ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నేషనల్ అవార్డ్స్‌ను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ పురస్కారాలను గెలుచుకున్న వారి లిస్టును వెల్లడించింది. ఇందులో జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటి పురస్కారం అలియా భట్ (గంగూబాయి కతియావాడి), కృతిసనన్ (మిమి)లకు దక్కాయి. ఈసారి అవార్డుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ తన సత్తా చాటింది. ఏకంగా 10 పురస్కారాలను గెలుచుకోవడం విశేషం. ఒక్క ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకే 6 అవార్డులు వచ్చాయి.
జాతీయ చలనచిత్ర అవార్డుల్లో టాలీవుడ్‌కు వచ్చినవి చూసుకుంటే.. అల్లు అర్జున్ (బెస్ట్ యాక్టర్), దేవి శ్రీ ప్రసాద్ (బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్), ‘ఆర్ఆర్ఆర్’ (బెస్ట్ పాపులర్ ఫిల్మ్), ఎంఎం కీరవాణి- ‘ఆర్ఆర్ఆర్’ (బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్), కాలభైరవ (బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్), ‘ఆర్ఆర్ఆర్’ (బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్), ‘ఆర్ఆర్ఆర్’ (బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ), చంద్రబోస్-‘కొండపొలం’ (బెస్ట్ లిరిసిస్ట్), ‘ఉప్పెన’ (బెస్ట్ తెలుగు ఫిల్మ్)కు అవార్డులు దక్కాయి. జాతీయ పురస్కారాల్లో ఎప్పుడూ వెనుకంజలో ఉండే టాలీవుడ్.. ఈసారి మిగతా చిత్ర పరిశ్రమలను వెనక్కి నెట్టింది.
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టర్ అవార్డు అనేది ఎప్పుడూ తెలుగు చిత్ర పరిశ్రమకు అందని ద్రాక్షగానే ఉంది. అలాంటిది అల్లు అర్జున్ (‘పుష్ప’)కు ఈసారి పురస్కారం రావడంతో ఆ కల కూడా నెరవేరింది. ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న బన్నీపై అందరూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. టాలీవుడ్ మీసం తిప్పారని మెచ్చుకుంటున్నారు. ఆయనకు విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తనకు అవార్డు రావడంపై అల్లు అర్జున్ స్పందించారు. తాను ఇంకా షాక్‌లో ఉన్నానని ఆయన అన్నారు. దీని గురించి తర్వాత మాట్లాడతానని చెప్పారు బన్నీ.
షాక్ లో ఉన్నా తర్వాత మాట్లాడుతా..!! – జాతీయ అవార్డ్ గెలిచిన ఆనందంలో అల్లు అర్జున్#AlluArjun #BestActor #Pushpa #Sukumar #69thNationalFilmAwards #NTVENT #NTVTelugu pic.twitter.com/AT1mgSkj2m
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) August 24, 2023