iDreamPost
android-app
ios-app

ఆదిపురుష్‌ సినిమాకు భారీ షాక్‌.. అక్కడ అన్ని థియేటర్లలో షోలు రద్దు!

  • Published Jun 19, 2023 | 6:39 PM Updated Updated Jun 19, 2023 | 6:39 PM
  • Published Jun 19, 2023 | 6:39 PMUpdated Jun 19, 2023 | 6:39 PM
ఆదిపురుష్‌ సినిమాకు భారీ షాక్‌.. అక్కడ అన్ని థియేటర్లలో షోలు రద్దు!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ నటి కృతిసనన్ జంటగా.. దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. సుమారు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో.. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆదిపురుష్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌, టీజర్‌ విడుదలైనప్పటి నుంచి వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఇక సినిమా విడుదల తర్వాత.. ఈ వివాదాలు మరింత పెరిగాయి. ఓవైపు ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికి.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తుండగా.. మరోవైపు సినిమా మీద సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఓంరౌత్‌ రామాయణాన్ని వక్రీకరించారని హిందూసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే ఓచోట మాత్రం ఆదిపురుష్‌ సినిమా మీద పూర్తిగా నిషేధం విధించారు. షోలు రద్దు చేశారు. ఆ వివరాలు..

ఆదిపురుష్‌ సినిమాకు సంబంధించిన నేపాల్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని ఖాఠ్మండు సహా మరో నగరం పోఖారాలో ఆదిపురుష్ సహా భారతీయ చిత్రాలన్నింటినీ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే నేపాల్‌ ‍ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన కారణం ఉంది. ఆదిపురుష్ చిత్రంలో చూపించిన సీతాదేవి జన్మ స్థలంపై నేపాల్‌లో వివాదం చెలరేగింది. సీతా దేవి భారత్‌లో పుట్టిందని.. ఆదిపురుష్ సినిమాలో చూపించారు. దీనిపై నేపాల్‌ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

అంతేకాక సినిమాలోని ఈ డైలాగ్‌ను నేపాల్‌లోనే కాకుండా భారత్‌లో ప్రదర్శించే సినిమాలోనూ తొలగించాలని.. ఆదిపురుష్‌ సినిమా విడుదలైన తొలి రోజే నేపాల్ సర్కార్ ఆదేశించింది. దీనికి 3 రోజుల సమయం ఇచ్చింది. అయినప్పటికీ ఆదిపురుష్‌ టీమ్‌.. ఆ సీన్లు, డైలాగ్‌లను తొలగించకపోవడంతో నేపాల్‌ ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది. దానిలో భాగంగానే ఆదిపురుష్ సహా మిగితా భారతీయ చిత్రాలన్నింటినీ తమ దేశంలో ప్రదర్శించకుండా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది నేపాల్‌ ప్రభుత్వం.

ఈ విషయాన్ని ఖాఠ్మండు మేయర్ బాలేంద్ర షా వెల్లడించారు. సీతాదేవి.. ఆగ్నేయ నేపాల్‌లోని జనక్‌పూర్‌లో జన్మించినట్లు చాలా మంది విశ్వసిస్తారని బాలేంద్ర షా పేర్కొన్నారు. అలాంటిది ఆదిపురుష్‌ చిత్రంలో సీతా దేవి జన్మస్థలాన్ని తప్పుగా చూపించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలోని ఈ వివాదాస్పద డైలాగ్‌ను తొలగించకపోతే కోలుకోలేని నష్టం సంభవిస్తుందని బాలేంద్ర షా హెచ్చరించారు. తాము నోటీసులు ఇచ్చి 3 రోజులైనా డైలాగ్‌లను తీసివేయలేదని అన్నారు. అయితే బాలేంద్ర షా తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో భారీ చర్చకు తావుతీసింది. కొంతమంది ఖాఠ్మాండ్‌ మేయర్ నిర్ణయాన్ని సమర్థించగా.. మరికొందరు వ్యతిరేకించారు.