Krishna Kowshik
Krishna Kowshik
వెండితెరపై మంచి మార్కులు కొట్టేసి.. బుల్లితెరపై కూడా సత్తా చాటి ఓ వెలుగు వెలిసిన నటుడు రాజ్ కుమార్. జూనియర్ చిరంజీవిగా గుర్తింపు పొందిన ఆయన.. పలు సినిమాలతో పాటు సీరియల్స్‌లో నటించారు. దాసరి శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రాజ్ కుమార్.. అమ్మ రాజీనామా, డబ్బు భలే జబ్బు, వద్దు బావా తప్పు, నాగబాల, పరువు ప్రతిష్ట, సంసారాల మెకానిక్, పచ్చని సంసారం, కాలేజీ బుల్లోడు, ఎన్టీఆర్ నగర్ వంటి చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ,కన్నడ సినిమాల్లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వెండి తెర నుండి బుల్లి తెర మీదకు వచ్చారు. విధి, మనోయజ్ఞం, పవిత్ర బంధం వంటి సీరియల్స్‌లో యాక్ట్ చేశారు. ఆ తర్వాత తెలుగు పరిశ్రమ నుండి కన్నడ సీమకు మారి.. అక్కడ సినిమాలు రూపొందించారు.
చిరంజీవిలా ఉండటమే తనకు మైనస్ అయ్యిందన్న ఆయన.. ఆయన తమ్ముడు అత్తారింటికి దారేది మూవీ వల్ల మూడు కోట్లు నష్టపోయానని చెబుతున్నారు. హీరోగా, నిర్మాతగా మారి సినిమాలు చేయడంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో రాజ్ కుమార్ మాట్లాడుతూ.. తానే నిర్మాతగా మారి, సినిమాలు చేయడం వల్ల నష్టపోయాయని, అలా కాకుండా తన తోటి స్నేహితుల్లా సీరియల్స్‌లో పెట్టుబడులు పెట్టి ఉంటే ఈ పాటికి ఇంకో స్థాయిలో ఉండేవాడినని అన్నారు. గతంలో మంచి సీరియల్స్ ను రూ. 30 లక్షలు, రూ. 50 లక్షల్లో తీసేవాళ్లని, కానీ ఇప్పుడు కోట్లు అవుతన్నాయన్నారు. తాను అప్పుడే తీసి ఉంటే తన బ్రాండ్ వాల్యూ, ప్రొడక్షన్ కంపెనీ ఇంకో స్థాయిలో ఉండేదని అన్నారు. కానీ తాను సీరియల్స్ వైపు కాకుండా సినిమాలు తీశానని చెప్పారు.
‘బారిస్టర్ శంకర్ నారాయణ్ అనే సినిమా తీశాను. అది తమిళ సినిమాకు రీమేక్. నేనే నటించి, నిర్మించిన చిత్రం. చిన్న నిర్మాతను అయినప్పటికీ అందరు ముందుకు వచ్చారు, డిస్ట్రిబ్యూటర్లు కూడా సాయం చేశారు. సెప్టెంబర్ 21న సినిమా రిలీజ్ చేశాం. అయితే అదే ఏడాది అక్టోబర్ 12న తర్వాత అత్తారింటికి దారేది రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆ సినిమా ఎడిటింగ్ రూం నుండి సగం మూవీ లీక్ అయిపోవడంతో పెద్ద ఇష్యూ అయ్యి.. సెప్టెంబర్ 28నే రిలీజ్ చేశారు. ఆ మూవీ కోసం నా మూవీని థియేటర్ల నుండి తీసేశారు. అన్ని చోట్ల ఆ మూవీని వేశారు. నాకు కేవలం 17 థియేటర్లే మిగిలాయి. రెండు వారాలు దాటే సరికి సినిమా థియేటర్లలో తీసేశారు. ఒక్కసారిగా తేరుకోలేకపోయాను. ఆ సినిమాకు పెట్టుబడి అంతా నాదే. నా సినిమా థియేటర్ల నుండి తీసేయడంతో రూ. 3 కోట్లు నష్టపోయాను. అదే ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టి ఉండే ఇప్పుడు రూ. 30 కోట్లు అయ్యేది. నా జీవితంలో చేసిన తప్పు ఇదే’ అని చెప్పుకొచ్చారు రాజ్ కుమార్.