డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఎంతగా మొత్తుకుంటున్నా నిర్మాతలు మీటింగులు పెట్టుకుని మరీ ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా ఓటిటి స్ట్రీమింగ్ కు సంబంధించి మాత్రం థియేటర్ గ్యాప్ ని పెంచలేకపోతున్నారు. ఆ మధ్య ఎనిమిది వారాల కనీస నిడివి ఉండాలని చెప్పిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆచరణలో దాన్ని కఠినంగా అమలు చేయలేకపోతోంది. నెల తిరక్కుండానే కార్తీ రీసెంట్ సూపర్ హిట్ సర్దార్ ఈ నెల 18న ఆహాలో వచ్చేస్తోంది. మొదటి వారంలో బ్రేక్ ఈవెన్ అందుకున్న సక్సెస్ ఫుల్ మూవీ ఇది. హైదరాబాద్ తో సహా చాలా ప్రధాన కేంద్రాల్లో ఇదింకా కొనసాగుతూనే ఉంది. వీకెండ్ లో మంచి వసూళ్లు నమోదవుతున్న టైంలో హఠాత్తుగా దీని స్ట్రీమింగ్ డేట్ ఇచ్చేశారు.
అదే రోజు చిరంజీవి గాడ్ ఫాదర్ నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ కానుంది. తెలుగుతో పాటు అన్ని బాషల వెర్షన్లు రిలీజ్ చేస్తారు. దీనికి మాత్రం నలభై పైచిలుకు రోజుల నిడివిని పాటించారు. ఇది కూడా తక్కువే. మండలి అనుకున్న రెండు నెలల కంటే పదిహేను రోజులు షార్టేజ్. ఆల్రెడీ ఓరి దేవుడా వచ్చేసింది. దసరాకి రిలీజైన స్వాతిముత్యంని దీపావళికి ఆహాలో పెట్టేశారు. ఘోస్ట్, శాకినీ డాకిని, దొంగలున్నారు జాగ్రత్త అన్నిటిదీ ఇదే వరస. విచిత్రంగా అన్నేసి డిజాస్టర్లు పడుతున్న బాలీవుడ్ లో మాత్రం ఇంత వేగంగా ఓటిటి టెలికాస్ట్ లు జరగడం లేదు. ఒప్పందం సమయంలోనే ప్రొడ్యూసర్లు కఠినంగా ఉండటంతో హిట్ అయినా ఫ్లాప్ అయినా తొందరపడటం లేదు.
కరోనా వచ్చిపోయాక దాని ప్రభావం చాలా నేరుగా తీవ్రంగా ఎగ్జిబిషన్ రంగం మీద పడుతోంది. ముఖ్యంగా ఓటిటిల తాకిడికి కలెక్షన్లు తగ్గిపోయి థియేటర్ ఓనర్లు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఏవైనా మీడియం లేదా చిన్న సినిమాలు వచ్చినప్పుడు ఇంట్లోనే ఏ ప్రైమ్ లోనో హాట్ స్టార్ లోనో చూద్దామనే ధోరణి విపరీతంగా పెరిగిపోయింది. దానికి తోడు పైరసీ రూపంలో విచ్చలవిడిగా అన్నీ ఆన్ లైన్లోనే దొరుకుతున్నాయి. ఇలాంటి సిచువేషన్ లో జనాన్ని బయటికి రప్పించడం అంత సులభంగా లేదు. నిర్మాత కోణం నుంచి ఆలోచిస్తే వీలైనంత మేరకు సేఫ్ గా ఉండే ప్రయత్నంలో భాగంగా ఓటిటిలతో ముందస్తు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు.