iDreamPost
iDreamPost
మూడేళ్ళ తర్వాత ఒక కామెడీ ఎంటర్ టైనర్ కు సీక్వెల్ రావడం అరుదు. అది కూడా టాలీవుడ్లో జరగడమనేది అరుదైన ప్రయత్నంగా చెప్పాలి. 2019లో వచ్చిన ఎఫ్2 సంక్రాంతికి తీవ్రమైన పోటీలోనూ చరణ్, బాలయ్య, రజినీకాంత్ లాంటి భారీ పోటీని తట్టుకుని మరీ బ్లాక్ బస్టర్ గా నిలవడం ప్రేక్షకులు మర్చిపోలేరు. ఎలాంటి మాస్ కమర్షియల్ అంశాలు లేకుండా కేవలం వినోదంతోనే థియేటర్లను కిక్కిరిసిపోయేలా చేసిన తీరు బాక్సాఫీస్ ని షేక్ చేసింది. మరి అలాంటి మూవీకి ఫ్రాంచైజ్ అంటే అంచనాలు గట్టిగానే ఉంటాయి. అందుకే ఎఫ్3 కోసం ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూశారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం
కథ
వేల కోట్ల ఆస్తులున్న ఆనందప్రసాద్(మురళి శర్మ) తన ఒక్కగానొక్క సంతానం వాడి చిన్నవయసులోనే ఇంటి నుంచి పారిపోవడంతో ఎదురుచూస్తూ ఉంటారు. ఇది తెలుసుకుని అప్పటికే డబ్బు కోసం విపరీతమైన ఇబ్బందులు కష్టాలు ఎదురుకుంటున్న వెంకీ, వరుణ్ లు అక్కడికి ఆయన కొడుగ్గా వెళ్లాలని ఒకరికి తెలియకుండా మరొకరు ప్లాన్ చేసుకుంటారు. వీళ్ళతో పాటు ఓ పోలీస్ ఇన్స్ పెక్టర్ ( రాజేంద్ర ప్రసాద్), ఇద్దరు హీరోల ప్రియురాళ్ల కుటుంబాలు అందరూ ఒకే చోటికి చేరతారు.మరి ఈ గందరగోళంలో అసలు వారసుడు ఎవరు, చివరికి ఎవరి లక్ష్యాన్ని వాళ్ళు ఎలా చేరుకున్నారు అనేదే మెయిన్ స్టోరీ. ఇది ఎఫ్2 కి సంబంధం లేని పాయింట్.
నటీనటులు
నాలుగు దశాబ్దాలకు పైగా రకరకాల పాత్రలతో అభిమానులను ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన వెంకటేష్ లోని కామెడీ యాంగిల్ మరోసారి ఇందులో డబుల్ డోస్ తో బయటికి వచ్చింది. ఈ వయసులోనూ ఇంత ఎనర్జీతో వెంకీ మెప్పించే ప్రయత్నం చేయడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఫస్ట్ పార్ట్ లాగే ఇందులోనూ మెయిన్ కంటెంట్ ని తన భుజాల మీద మోసేశారు అంత పెద్ద క్యాస్టింగ్ ఉన్నా తన మీద ఫోకస్ పడేలా చేశారు. ఏది ఏమైనా హాస్యభరిత చిత్రాలను ఎక్కువ చేయకుండా వెంకీలో బలాన్ని గత కొన్నేళ్లలో సరిగా వాడుకోలేదనిపిస్తుంది. ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ ఆ చలాకీతనం అందరికీ సాధ్యమయ్యేది కాదు.
వరుణ్ తేజ్ పాత్రకు తగ్గట్టు నిండుగా ఉన్నాడు. నత్థి మాట్లాడే క్యారెక్టర్ కు అచ్చంగా సరిపోయాడు. పక్కన అంత పెద్ద సీనియర్ ఉన్నా కంప్లీట్ బ్యాక్ సీట్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. తమన్నాకు వెరైటీ రోల్ దక్కింది. అంతగా అతకలేదు అనిపించినా ఓకే అనిపిస్తుంది. మెహ్రీన్ కంటిన్యూ అయ్యింది అంతే. రెండో సగంలో పూర్తిగా సీన్లు తగ్గిపోయాయి. సోనాలి చోప్రా గ్లామర్ కోటాకు మాత్రమే ఉపయోగపడింది. సునీల్ మళ్ళీ తన పాత టైమింగ్ ని బయటికి తీయడం హ్యాపీ. ప్రదీప్, ప్రగతి, అన్నపూర్ణ, వై విజయ, రఘుబాబు, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్, పృథ్వి, సత్య ఇలా కామెడీ కోసం పెద్ద గ్యాంగే పెట్టారు
డైరెక్టర్ అండ్ టీమ్
డబుల్ మీనింగ్ జోకులతో నిండిపోయిన టీవీ రియాలిటీ షోల జమానాలో థియేటర్ కు రప్పించి జనాలను నవ్వించడం అంత సులభం కాదు. అలా అని ద్వందార్థాలు జొప్పిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ దూరమైపోతారు. అనిల్ రావిపూడికి ఇది బాగా తెలుసు. అందుకే ఈవివి, జంధ్యాల మార్కుని క్రమం తప్పకుండ ఫాలో అవుతూ ఈ ఇద్దరి ఫార్ములాను వాడుకుని తనదైన స్టైల్ లో ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు కామెడీ చేయడం ఇతని స్టైల్. పటాస్, రాజా ది గ్రేట్ లాంటి సీరియస్ సినిమాల్లోనూ హాస్యం ఈ కారణంగానే బాగా పేలింది. ఇక ఎఫ్2 లో కంప్లీట్ గా దీని మీద ఫోకస్ చేయడంతో జనం ఎగబడి నవ్వారు. డబ్బులిచ్చి దాన్ని బ్లాక్ బస్టర్ చేశారు.
ఈసారి కూడా అనిల్ అదే పని చేశాడు. కాకపోతే ఎక్కువ రిస్క్ చేయలేదు. గతంలో వచ్చిన హిట్ చిత్రాల లైన్స్ నాలుగైదు తీసుకుని స్టోరీ కన్నా ఎక్కువగా ఎపిసోడ్స్ మీద దృష్టి పెట్టాడు. హిలేరియస్ గా నవ్విస్తే చాలు కథా కథనాలు పెద్దగా అవసరం లేదనే సూత్రాన్ని మళ్ళీ ఫాలో అయ్యాడు. అయితే ఫస్ట్ హాఫ్ లో పాత్రలను ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో రాసుకున్న సన్నివేశాలు మాములుగా ఉండటంతో ఎక్కువ వినోదాన్ని ఆశించిన ప్రేక్షకులు ఏదో టైం పాస్ అవుతోందని చిన్నగా నవ్వుకుంటారే తప్ప అబ్బ ఏముందిరా ఎంటర్ టైన్మెంట్ అని ఫీలయ్యే అవకాశం ఇవ్వలేదు. సెపరేట్ గా చూసుకుంటే సీన్స్ పండాయి కానీ ఓవరాల్ గా మొదటి సగం యావరేజే
ముందే చెప్పినట్టు ఎక్కడో ఫ్రెంచ్ హాలీవుడ్ రష్యన్ సినిమాలను కాపీ కొట్టడమో స్ఫూర్తి చెందడమో చేయడం కన్నా మనవే తీసుకోవడం మంచి పనే. తప్పేం కాదు. చంటబ్బాయ్ లో వారసుడి కన్ఫ్యూజన్ ఇందులో ఉంది. గాండీవంలో ఏఎన్ఆర్ క్యారెక్టర్ ని దీంట్లో మురళీశర్మకు సెట్ చేశారు. ఆమ్మో ఒకటో తారీఖులో సురేష్ ముంతాజ్ ల ట్రాక్ ఇక్కడ వరుణ్ మెహ్రీన్ కు అతికించారు. ఆ ఒక్కటి అడక్కు క్లైమాక్స్ లో హీరో తెలివితేటలను మొత్తం ఎఫ్3 క్యాస్టింగ్ కి పంచేశారు. ఇవన్నీ చూసే ప్రతిఒక్కరికి తడతాయన్న గ్యారెంటీ లేదు. ఆ మాటకొస్తే గుర్తుకు రాకపోవచ్చు కూడా. వీటిని బలంగా రీమాస్టర్ చేసినప్పుడు ఎలాంటి సమస్య వచ్చేది కాదు.
కానీ అది పూర్తి స్థాయిలో జరగలేదు. జానర్ ఏదైనా లాజిక్స్ అడగకూడదు. నిజమే. ఇందులోనూ వాటిని పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ఒక పెద్ద హిట్టు సినిమా బ్రాండ్ గా మారినప్పుడు అదే పేరు మీద వచ్చే చిత్రం అంతకు మించి ఉంటుందనే అంచనాలు ఏర్పడతాయి. అది సహజం. ఎఫ్3 కు కూడా అదే జరిగింది. కానీ ఆ ఒత్తిడి వల్లనో ఏమో మరి కొన్ని పాత్రలను సరిగా వాడుకోవడంలో అనిల్ తడబడ్డారు. వై విజయ, అన్నపూర్ణ లాంటి పెద్దవాళ్లతో ఏం మాట్లాడించాలో అర్థం కాక సింక్ అవ్వని ఎక్స్ ప్రెషన్లతో ఏదో చేయబోయారు. రెండు మూడు జోకులు మిస్ ఫైర్ అయ్యాయి. అసలు వాళ్ళను పెట్టకపోయినా బాగుండేది.
