారతీయ సినిమా మాటలు నేర్చిన వేళ

భారతీయ సినిమా మాటలు నేర్చిన వేళ

మే 3, 1913 న దాదాసాహెబ్ ఫాల్కే దర్శక, నిర్మాణంలో విడుదల అయిన తర్వాత చాలా సంవత్సరాలపాటు మౌనంగా అభిమానులను అలరించిన భారతీయ సినిమా మార్చి 14,1931 న విడుదల అయిన ఆలంఆరా సినిమాతో మాట్లాడి, పాట పాడడం మొదలుపెట్టింది. అర్దేశిర్ ఇరానీ ఈ సినిమాకు దర్శకత్వం వహించి, నిర్మించాడు. అంతకు నాలుగేళ్ల క్రితం అక్టోబర్ 6,1927న అమెరికాలో మొట్టమొదటి టాకీ సినిమా “ది జాజ్ సింగర్” విడుదల అయినప్పుడే మొదటి భారతీయ టాకీ సినిమాకు అర్దేశిర్ ఇరానీ మనసులో బీజం పడింది.

మొట్టమొదటి మూవీ మొఘల్

హాలీవుడ్ సినిమా నిర్మాణ సంస్థ యూనివర్సల్ స్టూడియో వారి సినిమాలకు పంపిణీదారుగా, బొంబాయిలోని అలెగ్జాండర్ సినిమా హాలు ఓనరుగా ఉన్న ఇరానీ సినిమా నిర్మాణంలోకి 1917లో ప్రవేశించాడు. అతను నిర్మించిన మొదటి సినిమా నలదమయంతి 1920లో విడుదల అయింది. 1922లో భారత చలనచిత్రరంగ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే దగ్గర పనిచేసిన భోగలాల్ దవేతో కలిసి స్టార్ ఫిలిమ్స్ సంస్థని ప్రారంభించి, పదిహేడు మూకీ సినిమాలకు దర్శకత్వం వహించి, నిర్మించాడు. దవే ఆ సంస్థ నుంచి నిష్క్రమించడంతో 1924లో బి. పి. మిశ్రా, నావల్ గాంధీ అనే ఇద్దరు యువదర్శకులతో కలిసి మెజస్టిక్ ఫిలిమ్స్ అన్న సంస్థ పేరుతో తను నిర్మాతగా ఆ ఇద్దరు దర్శకులుగా పదిహేను నిశ్శబ్ద చలనచిత్రాలు నిర్మించిన ఇరానీ, అది మూత పడ్డాక, 1925లో ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ స్థాపించి 62 చిత్రాలను నిర్మించాడు.

ఆ కంపెనీ బ్యానర్ మీద తీసిన ఆలంఆరా సినిమాతో భారతదేశపు టాకీ చలనచిత్ర పితామహుడు అయ్యాడు అర్దేశిర్ ఇరానీ. ఆ రోజుల్లో నలభై వేల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన 124 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాని నిర్మించి, దర్శకత్వం వహించడమే కాకుండా ఇరానీ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా అందించాడు. బొంబాయిలోని (నేటి ముంబయి) స్టూడియోలో నాలుగు నెలలపాటు నిర్మాణం జరుపుకుంది ఈ సినిమా. అప్పట్లో సౌండ్ రికార్డింగ్ కూడా షూటింగ్ సమయంలోనే జరిగేది. ఆ స్టూడియో రైల్వే లైనుకి దగ్గరగా ఉండడం వలన సినిమాలో రైళ్ళ శబ్దం రాకూడదని, రైళ్ల రాకపోకలు తక్కువగా ఉన్న రాత్రి వేళల్లో షూటింగ్ జరిపారు.

ఆలంఆరా గురించి మరిన్ని విశేషాలు

ఈ సినిమాలో హీరోయిన్ గా గుజరాత్ లోని సూరత్ ప్రాంతంలో ఉన్న సచిన్ అనే చిన్న సంస్థానానికి చెందిన నవాబు కూతురు జుబేదా నటించింది. మొదట్లో హీరోయిన్ పాత్రకు సులోచన అనే నటిని ఎంపిక చేసి, ఆమెకు హిందూస్థానీ భాష రాకపోవడంతో జుబేదాకి ఆ అవకాశం దక్కింది. హీరో పాత్రకి ముందు కొత్త నటుడు మెహబూబ్ ఖాన్ ని ఎంపిక చేసినా ఆ తర్వాత ఆ పాత్ర అప్పటికే విజయవంతమైన చిత్రాలలో నటించి ఉన్న మాస్టర్ విఠల్ కి దక్కింది. మెహబూబ్ ఖాన్ ఆ తర్వాత దర్శకత్వం చేపట్టి, దర్శక నిర్మాతగా చాలా సినిమాలు తీశాడు. వాటిలో ఆల్ టైమ్ గ్రేట్ సినిమాలలో ఒకటైన మదర్ ఇండియా కూడా ఉంది. ఏడు పాటలు ఉన్న ఈ సినిమాలో వచ్చే “దే దే ఖుదాకే నామ్ పర్” అనే పాట భారత చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి పాట. సినిమాలోని ఫకీరు పాత్రలో నటించిన వజీర్ మహమ్మద్ ఖాన్ పాడాడు ఈ పాటని. పాత్రధారులు ఎవరి పాటలు వారే పాడాలి కాబట్టి ఫకీరు పాత్రకు అవసరమైన బొంగురు గొంతు ఉందని స్టూడియో వాచ్ మన్ అయిన మహమ్మద్ ఖాన్ చేత ఆ పాత్ర వేయించాడు అర్దేశిర్ ఇరానీ. ఈ సినిమాలో సైన్యాధికారి పాత్రలో ప్రఖ్యాత హిందీ హీరో రాజ్ కపూర్ తండ్రి పృధ్వీరాజ్ కపూర్ నటించాడు.

ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ నిర్మించిన ఈ సినిమాలో హీరోగా నటించే నాటికి మాస్టర్ విఠల్ శారదా స్టూడియో అనే మరో కంపెనీ చిత్రాల్లో మాత్రమే నటించేలా ఒప్పందం చేసుకుని ఉన్నాడు. దాంతో అ కంపెనీ అతని మీద కోర్టులో కేసు వేసింది. ఆ కేసులో విఠల్ తరఫున మహమ్మద్ అలీ జిన్నా వాదించారు. స్వాతంత్య్రం తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడు అయిన జిన్నాకి సినిమా అంటే విపరీతమైన అభిమానం. దాంతో విఠల్ తరఫున ఎలాంటి ఫీజూ తీసుకోకుండా ఉచితంగా వాదించి, కేసు గెలిపించాడు జిన్నా.

తీరా షూటింగ్ మొదలయ్యాక మాస్టర్ విఠల్ గొంతు తన పాత్రకు నప్పలేదనిపించింది ఇరానీకి ఆ దశలో హీరోని మార్చడం సాధ్యం కాక స్క్రిప్టులో మార్పులు చేసి హీరో ఎక్కువ మాట్లాడకుండా స్పృహలో లేకుండానో, మైకంలో ఉన్నట్టుగానో చూపించాడు. మొదటిసారి తెరమీద పాత్రలు మాట్లాడడం, పాటలు పాడడం చూపించిన ఆలంఆరా సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
తెలుగు వాడైన హెచ్. ఎం. రెడ్డి ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి, మరుసటి సంవత్సరం తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద ని తన దర్శకత్వంలో నిర్మించాడు.

అర్దేశిర్ ఇరానీ 1931లో ఇంగ్లీషు భాషలో నూర్జహాన్ అనే సినిమాను, 1933లో పర్షియన్ భాషలో డాఖ్తోర్ ఏ లోర్ అనే సినిమాను నిర్మించాడు. 1937లో భారతదేశపు మొదటి రంగుల చలనచిత్రం కిసాన్ కన్యను నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఆలంఆరా విజయం తర్వాత ఇరానీ తను గతంలో నిర్మించిన నిశ్శబ్ధచిత్రాలను అదే నటీనటులతో టాకీ సినిమాలుగా రూపొందించి విజయవంతం చేశాడు.

1945లో తన ఆఖరి చిత్రం పూజారి నిర్మించిన అర్దేశిర్ ఇరానీ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో తన స్టూడియోని శాశ్వతంగా మూసివేసి, చిత్రరంగానికి వీడ్కోలు పలికి, తన 82వ యేట ,14 అక్టోబర్, 1969న బొంబాయిలో మరణించాడు.

******
సన్నపరెడ్డి కృష్ణారెడ్డి