కృష్ణగారి కడచూపు కోసం కదిలొస్తున్న పరిశ్రమ..

  • Published - 05:28 PM, Tue - 15 November 22
కృష్ణగారి కడచూపు కోసం కదిలొస్తున్న పరిశ్రమ..

సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరనే వాస్తవాన్ని దిగమింగుకోవడం అభిమానులకే కాదు ఇండస్ట్రీ వర్గాలకు సైతం చాలా కష్టంగా ఉంది. అజాత శత్రువుగా వివాదాలకు దూరంగా ఉండే నట శేఖరుడితో తమ జ్ఞాపకాలను ఆయన పార్థీవ దేహం ముందు గుర్తు చేసుకోవడానికి స్వయంగా విచ్చేసి అంజలి ఘటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు విడివిడిగా మహేష్ బాబుని పరామర్శించి తమ సంతాపం ప్రకటించారు. వెంకటేష్ కాసేపు అక్కడే ఉండి కుటుంబ సభ్యులతో ఈ విషాదం తాలూకు వివరాలు తెలుసుకున్నారు. అల్లు అర్జున్ విచ్చేయగా జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ తదితరులు చెమరిన కళ్ళతో తమ సాటిహీరోకి సానుభూతి తెలిపారు.

కృష్ణతో ఎన్నో సినిమాల్లో నటించిన అనుభవంతో పాటు ఎంతో అనుబంధం కలిగిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కంటతడి పెట్టిన తీరు చూపరులను కదిలించింది. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, మహేష్ లను కౌగలించుకుని చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడవడం చూసి నిలువరించడం మంచు విష్ణు వల్ల కూడా కాలేదు. ఇటీవలే పెదనాన్నను కోల్పోయిన ప్రభాస్ వ్యక్తిగతంగా తన మిత్రుడి కోసం వచ్చి సంఘీభావం తెలిపాడు. ఎందరో నిర్మాతలు, పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ వేత్తలు ఉదయం నుంచి ప్రవాహంలా కృష్ణ గారి దర్శనం కోసం వస్తూనే ఉన్నారు. అభిమానులు వేచి చూస్తున్నప్పటికీ వాళ్ళను అనుమతించే వెసులుబాటు లేకపోవడంతో బయటే ఉంచారు.


సాయంత్రం నుంచి గచ్చిబౌలి స్టేడియంలో సామాన్య ప్రజానీకం కోసం కృష్ణ గారి పార్ధీవ దేహాన్ని అక్కడ ఉంచబోతున్నారు. రేపు జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి. రెండు నెలల క్రితం తల్లి ఇందిరాదేవి కోసం ఈ బాధ్యతలు నిర్వర్తించిన మహేష్ బాబు అతి తక్కువ గ్యాప్ లో తండ్రికి కొరివి పెట్టాల్సి రావడం ఫ్యాన్స్ ని కలిచి వేస్తోంది. అన్నయ్య, అమ్మ, నాన్న ఇలా ముగ్గురు పదకొండు నెలల నిడివిలో స్వర్గానికేగడం ఘట్టమనేని కుటుంబంలో తీరని విషాదం నింపుతోంది.కృష్ణ గారికి నివాళిగా రేపు టాలీవుడ్ మొత్తం బంద్ పాటించనుంది. అందులో భాగంగా షూటింగులనుపూర్తిగా రద్దు చేశారు. థియేటర్లు సైతం నడపకపోవచ్చు.

Show comments