ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు అంతా బేబీ సినిమా మేనియాలో ఉన్నారు. ఇటీవలకాలంలో ఒక చిన్న సినిమాకు ఇంత రెస్పాన్స్ రావడం చూడలేదు. ఎక్కడ చూసినా బేబీ సినిమా గురించి చర్చ జరుగుతోంది. బాక్సాఫీసు వద్ద కూడా ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాపై ఎంతో మంది సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమా చూశాను.. ఆకట్టుకుంది అంటూ కామెంట్ చేశారు. ఐకాన్ స్టార్ కోసం బేబీ మూవీ టీమ్ స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేసింది.
అల్లు అర్జున్ కు బేబీ సినిమా బాగా నచ్చినట్లు చెప్పారు. సినిమా చూడగానే నిర్మాత ఎస్కేఎన్, డైరెక్టర్ సాయి రాజేశ్ లను పిలిపించుకుని అభినందించారు. చిత్ర యూనిట్ మొత్తాన్ని అభినందించాలని ఈవెంట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమంలో బన్నీ రావడానికి ముందే స్టేజ్ మీద ఒక ఎమోషనల్ ఘటన ఒకటి జరిగింది. బేబీ సినిమాకి కెమెరామ్యాన్ గా వ్యవహరించిన బాలిరెడ్డి.. డైరెక్టర్ మారుతీ కాళ్ల మీద పడి ఎమోషనల్ అయ్యాడు. ఎంఎన్ బాలిరెడ్డి మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీలో ఈ స్థాయికి రావడానికి గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి ఉన్నారంటూ వ్యాఖ్యానించాడు. అది మరెవరో కాదు.. డైరెక్టర్ మారుతీ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మారుతీని ఒకసారి స్టేజ్ మీదకు రావాలంటూ రిక్వెస్ట్ చేశాడు. మారుతి వద్దులే అంటూ చేతులు ఊపుతూనే ఉన్నాడు. కానీ, బాలిరెడ్డి మాత్రం పైకి రావాల్సిందే అంటూ విజ్ఞప్తి చేశాడు. ఇంక చివరికి మారుతీ స్టేజ్ మీదకు వెళ్లాడు.
స్టేజ్ మీదకు వస్తూనే మారుతీ.. బాలిరెడ్డిని హగ్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ, బాలిరెడ్డి మాత్రం కాళ్ల మీద పడ్డాడు. నన్ను ఇప్పటి వరకు ప్రోత్సహించారు. ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేను అంటూ బాలిరెడ్డి ఎమోషనల్ అయ్యాడు. అంతేకాకుండా నాకు అబ్జక్షన్ చెప్పకండి అంటూ.. మోకాళ్ల మీద కూర్చుని డైరెక్టర్ మారుతి రెండు కాళ్లు పట్టుకుని తన అభిమానాన్ని, మారుతికి తన హృదయంలో ఉన్న స్థానాన్ని చాటుకున్నారు. బాలిరెడ్డి చేసిన పనికి మారుతి కూడా ఎమోషనల్ అయిపోయాడు. బాలిరెడ్డితో చేయాలి అనుకున్న ప్రతిసారి కుదరలేదు. కానీ, సాయి రాజేశ్.. బాలిరెడ్డికి చాలా మంది అవకాశం ఇచ్చాడు. బాలిరెడ్డి ఎన్నో రోజులుగా కష్టపడుతున్నాడు. ఇప్పుడు పెద్ద కెమెరామ్యాన్ అవ్వడం సంతోషంగా ఉందంటూ మారుతి వ్యాఖ్యానించాడు. మొత్తానికి థాంక్స్ మీట్ కాస్తా.. బాలిరెడ్డి- మారుతి మధ్య జరిగిన సంభాషణతో ఎమోషనల్ అయ్యింది.