iDreamPost
android-app
ios-app

ప్రతి చిన్న విషయానికి అత్తా కోడలు ఎందుకు గొడవ పడతారో తెలుసా?

  • Published May 13, 2024 | 7:09 PM Updated Updated May 13, 2024 | 7:09 PM

ఊరికే అయిపోతారేంటి అత్తాకోడళ్లు. అత్తాకోడళ్లు అన్న పదానికి సరైన నిర్వచనం చెప్పాలి. ఇంట్లో గొడవలు అవ్వాలి. యుద్ధాలు జరగాలి. ఒకరినొకరు సాధించుకోవాలి. ఇలా చాలా ఉంటాయి. అయితే అత్తాకోడళ్ల గొడవకు సైకలాజికల్ గా చాలా కారణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఊరికే అయిపోతారేంటి అత్తాకోడళ్లు. అత్తాకోడళ్లు అన్న పదానికి సరైన నిర్వచనం చెప్పాలి. ఇంట్లో గొడవలు అవ్వాలి. యుద్ధాలు జరగాలి. ఒకరినొకరు సాధించుకోవాలి. ఇలా చాలా ఉంటాయి. అయితే అత్తాకోడళ్ల గొడవకు సైకలాజికల్ గా చాలా కారణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

ప్రతి చిన్న విషయానికి అత్తా కోడలు ఎందుకు గొడవ పడతారో తెలుసా?

అత్తా కోడళ్ళు.. అమ్మో ఇది చాలా పెద్ద సబ్జెక్టు. అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగినా తేలచ్చు గానీ అత్తాకోడళ్ల గొడవలో దూరితే మాత్రం ఖతం అని ప్రతి మగాడూ ఫీలవుతాడు. పొరపాటున మగాడికి పెళ్లి అయ్యిందా? ఇక ఈడి పని అయిపోయిందని.. పాడు సమాజం ఆఫ్ ఇండియా నవ్వుకుంటుంది. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు.. ఇద్దరినీ మేనేజ్ చేయచ్చేమో కానీ ఒకే ఇంట్లో తల్లి, ఆలి ఉంటే మేనేజ్ చేయడం చాలా కష్టం బాబు అని చాలా మంది మగాళ్లు అనుకుంటారు.  

అభద్రతా భావం:

అసలు అత్తా, కోడలు ఇలా ఉండడానికి కారణం సైకలాజికల్ ప్రాబ్లమ్ అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని ప్రకారం అత్త గారికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయట. ఆడవాళ్లు పెళ్లయ్యాక తల్లిగా, భార్యగా అన్నీ తానే అయ్యి ఇంటిని చూసుకుంటారు. ఇంట్లో తనదే పెత్తనం ఉంటుంది. ఎప్పుడైతే కోడలు వస్తుందో అప్పుడు అత్త సీన్ మొత్తం మారిపోతుంది. అప్పటి వరకూ కొడుకు మీద చూపించిన ప్రేమ.. తన కోడలి ప్రేమ కంటే తక్కువేమో అన్న అభద్రతా భావంలోకి వెళ్ళిపోతుంది ఆ అత్త. ఇంటి పెత్తనం తన కోడలు ఎగరేసుకుపోతుందన్న భయం. ఈ క్రమంలో కోడలికి పెత్తనం దక్కకుండా కొడుకుని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుంది. ఇన్నాళ్లూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన కుటుంబాన్ని కొత్త కోడలు ఏం చేస్తుందో అన్న భయమే.. కోడలి మీద సాధింపులకు కారణమవుతుందట.

పెత్తనం:

ఆర్ధిక లావాదేవీల విషయంలో కూడా కోడలు పెత్తనం చెలాయిస్తే అత్తకి నచ్చదు. కోడలు ఎక్కడ దుబారా చేస్తుందేమో అన్న భయం అత్తను ఎక్కువగా వెంటాడుతుంది. కొడుకు సంసారాన్ని నాశనం చేసేస్తుందేమో అన్న భయం ఆమెకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. పెళ్ళికి ముందు తనతో ఎక్కువ సేపు మాట్లాడేవాడు.. పెళ్లయ్యాక అసలు పట్టించుకోవడమే మానేశాడు.. మాట్లాడే సమయం కూడా ఇవ్వడం లేదన్న కోపం కూడా ఉంటుందట. అప్పటి వరకూ తమ మాట విని, తమతో అన్నీ షేర్ చేసుకునే కొడుకు.. పెళ్లయ్యాక భార్యతో షేర్ చేసుకోవడం కూడా ఆమెని బాధిస్తుందట. భార్యతోనే ఎక్కువ సమయం గడపడం, తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసూయతో కూడా కోడలిని కొడుకు ముందు బ్యాడ్ చేయాలని చూసే స్థితికి వెళ్తారట.

పొగడ్తలు:

మరొక కారణం పొగడ్తలు. ఒకవేళ అత్తకి ఒక కూతురు ఉంటే.. ఆ కూతురు ఆమె చేసిన వంటలని పొగడడం.. ఆమె గురించి గొప్పగా చెప్పుకోవడం, ఆమెతో ప్రేమగా మాట్లాడడం వంటివి చేస్తుంది. అదే కోడలు ఐతే తనను గొప్పగా చూడడం లేదన్న భావనతో కూడా అత్త ఉంటుందట. మరొక కారణం ఆధిపత్యం చూపించాలనుకోవడం. ఈ మాహిష్మతి సామ్రాజ్యానికి తానో రాజమాత అన్నట్టు అత్తలు ఫీలవుతారట. ఇలాంటి సమయంలో దేవసేనలా ఎదురుతిరిగితే వేరే మకాం పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ సరిపోవన్నట్టు ఇంట్లో గొడవలకి సీరియల్స్ లో అత్తాకోడళ్ల గొడవలు ఆద్యం పోస్తాయి. ఇవన్నీ చూసి.. అత్త అంటే కోడలిని సాధించాలేమో.. అది మన వారసత్వ సంపద అన్నట్టు సాధిస్తూ ఉంటారు. కొంతమంది అత్తలు ఐతే.. తాము కోడలుగా ఉన్నప్పుడు తన అత్తగారు తమని ఎలా సాధించారో.. మేము కూడా మా కోడళ్ళని అలా సాధిస్తామని ఒక సైకలాజికల్ ఫీలింగ్ తో ఉంటారట.

ఇంటి గుట్టు:

మామూలుగా కొంతమందికి కొంతమందిని తొలిసారిగా చూసినప్పటి నుంచి ఎందుకో మంచి అభిప్రాయం ఉండదు. దీంతో వాళ్ళు ఎంత మంచి చేసినా గానీ రుచించదు. సరిగ్గా ఇలానే అత్త గారికి కూడా కోడలు మంచి పనులు చేసినా రుచించవట. దీనికి తోడు గత కొన్ని దశాబ్దాలుగా అత్తా, కోడళ్లు అంటే ఇండియా-పాకిస్తాన్ అనే భావాన్ని బాగా విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చారు. దీని ప్రభావం కూడా ఉండి ఉండవచ్చునని నిపుణులు చెబుతారు. చుట్టుపక్కల వాళ్లతో ఫ్రెండ్ షిప్ కూడా అత్తాకోడళ్ల మధ్య గొడవకు కారణం. పక్కింట్లో ఉన్న అత్తగారితో ఈ ఇంటి కోడలు స్నేహం, ఆ ఇంట్లో ఉన్న కోడలితో అత్తగారు స్నేహం. ఒకరి బలహీనతలు మరొకరికి షేర్ చేసుకోవడం వల్ల వారి బలహీనతలు ఊరందరికీ తెలిసిపోతాయి. ఇంటి గుట్టు కూడా బయటపడుతుంది. ఈ కారణం వల్ల కూడా అత్తా,కోడలు ఒకరినొకరు పరస్పర విరుద్ధంగా ఉంటారు.

