Venkateswarlu
Venkateswarlu
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు రవళి. ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారామె. ఈ సినిమా సాధించిన విజయంతో ‘రవళి’ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తర్వాత వరుస ఆఫర్లు ఆమెను వరించాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీబిజీగా అయిపోయారు. లక్షల్లో పారితోషికం తీసుకుంటూ ఉన్న ఆమె కెరీర్ ఒక్కసారిగా నేల కూలింది. అందుకు కారణం ఏంటనే విషయాన్ని ఆమె తల్లి విజయదుర్గ తాజాగా వెల్లడించారు.
విజయదుర్గ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ నా కూతురు రవళి అసలు పేరు శైలజ. పెళ్లి సందడి సినిమాకు ఆమెకు 50 వేల రూపాయలు ఇచ్చారు. తర్వాత లక్షల్లో పారితోషికం తీసుకుంది. కెరీర్ బాగా పీక్‌లో ఉన్న టైంలో.. రవళి లావుగా అయిందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలతో రవళి కెరీర్ నాశనం అయింది. అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీంతో 2011లో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతోంది. రీ ఎంట్రీ ఇవ్వబోతోంది’’ అని అన్నారు.
కాగా, రవళి 1990లో వచ్చిన ‘జడ్జిమెంట్’ అనే మలయాళ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. జయభేరి ఆమె తొలి తెలుగు సినిమా. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 50కిపైగా సినిమాలు చేశారు. 2011లో వచ్చిన ‘మాయగాడు’ ఆమె చివరి సినిమా. ఈ సినిమా తర్వాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. మరి, రవళి త్వరలో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.