iDreamPost
android-app
ios-app

Beast : విజయ్ కొత్త సినిమాలో పాత ట్విస్టులా

  • Published Apr 04, 2022 | 3:07 PM Updated Updated Apr 04, 2022 | 3:07 PM
Beast : విజయ్ కొత్త సినిమాలో పాత ట్విస్టులా

నిన్న విడుదలైన విజయ్ బీస్ట్ ట్రైలర్ సంచలనాలు రేపుతోంది. కేవలం తమిళ వెర్షన్ మాత్రమే వదిలారు కానీ వీడియోలో కంటెంట్ ఈజీగా అర్థమయ్యేలా ఉండటంతో మనవాళ్ళు కూడా సబ్ టైటిల్స్ సహాయంతో చూసేస్తున్నారు. రిలీజ్ కు కేవలం 10 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో యూనిట్ ప్రమోషన్ వేగం పెంచింది.ఒకపక్క ఆర్ఆర్ఆర్ సునామి కొనసాగుతూ ఉండటం కొంత టెన్షన్ పెడుతున్నప్పటికీ అప్పటికి ఇరవై రోజులు అవుతుంది కాబట్టి జనం దీని వైపు వస్తారనే నమ్మకంతో టీమ్ ఉంది. అయితే కేవలం ఒక రోజు గ్యాప్ తో కెజిఎఫ్ చాప్టర్ 2 రావడం ఇబ్బందే కానీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ మాత్రం రిజల్ట్ పట్ల చాలా ధీమాగా కనిపిస్తోంది.

వీటి సంగతి కాసేపు పక్కనపెడితే బీస్ట్ కథ దేని గురించో పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఒక పెద్ద షాపింగ్ మాల్ ని టెర్రరిస్టులు హైజాక్ చేస్తారు. వందలాది మందిని బందీలుగా ఉంచేస్తారు. అనుకోకుండా అందులో హీరో విజయ్ కూడా ఉంటాడు. తనో ఆఫీసరనే విషయం ఎవరికీ తెలియదు. చిక్కుకున్న వాళ్ళను ఎలా కాపాడాలా అని పోలీస్ అధికారులు తలపట్టుకు కూర్చుంటే లోపల ఉన్న విజయ్ తనకు దొరికిన మరణాయుధాలతో ఆ ఉగ్రవాదుల పని పడతాడు. దీనికి దగ్గరగా అనిపించే కాన్సెప్ట్ తో చాలా ఏళ్ళ క్రితం 1993లో నిష్కర్ష అనే కన్నడ సినిమా వచ్చింది. తెలుగులో సంఘటనగా డబ్బింగ్ చేశారు. ఇక్కడ అంతగా ఆడలేదు కానీ శాండల్ వుడ్ లో హిట్టే.

నెట్ ఫ్లిక్స్ లో బ్లాక్ బస్టర్ అయిన మనీ హీస్ట్ ఛాయలు కూడా బీస్ట్ లో చాలానే కనిపిస్తున్నాయి. అందులో విలనే హీరో. ఇక్కడ వేరే. ఇలాంటి థీమ్ తో నాగార్జున గమనం చేసిన విషయం మర్చిపోకూడదు. రాజశేఖర్ మగాడులో కూడా ఇదే తరహా ట్రీట్మెంట్ లో ఉంటుంది. సో వీటన్నిటిని మిక్స్ చేసి లేదా స్ఫూర్తి పొంది దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ బీస్ట్ ని రాసుకున్నట్టు కనిపిస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ థ్రిల్లర్ కు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. ఐమ్యాక్స్ ఫార్మట్ లో ట్రైలర్ ని ప్రెజెంట్ చేయడం విశేషం. మరి అంచనాలకు తగ్గట్టు బీస్ట్ ఉంటుందో లేదో ఇంకో రెండు వారాల్లో తేలిపోనుంది

Also Read : Ghani : ఇలా అయితే కలెక్షన్లు వస్తాయా