Swetha
ఒకప్పటి సినీ ప్రపంచాన్ని ఏలిన ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు, నటీ నటులు.. ఇప్పుడు మన మద్యన భౌతికంగా లేకపోయినా.. సినిమాల రూపంలో సినిమాలలో వారు నటించిన పాత్రల రూపంలో మాత్రం.. ఎన్ని తరాలైన జీవిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో ఒకరైన ప్రత్యేకమైన వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పటి సినీ ప్రపంచాన్ని ఏలిన ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు, నటీ నటులు.. ఇప్పుడు మన మద్యన భౌతికంగా లేకపోయినా.. సినిమాల రూపంలో సినిమాలలో వారు నటించిన పాత్రల రూపంలో మాత్రం.. ఎన్ని తరాలైన జీవిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో ఒకరైన ప్రత్యేకమైన వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Swetha
“భానుమతి రామకృష్ణ” ఒకప్పటి తరంలో ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. అత్తగారి పాత్రలకు పెట్టింది పేరు భానుమతి. ఆరణాల తెలుగింటి అత్తగారి పాత్రలలో దాదాపు అర్ధశతాబ్దం పాటు.. భానుమతి అనే పేరు మారుమోగిపోయింది. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో తన సహజ నటనా ప్రావిణ్యం కనబరిచి.. సినీ వినీలాకాశంలో చెరగని పేరును సంపాదించుకున్నారు భానుమతి. అందుకేనేమో ఇప్పటికి సినీ కళామతల్లి ఆమె పేరును తలుస్తూనే ఉంది. ఆవిడ ఎన్ని చిత్రాలు నటించిన అందరు ముందుగా ప్రస్తావించేది మాత్రం “మంగమ్మ గారి మనవడు” చిత్రం. అయితే, ఈ చిత్రాన్ని బాలకృష్ణతో చేయాలనే ఆలోచన, సినిమా ప్రారంభం కావడం వెనుక ఉన్న విశేషాలు అన్ని.. ఆమధ్య కాలంలో దివంగత కోడి రామకృష్ణ.. ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎస్.గోపాలరెడ్డి, దర్శకుడు కోడి రామకృష్ణ.. వీరిద్దరి కాంబినేషన్ లో సిల్వర్ జూబ్లీగా వచ్చిన చిత్రం “మంగమ్మ గారి మనవడు”. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. అంతేకాకుండా ఈ చిత్రం కొన్ని థియేటర్లలో 365 రోజులు ప్రదర్శింపబడి చరిత్ర సృష్టించింది. అయితే, ఈ సినిమాకు హీరో ఎంపిక ఎలా జరిగిందో.. ఒకప్పుడు కోడి రామకృష్ణ చెప్పిన మాటల్లోనే తెలుసుకుందాం. “గోపాలరెడ్డితో నా ప్రయాణం ‘ముక్కుపుడక’ చిత్రంతో ప్రారంభమైంది. ఆ సినిమా తర్వాత విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేద్దామని కథ రెడీ చేసుకున్నాం. కొత్త సినిమాకు హీరో విషయమై చాలా డిస్కస్ చేసి.. చివరికి అప్పుడే హీరోగా ఎదుగుతున్న బాలకృష్ణను దృష్టిలోకి తీసుకున్నాం. కానీ, అప్పట్లో సినిమా నిర్మాణంలో డిస్ట్రిబ్యూటర్ల ప్రమేయం కూడా ఉండేది. మొదట మా డిస్ట్రిబ్యూర్ బాలకృష్ణను ఒప్పుకోకపోయినా.. ఆ తర్వాత ఒప్పుకున్నారు. వెంటనే ఈ సినిమాలో బామ్మ క్యారక్టర్ ఉంది కదా.. దానికి ఎవరిని ఎంపిక చేసుకోవాలి అనే ఆలోచన వచ్చింది. దానికి భానుమతిగారైతే బాగుంటుందని సలహా ఇచ్చాను.
దానికి గోపాలరెడ్డి ఎంతో భయపడిపోయాడు. భానుమతిగారితో సినిమానా.. ఆవిడ్ని చూస్తేనే నాకు భయం అన్నాడు. ఇక డిస్ట్రిబ్యూటర్ కూడా భానుమతిగారితో సినిమానా.. ఈ ప్రాజెక్ట్ జరగదు అని తేల్చి చెప్పేశారు. ఒకసారి ఆమెను అడిగి చూస్తే తప్పేముంది అనుకుని గోపాలరెడ్డి, నేను కలిసి భానుమతి గారింటికి వెళ్ళాము. కథ వినిపించి బాలకృష్ణతో చేద్దామనుకుంటున్నామని చెప్పాము. దానికి ఆవిడ ‘చాలా మంచి కుర్రాడు. తండ్రిలాగే డిసిప్లిన్ ఉంది’ అన్నారు. ఆ తరువాత అందులో బామ్మ క్యారెక్టర్ మీరు చెయ్యాలి అని అడిగాము. వెంటనే ‘దానిదేముంది వాళ్ళ నాన్నకు కూడా నేను బామ్మగా నటించాను.. తప్పకుండా చేస్తాను’ అన్నారు. మీరు టైం కి రారని, యారగెంట్‌గా ఉంటారని అందరూ చెబుతున్నారు.. గోపాలరెడ్డి మీ విషయంలో భయపడుతున్నాడు అని అన్నాను. దానికి ఆవిడ ‘గోపాల్ ఎందుకు భయపడుతున్నావు. నేను అలాంటి దాన్ని కాదు. డిసిప్లిన్ నుంచి వచ్చాను, నేను 35 రోజుల్లో పూర్తి చేస్తాను. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, నువ్వు ఏది చెబితే అది చేస్తాను. నువ్వు ఎంత ఇస్తే అంతే తీసుకుంటాను.. ఇది చాలా’ అని అన్నారు.
దానితో గోపాల్ రెడ్డి ఆమె కాళ్ళకు నమస్కారం చేసి ‘ఇది చాలమ్మా’ అన్నాడు. వారం రోజుల తర్వాత సినిమాలో ఆమె పోర్షన్ డైలాగులు రాయించాం. ఆ డైలాగులు విన్న వెంటనే కుర్చీని ఒక్కసారి కాలితో గట్టిగా తన్నారు భానుమతి. ‘ సినిమా లేదు, ఏం లేదు ఇక్కడి నుంచి వెళ్లిపోండి. ఈ డైలాగులు నేను చెప్పాలా? ఇలాంటి డైలాగులు భానుమతి చెబుతుందనుకున్నారా?’ అంటూ కోపంతో ఊగిపోయారు.
నేను, గోపాలరెడ్డి భయపడిపోయి.. డైలాగ్స్ మార్చి తీసుకొస్తాం అంటూ అక్కడి నుంచి వచ్చేశాము. ఈ ఘటన తర్వాత ‘ఆ డైలాగులు చెప్పకపోతే ఇక సినిమా ఏం ఉంటుంది’ అంటూ గోపాలరెడ్డి నీరసపడిపోయాడు. ఏం జరుగుతుందో చూద్దాం అన్నాను. వారం తర్వాత పోరూర్‌లో షూటింగ్ మొదలు పెట్టాం.
భానుమతిగారికి ఫాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అందుకే చుట్టుపక్కల ఊళ్ళ నుంచి జనం విపరీతంగా వచ్చారు. అప్పుడు ఇంటి ముందు పనిమనిషితో సీన్. అయితే భానుమతిగారిలో ఉన్న మైనస్ ఏంటంటే.. మొదటిరోజు షూటింగ్‌లో చాలా టెన్షన్ పడతారు. అదే మాకు ప్లస్ అయింది. ఆ టెన్షన్‌లోనే డైలాగ్ చెప్పేశారు. ‘ఓరి నీ భయం కూలిపోను. వెనకటికి నీలాంటి భయంగల బల్లి బట్టలిప్పేసి నీళ్లోసుకుంటూ బావగారొచ్చారని లేచి నిలబడిరదట’ అనే డైలాగ్ చెప్పారు. షాట్ ఓకే అయింది. అక్కడికి వచ్చిన జనం ఆ డైలాగ్ విని చప్పట్లు కొట్టారు, విజిల్స్ వేశారు.
కానీ భానుమతిగారికి విషయం అర్థం కాక ‘ఎందుకు ఈ డైలాగ్‌కి అందరూ చప్పట్లు కొడుతున్నారు’ అని అడిగారు. మీరు ఇంతకుముందు డైలాగ్స్ చెప్పనని అన్నారు కదా.. అందులో డైలాగే ఇది అని చెప్పాను. దానికామె ఆశ్చర్యపోయి.. ఒక్క డైలాగ్‌కే ఇంత రెస్పాన్స్ వచ్చిందంటే.. సినిమా మొత్తం ఇంతకముందు రాసిన డైలాగ్స్ చెబితే ఎంత రెస్పాన్స్ వస్తుంది? అని ఆమెను రిక్వెస్ట్ చేస్తూ అన్నాను. దానికామె పాజిటివ్‌గా స్పందిస్తూ ‘ఓకే నువ్వు చెప్పినట్టే చేస్తాను’ అని.. అవే డైలాగులు చెప్పి సినిమా పూర్తి చేశారు. ఆ తర్వాత సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే” అంటూ చెప్పుకొచ్చారు కోడి రామ కృష్ణ. ఏదేమైనా భానుమతి గారు కొన్ని దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు. మరి మంగమ్మ గారి మనవడు చిత్ర సమయంలో జరిగిన విషయాలను.. అప్పట్లో కోడి రామకృష్ణ గారు పంచుకోవడం.. అవి మళ్ళీ ఇప్పుడు అందరూ గుర్తుచేసుకోవడంపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.