Krishna Kowshik
సాధారణంగా ఓ 14 ఏళ్ల బాలుడు ఏం చేస్తాడు.. ఏడో లేక ఎనిమిదో తరగతి చదువుతుంటాడు. ఖాళీ సమయాల్లో సెల్ ఫోన్స్ లో వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. కానీ ఈ పిల్లగాడు ఓ దేశానికి అధ్యక్షుడయ్యాడు. అదీ కూడా తన స్వయం కృషితో
సాధారణంగా ఓ 14 ఏళ్ల బాలుడు ఏం చేస్తాడు.. ఏడో లేక ఎనిమిదో తరగతి చదువుతుంటాడు. ఖాళీ సమయాల్లో సెల్ ఫోన్స్ లో వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. కానీ ఈ పిల్లగాడు ఓ దేశానికి అధ్యక్షుడయ్యాడు. అదీ కూడా తన స్వయం కృషితో
Krishna Kowshik
ఈ రోజుల్లో పిల్లలు.. మేం పిల్లలం కాదు చిచ్చర పిడుగులం అని నిరూపిస్తున్నారు. నిండా మూడేళ్లు రాని పిల్లలు సైతం.. లిమ్కా బుక్ వరల్డ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుల్లో స్థానాలు సంపాదించి అబ్బురపరుస్తున్నారు. అంతేనా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టార్ గా నిలుస్తున్నారు. తమ వీడియోలతో కోట్లు గడిస్తున్న చిన్నారులు ఉన్నారు. అలాగే తమ తెలివి తేటలకు పదును పెట్టి.. చిన్న వయస్సులో అద్భుతమైన ఆవిష్కరణలు చేపడుతున్నారు. ఇదిగో మనం చెప్పుకోబోయే ఓ బుడ్డోడు.. ఏకంగా 14 ఏళ్లకు దేశాధ్యక్షుడు అయ్యాడు. అతడి ప్రస్తుత వయస్సు 19 ఏళ్లు. అదేంటీ ఏ దేశంలోనైనా మేజర్లు కాకుండా దేశ అధ్యక్షులు కావడం సాధ్యం కాదు కదా. ఇదేమన్నా వన్ డే ప్రెసిడెంట్ లాంటిది అనుకుంటున్నారా. అయితే మీరు పప్పులో కాలేసినట్లు.. నిజంగానే 14 ఏళ్లకే అధ్యక్షుడు అయ్యాడు. దీని కోసం ఏకంగా సొంతంగా దేశాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.
అతడే డేనియల్ జాక్సన్. ఆస్ట్రేలియాలో పుట్టి,బ్రిటన్‌లో పెరిగిన డేనియల్ .. 14 ఏళ్లకు స్వంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని.. ఆ దేశానికి అధ్యక్షుడయ్యాడు. అధికారికంగా ఉన్న దేశాలకు అధ్యక్షుడు అవ్వడం సాధ్యం కాదు కనుక.. తన తెలివి తేటలతో దేశాన్ని సృష్టించి, జెండాను తయారు చేసి, దానికి నామకరణం చేసి.. ప్రెసిడెంట్ అయ్యాడు ఈ బాల మేధావి. ఆ దేశాన్ని ఆషామాషీగా ఏర్పాటు చేయలేదు.. అన్నీ తెలుసుకుని, పరిశీలించి, పరిశోధించి చేసినవే కావడం విశేషం. ఎలా చేశాడంటే.. ఐదేళ్ల క్రిందట మాట ఇది. ఆరుగురు స్నేహితులతో కలిసి సెర్బియా–క్రొయేషియాల మధ్య డాన్యూబ్ నది మధ్యలో ఉన్న భూబాగాన్ని గుర్తించాడు. ఈ భూభాగం ఈ ఇరు దేశాలకు మాత్రమే కాకుండా చారిత్రకంగా ఎవరికి చెందినది కాదని తెలుసుకున్న అతడు.. దానిపై పాగా వేశాడు.
అంతేనా.. దేశానికి జెండా క్రియేట్ చేశాడు. లేతనీలం, తెలుపు చారలతో సొంత జెండాను తయారు చేసి, ఆ భూభాగంలో జెండా పాతాడు. ఆ దేశానికి వెర్డిస్‌గా నామకరణం చేశాడు. అనంతరం ఆ దేశానికి అధ్యక్షుడినని ప్రకటించుకున్నాడు. ఇంతకు ఈ దేశ విస్తీర్ణం ఎంతంటే.. చదరపు మైళ్లు–అంటే 128 ఎకరాలు మాత్రమే. ఈ లెక్కన వాటికన్ సిటీ కన్నా చిన్న దేశం ఇదే. దేశం ఏర్పడ్డాక.. జనాలు రావడమే కాదూ.. నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ప్రస్తుతం 400 మంది ఉంటున్న ఈ చిట్టి దేశంలో పౌరసత్వం కోసం ఇప్పటికే దాదాపు 15 వేల మంది దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. అంతేనా..దేశానికి అధ్యక్షుడిగా ప్రకటించుకోవడే కాదు. ఉనికిలో ఉన్న దేశానికి సాయం చేశాడు. ఉక్రెయిన్ యుద్ధ బాధితుల కోసం తన దేశం తరఫున అధికారికంగా విరాళం అందించడం విశేషం.
అంత సవ్యంగా సాగిపోతే ఎలా.. ఈ దేశానికి కూడా శత్రువులా దాపరించింది పొరుగున ఉన్న క్రొయేషియా. తమ భూభాగంలో పొరపాటున అడుగుపెట్టిన వెర్డిస్ పౌరులను క్రొయేషియా పోలీసులు బందీలుగా పట్టుకున్నారు. అంతేకాకుండా ఈ దేశంపై కన్ను వేసి..గత అక్టోబర్ 12న వెర్డిస్ భూభాగాన్ని తమ స్వాధీనంలోకి తీసుకుంది. ఆ తర్వాత వారందరినీ తమ భూభాగంలో విడిచిపెట్టిందని చెబుతున్నాడు దేశ అధ్యక్షుడు డేనియల్. క్రొయేషియా చర్య అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకమని, ఈ విషయంపై అంతర్జాతీయ వేదికపై న్యాయం పోరాటం చేస్తామని అంటున్నాడు. తమ దేశానికి ఎవరైనా చేరుకోవాలంటే, క్రొయేషియా భూభాగాన్ని దాటాల్సి ఉంటుందని, అందువల్లనే ఆ దేశం తమ ప్రజల్ని నిర్బంధంలోకి తీసుకుని, ఆ తర్వాత తమ భూభాగంలో విడిచిపెడుతుందని చెబుతున్నాడు. రానున్న ఐదేళ్లలో తమ దేశాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెబుతున్నాడు. చిన్నోడే కానీ.. మహా గట్టోడిలా కనిపిస్తున్నాడు కదూ.