iDreamPost
iDreamPost
ఇవాళ సాయంత్రం హైదరాబాద్ యుసూప్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగా ఫ్యాన్స్ రెడీ అయ్యారు. హైప్ మెగా మూవీ రేంజ్ లో లేదన్న కామెంట్స్ నేపథ్యంలో సాయంత్రం జరగబోయే పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ముందు పవన్ కళ్యాణ్ గెస్టని ప్రచారం చేశారు కానీ జనసేన యాత్రలో పవర్ స్టార్ రావడం అసాధ్యమని తేలిపోయింది. మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ లు వస్తారని, కొరటాల శివ స్పెషల్ రిక్వెస్ట్ మీద ఒప్పించాడని ప్రచారం జరిగింది. కానీ జరిగే అవకాశం లేనట్టే. ఒకవేళ నిజంగా వస్తే మాత్రం అదే పెద్ద ఆకర్షణగా మారుతుంది. చరణ్ తో ఎంత ఫ్రెండ్ షిప్ ఉన్నా తారక్ రావడం అనుమానమే.
ఇక సోషల్ మీడియాలో ఆచార్య గురించి జరుగుతున్న ప్రీ రిలీజ్ టాక్ గందరగోళంగా ఉంది. ఒక వర్గం యావరేజ్ అని మరోవర్గం ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ దాకా అదిరిపోయిందని ఇలా రకరకాలుగా సెన్సార్ రిపోర్ట్ ల పేరుతో ప్రచారం చేయడంతో అంతుచిక్కని అయోమయం నెలకొంది. గతంలో ఏ చిరంజీవి సినిమాకు ఇలా జరిగిన దాఖలాలు లేవు. అసలు ఇంత పెద్ద సినిమాకు జరగాల్సిన ప్రమోషన్ ఇది కాదని ఫ్యాన్స్ ఎంత మొత్తుకుంటున్నా పట్టించుకునే వారు కనిపించడం లేదు. ఈ లెక్కన చిరంజీవి రామ్ చరణ్ తప్ప స్టేజి మీద అట్రాక్షన్లు ఉండకపోవచ్చు. రాజమౌళి గెస్ట్ గా వచ్చినా అదేమంత సెన్సేషన్ గా చెప్పుకోలేం.
బజ్ సంగతి ఎలా ఉన్నా బిజినెస్ మాత్రం చాలా హై రేషియోలో జరిగింది. ఒక్క తెలంగాణనే వరంగల్ శీను 45 కోట్లకు కొన్నారన్న వార్త ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి సుమారు 100 కోట్లకే పైగానే థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న ఆచార్యకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే పెట్టుబడి సేఫ్ గా వెనక్కు వస్తుంది. చెప్పుకోదగ్గ పోటీ లేకపోయినప్పటికీ ఆచార్య దాన్ని ఎంతమేరకు క్యాష్ చేసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఒకటి రెండు ఇంటర్వ్యూలు తప్ప పబ్లిసిటీ విషయంలో ఆచార్య టీమ్ నిర్లిప్తంగానే ఉంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ టెంపుల్ యాక్షన్ డ్రామాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లు నటించారు.