iDreamPost
android-app
ios-app

బత్తిన సోదరుల చేప మందు ప్రత్యేకత ఏమిటి? ఇన్ని లక్షల మంది ఎందుకు వస్తారంటే?

  • Published Jun 08, 2024 | 6:37 PMUpdated Jun 08, 2024 | 6:37 PM

Chepa Mandu: ప్రతి ఏటా హైదరాబాద్‌లో బత్తిన సోదరులు పంపిణీ చేసే చేప మందు కోసం ఎక్కడెక్కడి నుంచో ఉబ్బసం వ్యాధిగ్రస్తులు, జనాలు తరలి వస్తుంటారు. మరి ఈ మందు ప్రత్యేకత ఏంటి.. దీని గురించి సైన్స్‌ ఏం చేబుతుంది అంటే..

Chepa Mandu: ప్రతి ఏటా హైదరాబాద్‌లో బత్తిన సోదరులు పంపిణీ చేసే చేప మందు కోసం ఎక్కడెక్కడి నుంచో ఉబ్బసం వ్యాధిగ్రస్తులు, జనాలు తరలి వస్తుంటారు. మరి ఈ మందు ప్రత్యేకత ఏంటి.. దీని గురించి సైన్స్‌ ఏం చేబుతుంది అంటే..

  • Published Jun 08, 2024 | 6:37 PMUpdated Jun 08, 2024 | 6:37 PM
బత్తిన సోదరుల చేప మందు ప్రత్యేకత ఏమిటి? ఇన్ని లక్షల మంది ఎందుకు వస్తారంటే?

జూన్‌ 8కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు మృగశిర కార్తె ప్రారంభం. దీన్నే అన్నదాతలు ఏరువాక సాగే కాలమని కూడా పిలుస్తారు. కొన్నాళ్ల క్రితం వరకు కూడా మృగశిర కార్తె నాడు ఏరువాక సాగి.. విత్తనాలు వేసేవారు. కానీ ఇప్పుడు వర్షాలు సకాలంలో కురవడం లేదు కనుక.. ఆ పద్దతి కనుమరుగు కావొస్తుంది. ఇదిలా ఉంటే ఇక మృగశిర కార్తె నాడు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తారు. కారణం చేపమందు. పైగా మృగశిర కార్తె నాడు తెలుగు ప్రజలు చేపలు కచ్చితంగా తింటారు. ఇదే రోజున ఉబ్బసం రోగులకు చేప మందు పంపిణీ చేస్తారు. దీని కోసం ఎక్కడెక్కడి నుంచో పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తారు. దీన్ని చేప ప్రసాదం అని కూడా అంటారు. ఇది ఆస్తమాను తగ్గిస్తుంది అని నమ్ముతారు. మరి ఈ చేపమందు ప్రస్థానం ఎలా మొదలయ్యింది.. దీనిలో ఉన్న సైన్స్‌ ఏంటి వంటి వివరాలు మీ కోసం..

తొలిసారి ఈ మందును 1847లో తయారు చేశారు. అప్పట్లో ఒక సాధువు దేశమంతా తిరుగుతూ.. హైదరాబాద్‌ పాతబస్తీకి వచ్చారు. ఆ సమయంలో ఆయనకు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బత్తిని వీరన్నగౌడ్‌ అనే వ్యక్తి ఆశ్రయం కల్పించారు. ఆ సమయంలోనే వీరు చేపమందు తయారు చేశారు. ఇక ఈమందును ఉచితంగా పంపిణీ చేస్తే.. నీకు అన్ని విధాల మంచి జరుగుతుందని సదరు స్వామిజీ వీరన్న గౌడ్‌కు చెప్పాడు. అప్పటి నుంచి బత్తిని కుటుంబ సభ్యులు ఈ మందును ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

చేప మందులో ఏం వాడతారు..

ప్రతి ఏటా మృగశిర కార్తె నాడు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఉచితంగా చేప మందు పంపిణీ చేస్తారు. ఇక దీన్ని పాలపిండి, ఇంగువ, బెల్లం, పసుపు, ఇతర వనమూలికలు కలిపి తయారు చేస్తారు. ఈ మందును చిన్న సైజు కొరమీను చేప పిల్లల నోటిలో ఉంచి.. ఉబ్బసం వ్యాధి ఉన్న వారికి నోటి ద్వారా వేస్తారు. అలా వేశాక.. చేపపిల్ల నోటిలో ఉన్న మందు మెల్లగా కరిగి.. గొంతు ద్వారా వెళ్లినప్పుడు స్వరపేటికను కూడా శుద్ధి చేస్తుందని బత్తిని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ముందు దీన్ని పాతబస్తీలోనే పంపిణీ చేసేవారు. అయితే రాను రాను జనాల తాకిడి పెరగడంతో.. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కి మార్చారు.

చేపమందు గురించి సైన్స్‌ ఏం చేబుతుంది..

అయితే చేపమందు ఉబ్బసాన్ని నయం చేస్తుందని శాస్త్రీయంగా ఎక్కడా నిరూపితం కాలేదనే ఆరోపణ ఎన్నాళ్ల నుంచో ఉంది. కొందరు దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. దీన్ని చేపమందు అని పిలవద్దని.. ప్రసాదం అనాలని సూచించింది. కానీ చాలా మంది ఉబ్బసం వ్యాధి గ్రస్తులు మాత్రం దీన్ని నమ్ముతారు. ప్రతి ఏటా వచ్చి దీన్ని స్వీకరిస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి