Venkateswarlu
Venkateswarlu
అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. అంటే అతిగా చేసే ఏ పనైనా చివరకు నష్టాన్నే మిగులుస్తుందని దానర్థం. ఆఖరికి మన ప్రాణాలు నిలిపే నీరు కూడా అతిగా తాగితే అనర్థాన్నే తెస్తుంది. ఇందుకు తాజా ఘటనే ప్రత్యక్ష ఉదాహారణ. విహారయాత్రకు వెళ్లిన ఓ మహిళ అతిగా నీళ్లు తాగింది. అంతే.. ఆ నీళ్లే విషంలా మారి ఆమె ప్రాణాలు తీశాయి. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని ఇండియానాకు చెందిన 35 ఏళ్ల ఆష్లే సమ్మర్ గత జులై చివరి వారంలో భర్త, పిల్లలతో కలిసి ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేసింది. అనుకున్న దాని ప్రకారం నలుగురూ కలిసి లేక ఫ్రీమ్యాన్‌కు టూరుకు వెళ్లారు. టూరులో ఆమె తన భర్త.. ఇద్దరు పిల్లలతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. కొద్ది సేపటి తర్వాత ఆమె డీహైడ్రేషన్‌కు గురైంది. తలనొప్పిగా ఉందని, దాహం కూడా బాగా వేస్తోందని భర్తకు చెప్పింది. తర్వాత తన దాహాన్ని తీర్చుకోవటానికి నీళ్లు తాగటం మొదలుపెట్టింది. ఒక బాటిల్‌తో ఆమె దాహం తీరలేదు. దీంతో 20 నిమిషాల్లో దాదాపు నాలుగు బాటిళ్ల నీళ్లు తాగింది.
టూరు నుంచి ఇంటికి రాగానే ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు మెదడు ఉబ్బిపోయినట్లు గుర్తించారు. ఆమె కోమాలోకి వెళ్లినట్లు తేల్చారు. అంతేకాదు! ఆమె వాటర్ టాక్సిటీకి గురైందని వెల్లడించారు. నీళ్లు ఎక్కువగా తాగటం వల్ల.. అది విషంగా మారి ప్రాణాలు తీస్తుందని తెలిపారు. ఆష్లే సమ్మర్‌ను బ్రతికించటానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. మరి, అతిగా నీళ్లు తాగటం వల్ల చనిపోయిన ఆష్లే సమ్మర్ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.