ఆ ఒక్క సినిమాతో ఇండస్ట్రీ షేక్..

  • Published - 12:25 PM, Tue - 15 November 22
ఆ ఒక్క సినిమాతో ఇండస్ట్రీ షేక్..

సూపర్ స్టార్ కృష్ణ ఎన్ని సినిమాలు తీసినా.. ఒక్క పాత్ర తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టి నటించారు.

సూపర్ స్టార్ కృష్ణ ప్రయోగాలకు మారుపేరు. టాలీవుడ్‌కు కౌబాయ్, జేమ్స్ బాండ్ చిత్రాలను పరిచయం చేసిన హీరో. తెలుగు సినిమా ఖ్యాతిని మరోస్థాయికి తీసుకువెళ్లి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించి చరిత్రలో తన పేరును నిలిచిపోయేలా చేసుకున్నారు. తెలుగు సినిమా చరిత్ర గురించి మరో వందేళ్ల తరువాత మాట్లాడినా.. కచ్చితంగా కృష్ణ పేరును గుర్తుకు చేసుకోవాల్సిందే.

 

మనకు అల్లూరి సీతారామరాజు పేరు చెప్పగానే.. గుర్తుచ్చే రూపం కృష్ణదే. ముందుగా ఎన్టీఆర్ ఈ పాత్రను చేయాలని అనుకున్నారు. కానీ కృష్ణ సాహసంతో అల్లూరి సీతారామరాజు సినిమాను ప్రకటించారు. ఈ పాత్రను సవాల్‌గా తీసుకుని ప్రాణం పెట్టి నటించారు. ఆ సినిమాలో కృష్ణ చెప్పిన డైలాగ్‌లు అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. 1974లో విడుదలైన ఈ సినిమా రికార్డులను బద్దలు కొడుతూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని సినిమా నిర్మించేందుకు ఎన్టీఆర్ స్క్రిప్ట్ రాయించుకుని ప్రయత్నాలు చేసినా పట్టాలెక్కలేదు. అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు వంటి వారు కూడా అల్లూరి పాత్రలో మూవీ తీయాలని ప్రయత్నించినా ఫలించలేదు. అల్లూరి జీవితాన్ని ఆధారం చేసుకుని స్క్రిప్టును త్రిపురనేని మహారథితో రాయించుకుని సూపర్ కృష్ణ తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాను అందించారు.

కృష్ణ కెరీర్‌లో 100వ సినిమాగా ఇది. అప్పట్లో 19 కేంద్రాల్లో వందరోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం, ఆఫ్రో-ఏషియన్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శన-బహుమతి వంటివి సొంతం చేసుకుంది. కృష్ణ సినీ జీవితంలో మైలురాయిగా అల్లూరి సీతారామరాజు సినిమా మిగిలిపోయింది.

అయితే ఈ సినిమా విడుదలైన తరువాత కృష్ణకు వరుసగా 12 ఫ్లాపులు ఎదురయ్యాయి. అల్లూరి పాత్రలో కృష్ణను చూసిన సినీ ప్రేక్షకులు.. ఇతర పాత్రల్లో ఊహించులేకపోయారు. 1975లో కృష్ణ కెరీర్ కుదేలైంది. ఆయనతో సినిమాలు తీసేందుకు ప్రొడ్యూసర్లు కూడా ముందుకు రాలేదు. ఇక అందరూ కృష్ణ పని అయిపోందనుకున్నారు. ఇక లాభం లేదనుకుని సొంత నిర్మాణం సంస్థలో పాడిపంటలు సినిమాను తీసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ఆ తరువాత మళ్లీ కెరీర్‌లో వెనుతిరిగి చూసుకోలేదు.

Show comments