Dharani
Dharani
ఈమధ్యకాలంలో ట్రాన్స్‌జెండర్‌లతో ప్రేమ, పెళ్లిళ్లకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ట్రాన్స్‌జెండర్ పర్సన్స్‌తో వివాహం, ప్రేమ, అందుకోసం లింగ మార్పిడి చేసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. మాజీ సీఎం కుమార్తె ఒకరు.. లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకోవడం సంచలనంగా మారింది. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య.. లింగమార్పిడి చేయించుకున్నారు. ఆమె వయసు 41 సంవత్సరాలు. తాను పుట్టుకతోనే మహిళను అయినప్పటికి.. చిన్నప్పటి నుంచి మానసికంగా పురుషుడిలాగానే జీవిస్తున్నట్లు తెలిపారు. మానసికంగానే కాకుండా శారీరకంగానూ పురుషుడిగా మారాలని ఆమె ఇటీవల నిర్ణయించుకుంటుంది. ఇదే విషయంపై ఆమె న్యాయ నిపుణులు, వైద్యులు, ఇతర నిపుణుల సలహాలు తీసుకున్నారని తెలిపారు.
సుచేతన భట్టాచార్య.. ఇటీవల నిర్వహించిన ఎల్‌జీబీటీక్యూ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. ఊహ తెలిసిన దగ్గర నుంచి తనను తాను పురుషుడిగా భావిస్తోన్న సుచేతన భట్టాచార్య.. ఈ కార్యక్రమంలో వారి మాటలు విన్న తర్వాత.. తన ఆలోచనల మీద ఆమెకు ఒక స్పష్టత వచ్చింది అని తెలిపారు. దాంతో పురుషుడిగా మారాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల మానసికంగానే కాక.. శారీరకంగా కూడా పురుషుడిలానే ఉండాలనే తన కోరిక నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉన్నానని తెలిపారు. లింగ మార్పిడి ఆపరేషన్ తర్వాత.. తన పేరును సుచేతన భట్టాచార్య నుంచి సుచేతన్‌గా మార్చుకోనున్నట్లు తెలిపారు. తన నిర్ణయం వెనక ఎవరి బలవంతం లేదని.. తానే స్వయంగా ఇలా నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
పైగా ఇన్నాళ్లు తాను ట్రాన్స్‌మ్యాన్‌గా ఎదుర్కొంటున్న సామాజిక వేధింపులను తట్టుకునేందుకు ఈ లింగ మార్పిడి ఆపరేషన్ తనకెంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తన మనస్ఫూర్తిగా ఈ నిర్ణయం తీసుకున్నానని.. ఈ విషయంపై ఎవరు ఎలాంటి వివాదం, రాద్ధాంతం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తన నిర్ణయం పట్ల తన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు. ఈ విషయంలోకి తన తల్లిదండ్రులను లాగవద్దని మీడియాకు సూచించారు. బాల్యం నుంచి తన తండ్రికి తన గురించి పూర్తిగా తెలుసని.. ఆయన తన నిర్ణయానికి మద్దతు ఇస్తారని వెల్లడించారు.