పతాక స్థాయిలో పోరాట సన్నివేశాలు:

ఒకే ఇంట్లో ఉన్నా కూడా.. కొడుకు ఒక అద్దె ఇంట్లో ఉన్నట్టు భావించే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి వస్తే కనుక ఆ అత్తా, కోడళ్ల పోరాట సన్నివేశాలు పతాక స్థాయిలో ఉంటాయట. విడదీయడం ఎవరి వల్లా కాదు. అత్తా కోడళ్ల గొడవ అనేది యూనివర్సల్ కాన్సెప్ట్. ఈ సమస్య భారతదేశంలోనే కాదు. విదేశాల్లో కూడా ఉంది. 66 శాతం మంది కోడళ్ళు.. అత్త గారి పట్ల జీవితం మొత్తం మీద అసంతృప్తిగా ఉన్నామని, ఒత్తిడికి గురవుతున్నామని స్టడీస్ లో వెల్లడించారు. అదేంటో ఒకప్పుడు కోడలిగా ఉన్న అత్తగారు.. కోడలుగా తాను పడ్డ బాధలన్నీ మర్చిపోయి కోడలిని సాధిస్తుంటుంది. కానీ కొంతమంది అత్తాకోడళ్లు ఉంటారు. సీరియల్స్ లో శత్రువులుగా చూపించినా కూడా తల్లీ, కూతుర్లలా ఉంటారు. అలాంటి వారికి నమస్కరించాలి. 

పరిష్కారం:

మరి ఈ అత్తా, కోడళ్ల గొడవకి పరిష్కారం లేదా అంటే బేషుగ్గా ఉందని సైకాలజిస్టులు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచారు. ఒక్కసారిగా తమ చేతుల్లోంచి జారిపోయారు అన్న ఫీలింగ్ ని వారికి కలిగించడం కంటే వారికి నచ్చినట్టే ఉండడం ఉత్తమం అని అంటున్నారు. ఎందుకంటే వారు బతికేది కొంతకాలమే కాబట్టి. ఉన్నన్నాళ్ళు వారిని సంతోష పెడితే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. వాళ్ళు కన్నుమూసిన తర్వాత నచ్చినట్టు జీవించవచ్చు. అప్పుడు అడ్డు చెప్పేవాళ్ళే ఉండరు. అత్తా,కోడళ్ల గొడవని పరిష్కరించే బాధ్యత కొడుకుకే ఉంటుందని చెబుతున్నారు. తల్లిదండ్రుల దగ్గర రహస్యం ఎందుకు. ఆర్ధిక వ్యవహారాలు అయినా సరే కుటుంబమంతా కలిసి చర్చించుకోండి. కొడుకు, కోడలు తమకి ప్రాధాన్యత ఇస్తున్నారని అనుకుంటారు. ఒప్పుకోకపోతే ఒప్పించండి. అంతేగానీ గొడవ మాత్రం పడకండని సూచిస్తున్నారు.

సో అదండీ విషయం.. అత్తాకోడళ్ల గొడవకి కారణం సైకలాజికల్ ప్రాబ్లమ్ ఒకటైతే.. కొడుకు మరొక కారణం. భార్యని కంట్రోల్ లో పెట్టాలా? లేక అమ్మని కంట్రోల్ లో పెట్టాలా? తెలియక నరకం అనుభవిస్తూ గొడవ పెద్దది చేస్తాడట. కంట్రోల్ అన్న పదం పక్కన పెట్టి.. ఒక కొడుకుగా తన కర్తవ్యాన్ని ఎంత వరకూ నెరవేరుస్తున్నాడు, భర్తగా భార్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అనే దాని మీదే ఉంటుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. మరి ఈ విషయంపై మీరేమంటారు? అత్తా, కోడళ్ల గొడవలకి మీకు తెలిసిన కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు గొడవ కాకుండా ఉండాలంటే పరిష్కారం ఏమిటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి.