iDreamPost
android-app
ios-app

అమెరికాలో భారత విద్యార్థినిపై పిడుగుపాటు.. మృత్యువుతో పోరాడుతూ!

  • Published Jul 21, 2023 | 2:23 PM Updated Updated Jul 21, 2023 | 2:23 PM
  • Published Jul 21, 2023 | 2:23 PMUpdated Jul 21, 2023 | 2:23 PM
అమెరికాలో భారత విద్యార్థినిపై పిడుగుపాటు.. మృత్యువుతో పోరాడుతూ!

భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నది. విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించాలని ఆశపడింది. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కోరుకుంది. కానీ ఆమె ఆశలు అడియాసలు అయ్యాయి. మిత్రులతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా.. ఊహించని రీతిలో మృత్యువు ఎదురయ్యింది. నడుచుకుంటూ వెళ్తుండగా.. పిడుగు పడి ఆమె కలల్ని, భవిష్యత్తును, జీవితాన్ని మంట కలిపింది. ప్రస్తుతం ఆ యువతి ప్రాణాల కోసం పోరాడుతుంది. ప్రకృతి వైపరిత్యాల వల్ల ఎంతటి దారుణ సంఘటనలు చోటు చేసుకుంటాయో ఈ ఘటన అద్దం పడుతుంది. ఈ నెల ప్రారంభంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన భారతీయ యువతి పిడుగుపాటుకు గురై చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. భారత్‌కు చెందిన సుశ్రూణ్య కోడూరు (25) అనే యువతి యూనివర్సిటీ ఆఫ్‌ హ్యూస్టన్‌ (యూహెచ్‌)లో మాస్టర్స్ చేయడం కోసం అమెరికా వెళ్లింది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో మాస్టర్స్‌ మొదటి ఏడాది చదువుతుంది సుశ్రూణ్య. ఈ క్రమంలో జులై 2 సాయంత్రం 5.40 గంటల సమయంలో సుశ్రూణ్య.. తన స్నేహితులతో కలిసి పార్కులో నడుచుకుని వెళ్తుంది. ఇంతలో ఉన్నట్లుండి ఒక్కసారిగా పిడిగులు పడ్డాయి.

ఊహించని ఈ ఘటనకు అందరూ షాక్‌కు గురయయారు. ఏం జరుగుతుందో తేరుకునేలోపే.. ఒక పిడుగు సూశ్రూణ్యను బలంగా తాకడంతో.. అక్కడే స్పృహ తప్పి కింద పడిపోయింది. ఈ ఘటనతో అప్పటికే షాక్‌లో ఉన్న ఆమె స్నేహితలు.. కాసేపటి తర్వాత తేరుకుని.. సుశ్రూణ్య కోసం వెతకడం ప్రారంభించారు. 15 నిమిషాలు గాలించిన తర్వాత వారికి కొలనులో పడి ఉన్న సుశ్రూణ్య కనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా కొలనులోకి దిగి.. ఆమెను బయటకు తీశారు. అప్పటికే సుశ్రూణ్య గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. వెంటనే ఆమె స్నేహితులు సీపీఆర్ చేశారు. వారి ప్రయత్నం ఫలించి గుండె మళ్లీ కొట్టుకుంది.

అనంతరం చికిత్స కోసం సుశ్రూణ్యను ఆస్పత్రికి తరలించారు. కానీ, రక్త ప్రసరణ జరగకపోవడంతో మెదడులో న్యూరాన్లు దెబ్బతిని, కోమాలోకి వెళ్లిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. సుశ్రూణ్యను బతికించడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో పిడుగుపాటు కారణంగా సుశ్రూణ్య మెదడు దెబ్బతిన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపారు. ఆమె కోలుకోవాలంటే దీర్ఘకాలం వైద్యచికిత్స అందించాల్సి ఉంటుందని సుశ్రూణ్య బంధువు సురేంద్ర కుమార్‌ కొత్త తెలిపారు. ఆమె పిడుగుపాటుకు గురైన వెంటనే కొలనులో పడిపోయారని, ఆ సమయంలో 20 నిమిషాలపాటు గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో సుశ్రూణ్య మెదడు దెబ్బతిన్నట్లు సురేంద్ర తెలిపారు. ఇక సుశ్రూణ్య వైద్య చికిత్సకు అయ్యే ఖర్చుతో పాటు ఆమె కుటుంబసభ్యులను అమెరికాకు రప్పించేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కోరుతూ ఆన్‌లైన్‌లో ‘గోఫండ్‌మీ’ద్వారా సాయం కోరుతున్నారు.