iDreamPost
iDreamPost
రెండు నెలల క్రితం ది కాశ్మీర్ ఫైల్స్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా విడుదలై ఎలాంటి అంచనాలు లేకుండా 300 కోట్ల దగ్గరగా వసూళ్లకు చేరుకుని అరుదైన మైలురాయి అందుకుంది. గత వారం జీ5 వేదికగా ఓటిటిలో రిలీజైన విషయం తెలిసిందే. థియేటర్లలోనే ఆ రేంజ్ లో చూస్తే ఇక స్మార్ట్ స్క్రీన్స్ పై ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందోనని రకరకాల స్పెక్యులేషన్స్ వచ్చాయి. కానీ దానికి భిన్నంగా కాశ్మీర్ ఫైల్స్ కి ఆశించిన స్థాయిలో మిలియన్ల స్పందన రాలేదని ఓటిటి వర్గాల రిపోర్ట్. అందుకే జీ5 దీని గురించి ప్రత్యేకంగా పబ్లిసిటీ చేయడం లేదని తెలుస్తోంది. లేకపోతే ఈపాటికి హంగామా ఓ రేంజ్ లో ఉండేది
నిజానికి ది కాశ్మీర్ ఫైల్స్ విడుదలైన టైంలో థియేటర్ జనాల్లో కలిగిన ఎమోషన్స్ దాని మౌత్ టాక్ కి బాగా ఉపయోగపడ్డాయి. క్లైమాక్స్ అయ్యాక కన్నీళ్లు పెట్టుకోవడం, అందరూ జనగణమన పాడుకుంటూ బయటికి రావడం లాంటివి వైరల్ కావడంతో పబ్లిక్ కిక్కిరిసిపోయేలా చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఎవరూ ఊహించని విధంగా కేవలం నెల రోజుల్లోనే 200 కోట్ల మార్కు దాటేయడం చాలా అరుదైన రికార్డు. కానీ ఓటిటిలో మాత్రం రివర్స్ అయ్యింది. డాక్యుమెంటరీ తరహాలో సాగే టేకింగ్ ని ప్రేక్షకులు చిన్న తెరపై చూడలేకపోతున్నారు. దానికి తోడు సంభాషణలు సుదీర్ఘంగా ఉండటం కొంత మైనస్ గా నిలుస్తోంది.
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా లగాన్, గదర్, రోజా తరహాలో దేశభక్తి ఎలివేషన్లు ఇచ్చేది కాదు. ఎమోషనల్ డ్రామా. కాశ్మీర్ పండిట్ల వ్యధల గురించి అప్పట్లో వీళ్ళ మీద జరిగిన అమానుషాల గురించి అవగాహన ఉంటేనే కనెక్ట్ అవుతుంది. అందుకే తెలుగు తమిళ భాషల్లో డబ్బింగ్ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో దీని గురించి ఎలాంటి పోస్టులు కనిపించడం లేదు. పైపెచ్చు అసలిది డిజిటిల్ లో వచ్చిందన్న సంగతి కూడా కొందరికి గుర్తు లేదు. కొన్నంతే థియేటర్లో గొప్పగా ఆడి టీవీలో ఉస్సూరుమనిపిస్తాయి. ఇప్పుడీ కాశ్మీర్ ఫైల్స్ కూడా అదే కోవలోకి చేరింది. ఒకవేళ ప్రైమ్ లాంటి ప్లాట్ ఫార్మ్ లో వచ్చి ఉంటే ఫలితం రీచ్ పరంగా ఇంకోలా ఉండేదేమో.