వరల్డ్ వైడ్ మార్వెల్ సినిమాలకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అందుకే వాళ్ళ నుంచి కొత్త మూవీ ఏదైనా వస్తోందంటే చాలు క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. గతంలో వచ్చిన బ్లాక్ పాంథర్ ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు. అందుకే దాని సీక్వెల్ వకండా ఫరెవర్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిన్న తెలుగు సినిమాలు రిలీజులు ఎన్ని ఉన్నా యూత్ మాత్రం దీనికే పోటెత్తారు. ఫలితంగా ఉదయం 9 గంటల నుంచే పడిన షోలకు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. పైగా మొదటి భాగం హీరో చాడ్విక్ బ్రోస్మన్ నిజ జీవితంలో చనిపోవడంతో ఎమోషనల్ గానూ ఈ సీక్వెల్ పై కనెక్షన్ ఉంది. మరి ఇంతగా ఊరించిన ఈ నల్ల వజ్రం ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.
ఇది బాహుబలిలాగే ఖచ్చితమైన కొనసాగింపు. రాజు(చాడ్విక్ బ్రోస్మన్)చనిపోయాక వకాండ రాజ్యం అనాథగా మారుతుంది. దాంతో అక్కడ దొరికే అరుదైన ఖనిజం వైబ్రేనియం పై కన్నేస్తాయి శత్రు దేశాలు. దీని కోసం దాడులకు తెగబడితే వకాండ సైన్యం వాటిని సమర్ధవంతంగా తిప్పి కొడుతుంది. వేరే ఎక్కడ దొరికే అవకాశమున్నా నమోర్(టెనాక్ హుయార్టా)అడ్డు తగులుతూ ఉంటాడు. ఈలోగా వైబ్రేనియం కోసం ఓ శాస్త్రవేత్తతో వకాండ రాణి ఒప్పందం కుదుర్చుకున్నాక షూరి(లేటిటియా రైట్)రంగ ప్రవేశం చేస్తాడు. అసలు వీళ్లందరి లక్ష్యం ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారి తీసింది, వకాండ రక్షణ కోసం చివరికి ఎవరు బ్లాంక్ పాంథర్ అయ్యారనే ప్రశ్నకు సమాధానం తెరమీద చూడాలి.
ఇది 2 గంటల 44 నిమిషాల నిడివితో సాగే విజువల్ యాక్షన్ డ్రామా. సెకండ్ హాఫ్ సాగతీత ఉన్నప్పటికీ బ్లాంక్ పాంథర్ ఫ్యాన్స్ ని పూర్తిగా సంతృప్తి పరిచేలా కథాకథనాలు సాగాయి. అయితే చార్విక్ ని నివాళి అర్పించాలన్న ఉద్దేశంతో ఇరికించిన ఎమోషనల్ సీన్లు బోర్ కొట్టేస్తాయి. కొన్ని పోరాట దృశ్యాలు థోర్ తరహాలో రొటీన్ అనిపించినా విజువల్స్ మాత్రం కట్టిపడేసేలా ఉన్నాయి. ఖచ్చితంగా త్రీడి రికమండ్ చేసే కంటెంటని చెప్పలేం కానీ మాములుగా చూసినా థ్రిల్లింగ్ అనిపించే ఎలిమెంట్స్ చాలానే పెట్టారు. పర్వాలేదనే ఫీలింగ్ కలిగిస్తుంది తప్ప మరీ ఎక్స్ ట్రాడినరి అనిపించే విషయమైతే తక్కువే. మార్వెల్, పాంథర్ అభిమానులు మాత్రం హ్యాపీగా చూడొచ్చు.