iDreamPost
iDreamPost
అగ్ర నిర్మాతగా గీత ఆర్ట్స్ అధినేతగా అల్లు అరవింద్ కున్న పేరు ప్రఖ్యాతులు తెలిసిందే. చిరంజీవికి ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ అందించిన ఘనతతో పాటు ఇప్పటి తరం హీరోలతోనూ ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న ట్రాక్ రికార్డు ఆయనది. అలాంటి అల్లు నిర్మాణ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అల్లు బాబీ మాత్రం మొదటి అడుగులోనే తడబడ్డారు. పెద్ద బడ్జెట్ తో వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా భారీ డిజాస్టర్ గా నిలవనుంది. మూడు రోజులకు కలిపి ఇప్పటిదాకా వచ్చిన షేర్ కనీసం నాలుగు కోట్లు టచ్ కాకపోవడం ట్రేడ్ ని, ఫ్యాన్స్ ని విస్మయపరిచింది.
ఆర్ఆర్ఆర్ నెమ్మదించినప్పటికీ గనికి ఇలా జరగడానికి ప్రధాన కారణం పబ్లిక్ టాకనే చెప్పాలి. కథలో ఎలాంటి కొత్తదనం లేకపోవడం, చాలా ఫ్లాట్ గా కథనం నడిపించిన తీరు అంతో ఇంతో థియేటర్ కు వచ్చిన జనాలను మెప్పించలేకపోయాయి. దీనికా పాతిక కోట్లు ఖర్చు పెట్టారనే కామెంట్స్ వచ్చాయి. అరవింద్ లాంటి అనుభవజ్ఞులు దీన్ని ముందుగా అంచనా వేయలేకపోయారా లేదా బాబీ ఎవరి ప్రమేయం లేకుండా తీసుకున్న నిర్ణయమో తెలియదు కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. మరో పార్ట్ నర్ సిద్దు ముద్దకు సైతం చేదు అనుభవం తప్పలేదు. ఈ వారం బీస్ట్, కెజిఎఫ్ 2 వస్తన్న నేపథ్యంలో గని ఎలాంటి అద్భుతాలు చేయలేదు.
థియేట్రికల్ బిజినెస్ కోణంలో చూసుకుంటే గని సుమారు 25 కోట్ల దాకా వరల్డ్ వైడ్ షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది. గతంలో గద్దలకొండ గణేష్ ఈ ఫీట్ సాధించింది. ఫిదా ఏకంగా 40 కోట్లకు పైగానే రాబట్టింది. ఎఫ్2 అప్పటి రికార్డులు బద్దలు కొట్టింది. ఇంత ట్రాక్ రికార్డు ఉన్న మెగా ప్రిన్స్ కి గనికి వచ్చిన వసూళ్లు షాక్ ఇచ్చేవే. చాలా కష్టపడి బాడీ బిల్డ్ చేసుకుని మరీ గని కోసం రెడీ అయితే ఇలా అయ్యిందేమిటాని అభిమానులు ఫీలవుతున్నారు. ఇక ఇది గతం గతః కాబట్టి అల్లు బాబీ నెక్స్ట్ ప్రాజెక్టు కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి అడుగు కాబట్టి తడబడ్డారు కానీ మూల్యం మాత్రం భారీగానే చెల్లించాల్సి వచ్చింది