యావత్ సినీ పరిశ్రమ, ప్రేక్షక లోకం సూపర్ స్టార్ కృష్ణగారికి కన్నీటి వీడ్కోలు చెప్పడం నేటితో పూర్తయ్యింది. చివరి భౌతిక దర్శనం చేసుకుని సాగనంపేందుకు అభిమానులు, కుటుంబం బరువెక్కిన హృదయాలతో సిద్ధమవుతున్నాయి. సరే కాలంతో పాటు విధి పెట్టే పరీక్షలో భాగంగా జరిగే వాటిని ఎవరూ ఆపలేరు. అన్నీ యధావిధిగా కొనసాగాల్సిందే. కాస్త స్వాంతన చేకూరాలంటే మళ్ళీ ఆశ్రయించాల్సింది వినోదాన్నే. అదిచ్చేది సినిమానే. కృష్ణకు నివాళిగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలు రద్దు చేయడంతో పాటు ఇండస్ట్రీ బంద్ పాటిస్తోంది. అయితే ఓటిటి కార్యకలాపాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ వారం కొత్త రిలీజులు ఉన్నాయి.
నవంబర్ 18 ఈ శుక్రవారం కార్తీ ‘సర్దార్’ ఆహాలో రానుంది. సైలెంట్ కిల్లర్ గా తక్కువ అంచనాలతో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ ఆశించిన దానికన్నా మంచి రన్ దక్కించుకుంది. బయ్యర్లకు లాభాలు ఇచ్చింది. కార్తీ డ్యూయల్ రోల్ తో పాటు యాక్షన్ థ్రిల్లర్ ని మలచిన తీరు ఆడియన్స్ ని ఆట్టుకుంది. మరుసటి రోజు 19న నెట్ ఫ్లిక్స్ లో మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ స్ట్రీమింగ్ ఉంటుంది. కమర్షియల్ గా కంటెంట్ పరంగా ఆచార్య కంటే చాలా మెరుగ్గా పెర్ఫార్మ్ చేసిన ఈ మెగా మూవీకి వ్యూస్ భారీగా వస్తాయని సదరు డిజిటల్ సంస్థ అంచనాలో ఉంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి డిస్నీ హాట్ స్టార్ లో తెలుగులో నిర్మించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఐరావతారం’ అందుబాటులోకి వచ్చింది.
రాజ్ తరుణ్ మొదటిసారి డిజిటల్ డెబ్యూ చేస్తూ శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించిన వెబ్ సిరీస్ ‘ఆహ నా పెళ్ళంట’ రేపు మిడ్ నైట్ నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. వరస డిజాస్టర్ల తర్వాత డైలమాలో పడ్డ ఈ కుర్ర హీరో తన అదృష్టాన్ని స్మార్ట్ స్క్రీన్ పై కూడా పరీక్షించుకోనున్నాడు. ఐదుగురు గర్భవతుల నేపథ్యంలో అంజలి మీనన్ దర్శకత్వంలో రూపొందిన ‘వండర్ విమెన్’ 18న సోనీ లైవ్ లో రానుంది. ఇవి కాకుండా మరికొన్ని ఇంగ్లీష్, హిందీ సిరీస్ లు ఉన్నాయి. మొత్తానికి గత వారంలా కాకుండా ఇంటరెస్టింగ్ కంటెంట్ తో ఓటిటి ఎంటర్ టైన్ మెంట్ రెడీ అవుతోంది. థియేటర్ రిలీజుల కంటే ఇవే బలంగా కనిపిస్తుండటం ఈ వారం ట్విస్టు.