సినీ పరిశ్రమలో నటులు చాలా మందే ఉంటారు. కానీ ఏ పాత్రనైనా అవలీలగా పండించే విలక్షణమైన నటులు కొందరే ఉంటారు. అలాంటి వాళ్లలో ఒకరు రఘువరన్. ఆయన పేరు వినగానే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఆడియెన్స్ మనసులో మెదులుతాయి. ఎలాంటి క్యారెక్టర్లోనైనా పరకాయ ప్రవేశం చేసి, ప్రేక్షకులను మెప్పించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 90వ దశకంలో సౌతిండియన్ సినిమాలో ఒక ఊపు ఊపారాయన. దక్షిణాది భాషలన్నింటిలోనూ యాక్ట్ చేసిన రఘువరన్.. పలు హిందీ చిత్రాల్లోనూ నటించారు.
‘బాషా’ సినిమాలో తలైవా రజినీకాంత్‌కు రఘువరన్‌కు మధ్య వచ్చే సీన్స్‌ను ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోలేరు. అలాంటి రఘువరన్ చివరి రోజల్లో ఆల్కహాల్‌కు బానిసై 2008 మార్చి 19న కన్నుమూశారు. రఘువరన్ మరణంపై తాజాగా ఆయన బ్రదర్ రమేష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లూ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన రఘువరన్ సోదరుడు.. తొలిసారి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను ఎప్పుడూ రఘువరన్తోనే ఉండేవాడ్నని అన్నారు రమేష్. అన్నయ్య మరణించినప్పుడు తాను బెంగళూరులో ఉన్నానని.. ఆ రోజు రాత్రి ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో ఇంట్లోని పనివాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లారని తెలిపారు.
‘అన్నయ్యను పనివాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆయన చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. ఆయన మరణానికి ముందు కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండేవి. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ సమస్యలు ఆయన్ను బాధించాయి. దీంతో అన్నయ్య మానసికంగా, శారీరకంగా అలసిపోయాడు. తన కొడుకును ఆయన ఎంతగానో ప్రేమించేవాడు. కానీ అన్నయ్య, రోహిణి వేర్వేరుగా ఉండటంతో వారంలో శనివారం మాత్రమే కుమారుడ్ని ఇంటికి తీసుకొచ్చే ఛాన్స్ ఉండేది. పిల్లాడ్ని ఆదివారం తిరిగి తీసుకెళ్లేవారు. అది కోర్టు రూల్’ అని రఘువరన్ సోదరుడు చెప్పుకొచ్చారు.
‘కొడుకు పరిగెత్తుకుంటూ రాగానే నాన్నా అనేవాడు. అప్పుడు అన్నయ్య కన్నీళ్లు పెట్టుకునేవాడు. తన కొడుకు తిరిగి వెళ్లిపోయేటప్పుడు ఆయన విపరీతంగా బాధపడేవాడు. అలా చివరి రోజుల్లో ఎంతగానో మానసిక క్షోభను అనుభవించాడు. దీంతో మద్యానికి మరింతగా బానిస అయ్యాడు. ఆయన ఆల్కహాల్‌కు బానిసలా మారడానికి కొన్ని వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయి’ అని రఘువరన్ సోదరుడు రమేష్ పేర్కొన్నారు.. ఇకపోతే, నటి రోహిణితో రఘువరన్ వివాహం 1996లో జరిగింది. వాళ్లకు రిషివరణ్ అనే ఒక కొడుకు ఉన్నాడు. రఘువరన్-రోహిణిలు 2004లో విడాకులు తీసుకున్నారు.