ఇలాంటి పొరపాట్లు కొన్ని జరిగాయి. ఎఫ్2లో వెంకీ కుక్క ముందు చేసిన బిట్ నే ఇక్కడ ఎద్దు ముందు చేయించడం రిపీటే. వచ్చిన వాళ్లకు రకరకాల టెస్టులు పెట్టడం చాలా సార్లు చూశాం. అవి కొంతవరకు నవ్వించాయి ఓకే. తమన్నాకు మగ గెటప్ వేయించి ఆమెకు సోనాలి చౌహన్ తో లవ్ ట్రాక్ ప్లస్ సాంగ్ పెట్టడం సెట్ కాలేదు. పూజా హెగ్డే ఐటెం సాంగ్ వల్ల ఒరిగిందేమి లేదు. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ అనిపించిన నీరసం సెకండ్ హాఫ్ కు వచ్చేటప్పటికీ తగ్గడం రిలీఫ్ కలిగిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో వెంకటేష్ తో నారప్ప గెటప్, వరుణ్ తో వకీల్ సాబ్ ఎంట్రీ బాగా పేలాయి. బొమ్మల ద్వారా స్టార్ హీరోల రిఫరెన్స్ తీసుకోవడం పిల్లలకు నచ్చుతుంది.
ఎఫ్3 మొత్తం ఇలాంటి లోపాలమయమని చెప్పడం లేదు. అనిల్ రావిపూడికి మంచి కామిక్ సెన్స్ ప్లస్ సెన్సిబిలిటీ ఉంది. అదే సరిగా లేకపోతే ఇంత రొట్ట కథను తెరమీద రెండున్నర గంటలు భరించడం కష్టం. కాకపోతే ఇంకాస్త బలంగా వర్కౌట్ చేసుకుని స్క్రీన్ ప్లే టైట్ గా సెట్ చేసుకుని ఉంటే ఎఫ్2ని మించిపోయేదేమో. ఇప్పుడు హిట్ అవ్వొచ్చు. కాదని చెప్పలేం. కొన్నిసార్లు అంచనాలను విశ్లేషణలకు అతీతంగా కొన్ని సినిమాలు వసూళ్లు బాగానే రాబడుతున్నాయి. సక్సెస్ క్యాటగిరీలోకి వెళ్లిపోతున్నాయి. ఎఫ్3 అదే కోవలోకి చేరొచ్చు. అలా అని ఇదే టైపు ట్రీట్మెంట్ ని అనిల్ రావిపూడి కొనసాగిస్తే మాత్రం నెక్స్ట్ అయినా బ్రేక్ పడుతుంది
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఏ మాత్రం పనిచేయలేదు. తక్కువ పాటలే ఉన్నా ఏదీ కనీస స్థాయిలో రిజిస్టర్ కాలేకపోయింది. ఆఖరికి ఐటెం సాంగ్ లో కూడా తన మార్కు ఇవ్వలేకపోయాడు. ఇలాంటి ఎంటర్ టైనర్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పడానికి పెద్దగా ఏముండదు కాబట్టి అది ఓకే. సాయిశ్రీరామ్ ఛాయాగ్రహణం బాగుంది. తక్కువ లొకేషన్స్ ఉన్నప్పటికీ డీసెంట్ క్వాలిటీ రావడంలో తోడ్పడింది. తమ్మిరాజు ఎడిటింగ్ ఎక్కువ ల్యాగ్ కు అవకాశం ఇవ్వలేదు కానీ లెన్త్ కోసమే సీన్స్ ని పెట్టినప్పుడు ఆయన మాత్రం చేయగలిగింది ఏముంది. దిల్ రాజు నిర్మాణం ఎప్పటిలాగే ఉంది. ఓవర్ బడ్జెట్ లాంటి రిస్కులు తీసుకోలేదు. అది క్లియర్
ప్లస్ గా అనిపించేవి
వెంకటేష్ ఎనర్జీ
వరుణ్ పెర్ఫార్మన్స్
క్లైమాక్స్ ఎపిసోడ్
మైనస్ గా తోచేవి
రొటీన్ స్టోరీనే
సంగీతం
ఫస్ట్ హాఫ్
కంక్లూజన్
ఓ రెండు మూడు వందలు ఖర్చు పెట్టి, టికెట్ కొని, థియేటర్ కెళ్ళి లాజిక్స్ తో సంబంధం లేకుండా మనసారా నవ్వుకుని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఒక కామెడీ మూవీ ఉందంటే అది ఖచ్చితంగా బ్లాక్ బస్టరే. కానీ ఎఫ్3 ఈ టార్గెట్ ని సగమే రీచ్ కాగలిగింది. ఎఫ్2 అంచనాలతో ఏదేదో ఊహించుకోకుండా జస్ట్ టైం పాస్ అయితే చాలనుకుంటే ఈ సినిమా సంతృప్తిపరుస్తుంది. విజువల్ గ్రాండియర్లు అలవాటయిన కళ్ళకు ఇప్పుడిలాంటి హాఫ్ బేక్డ్ కామెడీలు ఎంతమేరకు నచ్చుతాయో చూడాలి. అదే బాక్సాఫీస్ ఫలితాన్ని శాసించబోతోంది. కొంత టైం పాస్ అయినా చాలనుకుంటే టికెట్ కొనేసి ట్రై చేయండి. కండీషన్స్ అప్లై సుమా
ఒక్క మాటలో – హాఫ్3 కామెడీ
రేటింగ్ 2.5 / 5