ఒక మహానటుడు చివరి చూపు కోసం అభిమానులే కాదు సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీ స్టేటస్ తో సంబంధం లేకుండా అందరూ తపించి పోయారు. ఆ కారణంగానే చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరు కడసారి దర్శనానికి బారులు తీరారు. అయితే ఒక్క అక్కినేని నాగార్జున మాత్రం ఇందులో మిస్ అవ్వడం హైలైట్ అయ్యింది. నిజానికాయన కొద్దిరోజుల క్రితమే గోవా వెళ్లినట్టు సమాచారం. ఆ కారణంగానే అప్పటికప్పుడు బయలుదేరి రాలేకపోయారనే ఒక వెర్షన్ ఉన్నప్పటికీ విదేశాలైతే సమస్య కాని పక్క రాష్ట్రం నుంచే కాబట్టి రకరకాల ప్రయాణ మార్గాల ద్వారా ఏదో ఒక రూపంలో వచ్చి ఉండవచ్చనే కామెంట్ లో వాస్తవాన్ని కొట్టిపారేయలేం.
నాగార్జునకు కృష్ణగారితో ఎప్పటి నుంచో బాండింగ్ ఉంది. సూపర్ స్టార్ హీరోగా కొనసాగుతున్న టైంలోనే వారసుడులో గాడ్ ఫాదర్ ధర్మతేజగా ప్రత్యేక పాత్ర వేశారు. టైటిల్ రోల్ తనది కాకపోయినా క్యారెక్టర్ నచ్చి ఒప్పుకున్నారు. అయితే ఘట్టమనేని అభిమానులకు ఇందులో కృష్ణగారిని చూపించిన విధానం నచ్చక నిరసనలు వ్యక్తం చేస్తే క్లైమాక్స్ ని నిర్మాత మురళీమోహన్ రీ షూట్ చేయించడం అప్పట్లో సంచలనం. ఆ తర్వాత రాముడొచ్చాడులోనూ ఫ్లాష్ బ్యాక్ లో ఓ కీలకమైన వేషంలో కనిపించారు. ఆ సమయంలో ఇతర స్టార్ల చిత్రాల్లో అంత ఈజీగా ఒప్పుకోని కృష్ణ కేవలం నాగ్ కు మాత్రమే సానుకూలంగా స్పందించారు. ఇదంతా 90ల నాటి మాట.
అంతకు ముందు నాగేశ్వరరావు గారితోనూ కృష్ణకు మంచి కాంబినేషన్ సినిమాలున్నాయి. హేమాహేమీలు, ఊరంతా సంక్రాంతి, మంచి కుటుంబం, అక్కాచెల్లలు ఇలా ఎన్నో హిట్లు వీళ్ళ కలయికలో వచ్చాయి. అలాంటప్పుడు నాగార్జున ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వచ్చి ఉండాల్సిందని ఫాన్సే అంటున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, డాక్టర్ రాజశేఖర్, సుమన్, శ్రీకాంత్ లాంటి ఆయన సమకాలీకులంతా వచ్చినప్పుడు కింగ్ ఒక్కరే లేకపోవడం ఎంతైనా గుర్తించబడుతుంది కదా. మళ్ళీ మహేష్ ని వ్యక్తిగతంగా కలుసుకుని ఓదార్చవచ్చు కానీ ముందు రావడానికి అప్పటికి చాలా తేడా ఉంటుంది.తిరిగి వచ్చాక ఆయన చెబితే క్లారిటీ వస్తుంది. చూద్దాం.