కోలుకోదగ్గ వ్యాధే అయినా మానసికంగా శారీరకంగా పెద్ద యుద్ధమే చేస్తున్న సమంత కొత్త సినిమా యశోద ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. వ్యక్తిగతంగా ప్రమోషన్లకు హాజరు కాలేని పరిస్థితిలో ఉండటంతో స్వయంగా తనున్న చోటు నుంచి ఇంటర్వ్యూలు ఇస్తోంది. తెలుగు వెర్షన్ కు సంబంధించి ఆ బాధ్యతను యాంకర్ సుమకు అప్పజెప్పారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ ఎపిసోడ్ ఇవాళ నుంచి నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ అఫీషియల్ ఛానల్ లో అందుబాటులోకి వచ్చింది. కొద్దిరోజుల క్రితం ట్రీట్ మెంట్ తీసుకున్నట్టుగా కేవలం చేతివేళ్లతో ఫోటో ట్వీట్ చేసిన సామ్ ఇప్పుడు వీడియో రూపంలో ప్రత్యక్షంగా ఫ్యాన్స్ ని కలుసుకుంది.
సమంతాలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. బాధను దిగమింగుతూ దీన్ని ఎలాగైనా జయిస్తాననే ధీమాను ఒకపక్క చూపిస్తూనే తనకిష్టమైన నటనను తాత్కాలికంగా అయినా సరే దూరం చేసిన రుగ్మత పట్ల ఆవేదన అంతకు పదింతలు కనిపిస్తోంది. కొన్ని ఆర్టికల్స్ లో తనకేదో అయిపోతోందనే తరహాలో వార్తలు రాస్తున్నారని, కానీ చనిపోయేటంత దారుణమైన స్థితిలో లేనని ఇంకా బ్రతికే ఉన్నానని కంటి వెనుక బయటికి వచ్చేందుకు ఉబుకుతున్న కన్నీటిని ఆపుకుంటూ చెప్పడం కదిలించింది.
నిజానికి సమంతా కొంత టైం తీసుకున్నా ఆరోగ్యంగా బయటికి రావడం ఖాయమే. కానీ ఆన్ లైన్ వేదికగా జరుగుతున్న ప్రచారం ఫ్యాన్స్ నే కాదు సామ్ ని సైతం కలవరానికి గురి చేసింది. ఇంత కమిట్ మెంట్ చూపిస్తున్నందుకు సమంతాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చిన్న గాయమైతేనే ప్రమోషన్లు ఎగ్గొట్టే హీరోయిన్లు ఉన్నారు. కోట్లు పారితోషికంగా తీసుకుని నటించడం వరకే నాపని ఈవెంట్ గట్రా మీరే చూసుకోండని మొహం మీదే చెప్పే అగ్ర కథానాయికలు ఉన్నారు.
అలాంటిది ఇంత సమస్య ఉన్నప్పటికీ ఇంకో మూడు రోజులో రిలీజ్ కాబోతున్న తన సినిమా నిర్మాతకు మేలు జరగాలన్న ఉద్దేశంతో సమంతా తానుగా ఇలా ముఖాముఖీల్లో పాల్గొనడం అభినందనీయం. యశోద ఇప్పటిదాకా సామ్ కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ లో రూపొందిన ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ. ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. సమంతా కాన్ఫిడెన్స్ కు అదే స్థాయిలో కనిపిస్తోంది.