iDreamPost

Rishi Sunak: బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో రిషి సునాక్‌ పార్టీ ఓటమి.. క్షమించండి అంటూ

  • Published Jul 05, 2024 | 11:11 AMUpdated Jul 05, 2024 | 11:11 AM

UK General Election 2024: బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ దారుణంగా ఓటమి పాలైంది. ఆ వివరాలు..

UK General Election 2024: బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ దారుణంగా ఓటమి పాలైంది. ఆ వివరాలు..

  • Published Jul 05, 2024 | 11:11 AMUpdated Jul 05, 2024 | 11:11 AM
Rishi Sunak: బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో రిషి సునాక్‌ పార్టీ ఓటమి.. క్షమించండి అంటూ

బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. గతంతో పోలిస్తే.. ఈ సారి యూకే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై భారతీయులు కూడా అమితాసక్తి కనబరిచారు. అందుకు కారణం.. కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడు, నిన్నటి వరకు బ్రిటన్‌ ప్రధానిగా ఉన్న రిషి సునాక్‌. భారత మూలాలున్న వ్యక్తి మాత్రమే కాక.. ఇండియాలోనే దిగ్గజ ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు కావడంతో.. ఈసారి బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలపై భారతీయులు కూడా ఆసక్తి కనబరిచారు. అయితే ఈ ఎన్నికల్లో బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ దారుణ పరాజయాన్ని చవిచూసింది.

బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో.. యూకే ప్రజలు.. ప్రతిపక్ష లేబర్ పార్టీకి పట్టం కట్టారు. మొత్తం 650 స్థానాలున్న యూకే పార్లమెంట్‌లో.. ఇప్పటి వరకూ అందిన ఫలితాలను బట్టి లేబర్ పార్టీ 354 స్థానాల్లోనూ.. కన్జర్వేటివ్ పార్టీ కేవలం 74 స్థానాల్లోనూ విజయం సాధించాయి. దీంతో ఓటమిని అంగీకరించిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. ప్రజల తీర్పును అంగీకరిస్తామని ప్రకటించారు. ఈ ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నట్టు తన మద్దతుదారులను ఉద్దేశించిన చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.

‘‘ఈ రోజు ఎంతో శాంతియుతంగా.. ప్రజాస్వామ్యబద్దంగా అన్ని వైపులా సద్భావనతో అధికార మార్పిడి జరుగుతుంది… అది మన దేశ స్థిరత్వం.. భవిష్యత్తుపై మనందరికీ విశ్వాసం కలిగించే విషయం. ఎన్నికల్లో కన్జర్వేటీవ్‌ పార్టీ ఓటమి నన్ను కుంగదీసింది. ఇందుకు నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను.. ఓటమికి పూర్తి బాధ్యత నాదే అని తెలియజేస్తున్నాను’’ అన్నారు. ఇకపై లేబర్ పార్టీ నాయకుడు కైర్ స్టార్మేర్ తదుపరి బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఫలితాలపై కైర్ స్టార్మేర్ మాట్లాడుతూ.. ‘‘దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోసం సిద్ధంగా ఉన్నారు.. మార్పు ఇక్కడే మొదలువుతుంది’’ అని అన్నారు. బ్రెగ్జిట్, దశాబ్దకాలంగా కొనసాగుతోన్న జీవన వ్యయ సంక్షోభం నుంచి ఉపశమనం కల్పిస్తానని ఆయన వాగ్దానం చేశారు. అయితే, వీటి నుంచి బయటపడటం ఆయన హామీ ఇచ్చినంత సులభం కాదు.

గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ అధికారంలో ఉంది. ఇక రెండేళ్లక్రితం రిషి సునాక్ ప్రధానిగా ఎన్నికై.. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అయితే, ఎన్నికలకు ముందు కొంత కాలం నుంచి ఆయన పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. వలసల కట్టడి, ఇతర అంశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలోనూ సునాక్‌ పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణల్లో సునాక్, ఆయన కన్జర్వేటివ్‌ పార్టీ రేటింగ్‌లు పడిపోతూ వచ్చాయి. అది కాస్త ఫలితాలపై ప్రభావం చూపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి