iDreamPost
android-app
ios-app

ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారు – షెడ్యూల్ విడుదల..

ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారు – షెడ్యూల్ విడుదల..

■ విశాఖ-వారణాసి మధ్య కొత్తగా ప్రవేశపెట్టనున్న రైలుకు ప్రధాని జెండా ఊపి ప్రారంభం..

■ పలు ప్రభుత్వ పథకాలకు మోదీ శంకుస్థాపన..

ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖకు చేరుకోనున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఆ రోజు రాత్రికి ప్రధాని మోదీ విశాఖలోనే బస చేస్తారు. ఈనెల 12న ఉదయం ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.

◆ ఈ సందర్భంగా ఆయన పలు పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని మోదీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ సైతం పాలుపంచుకుంటారు.

◆ రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్‌ నవీకరణ, ఈస్ట్‌కోస్టు జోన్‌ పరిపాలన భవన సముదాయానికి శంకుస్థాపన, రూ.260 కోట్లతో చేపట్టిన వడ్లపూడిలో వ్యాగన్‌ వర్క్ షాపు, రూ.26వేల కోట్లతో చేపట్టిన హెచ్‌పీసీఎల్‌ నవీకరణ, విస్తరణ పనులు, రూ.445 కోట్లతో చేపట్టిన ఐఐఎం పరిపాలన భవనానికి ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

◆ రూ.152 కోట్లతో చేపట్టనున్న చేపలరేవు నవీకరణ ప్రాజెక్టు, రూ.560 కోట్ల ఖర్చుతో కాన్వెంట్‌ కూడలి నుంచి షీలానగర్‌ వరకు పోర్టు రహదారికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.

◆ విశాఖ-వారణాసి మధ్య కొత్తగా ప్రవేశపెట్టనున్న రైలుకు ప్రధాని జెండా ఊపే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కానీ ఈ కార్యక్రమం ఇంకా ఖరారు కాలేదు. ప్రధాని మోదీ బహిరంగ సభకు సుమారు లక్ష మందిని తరలించేలా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది.

◆ జిల్లా నలుమూలల నుంచి ప్రజలను తీసుకువచ్చేందుకు అవసరమైన రవాణా, వసతి, ఆహార పంపిణీ ఏర్పాట్లపై బీజేపీ నేతలు, అధికారులు దృష్టి సారించారు. కాగా ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖ జిల్లా పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.