మాములుగా స్టార్ హీరోలతో వచ్చే చిక్కేంటంటే తమ ఇమేజ్ కు తగ్గ కథలు ఎంచుకోవడం పెద్ద సవాల్. పోనీ ఎంతో జాగ్రత్తగా కాచి వడబోసి డైరెక్టర్ ని ఓకే చేస్తే తీరా బాక్సాఫీస్ వద్ద ఆడుతుందన్న గ్యారెంటీ లేదు. అందుకే ఇటీవలి కాలంలో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి వాళ్లకు రెండేళ్లకు పైగా గ్యాప్ తప్పలేదు. ఇంతా చేసి ఇప్పటికీ వీళ్ళ కొత్త ప్రాజెక్ట్స్ పూర్తి స్థాయి షూటింగ్ మొదలుపెట్టుకోలేదు. ఎక్కువగా మాస్ ని టార్గెట్ చేసినప్పుడు వచ్చే చిక్కులివి. పైగా మార్కెట్ పరిస్థితులు అనూహ్యంగా మారిపోతున్నాయి. కేవలం కాంబినేషన్ల క్రేజ్ తో బిజినెస్ జరుగుతోంది కానీ ఆడియన్స్ థియేటర్ కు వచ్చేలా చేయలేకపోతున్నారు. ఈ విషయంలో సూర్యని మెచ్చుకోవాలి.
ఒకపక్క రెగ్యులర్ ఎంటర్ టైనర్స్ చేస్తూనే మరోవైపు విలక్షణ దర్శకులతో పని చేసేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు. ప్రస్తుతం తను బాలా దర్శకత్వంలో అచేలుడు చేస్తున్న సంగతి తెలిసిందే. శివపుత్రుడుతో తనకు బిగ్ బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ గా ఫామ్ లో లేకపోయినా సరే ఆయనతో పని చేసేందుకు ఎస్ చెప్పాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూట్ ప్రస్తుతం జరుగుతోంది. దీని తర్వాత ఆకాశం నీ హద్దురాతో తన పేరుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేసిన సుధా కొంగరతో మరోసారి సూర్య చేతులు కలపబోతున్నాడు. ఇది బయోపిక్కా లేక వేరే జానర్ లో ఉంటుందా తెలియదు కానీ రియల్ ఇన్సి డెంట్స్ ఆధారంగా రాసుకున్నట్టు వినికిడి.
జైభీమ్ తో తన నటనను ఇమేజ్ ని కొత్త కోణంలో ఆవిష్కరించి ఆస్కార్ తెచ్చినంత పని చేసిన దర్శకుడు టీజె జ్ఞానవేల్ తో మరో సినిమా చేసేందుకు సూర్య రెడీ అవుతున్నాడు. ఇవన్నీ విభిన్నమైన ప్రయత్నాలే. మరోవైపు సిరుతై శివతో సినిమాని ఆల్రెడీ మొదలు పెట్టేశాడు. వంద కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ డ్రామాగా రాబిన్ హుడ్ స్టైల్ లో ఇది రూపొందనుంది. ఎలా చూసుకున్నా గ్యాప్ లేకుండా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న సూర్య మిగిలినవాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. స్క్రిప్ట్ పేరుతో సంవత్సరాల తరబడి వృధా చేస్తున్నవాళ్లకు సుతిమెత్తని పాఠం చెబుతున్నాడు. సంవత్సరానికి కనీసం ఒక్క సినిమా చేయని హీరోలు దీని గురించి సీరియస్ గా ఆలోచించాల్సిందే.