చిత్రపరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకరి మరణ వార్తను మరువక ముందే మరో సెలబ్రిటీ కన్నుమూయడంతో ఫ్యాన్స్ ని దుఃఖంలో మునిగిపోతున్నారు. తాజాగా కమల్ హాసన్ తో ‘అపూర్వ సహోదరులు’ సినిమాలో నటించిన సహాయ నటుడు మోహన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 55 ఏళ్లు. కాగా.. సహాయ నటుడుగా తమిళ ఇండస్ట్రీలో మంచి పేరున్న మోహన్.. దీనస్థితిలో రోడ్డు పక్కన శవమై కనిపించడం గమనార్హం. మధురై జిల్లాలోని తిరుప్పాంగుండ్రం పెరియరథం వీధి సమీపంలో.. వెళ్లింగిండ్రు రోడ్డు పక్కన ఓ మృతదేహం పడివున్నట్లు పోలీసులకు మంగళవారం సమాచారం అందింది.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మధురై గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. ఈ విచారణలో పోలీసులు.. ఆ మృతదేహం సేలం జిల్లా.. వేటూరు గ్రామానికి చెందిన నటుడు మోహన్ ది అని ధృవీకరించారు. సహాయ నటుడు అయిన మోహన్.. మృతదేహం అలా రోడ్డు పక్కన లభ్యం అవ్వడంతో.. అతని మరణం వెనుక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు సేలం నుండి మోహన్ మధురై ఎందుకు వెళ్ళాడు? అతని మృతికి కారణాలేంటి? అనే విషయాలపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. పోస్ట్ మార్టం అనంతరం పోలీసులు.. నటుడు మోహన్ మరణవార్తను అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఇదిలా ఉండగా.. విశ్వనటుడు కమల్ హాసన్ తో అపూర్వ సహోదరులు సినిమాలో.. కమల్ స్నేహితులలో ఒకరిగా మోహన్ నటించారు. అలా తమిళంలో నాన్ కడవుల్(తెలుగులో నేనే దేవుడ్ని), అదిశయ మనిదర్‌గళ్ లాంటి పలు సినిమాలలో నటించారు. కాగా.. కొన్నాళ్ళ క్రితమే మోహన్ అవకాశాల కోసం మధురై వెళ్లాడని.. అవకాశాలు రాకపోవడంతో.. దీనస్థితిలో వీధుల్లో భిక్షాటన చేస్తూ కాలం వెళ్ళదీసాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అలా పేదరికం.. అనారోగ్యం సమస్యల కారణంగా మోహన్ మృతి చెందినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలతో పాటు ఇన్నాళ్లు అతని కుటుంబం ఏమైంది? అనేదానిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం మోహన్ మృతి పట్ల తమిళ పరిశ్రమ, ప్రేక్షకులు సంతాపం తెలియజేస్తున్నారు.