* తొలిసారి ‘లెవల్–2’ సాధించిన ఆంధ్రప్రదేశ్
* ఏపీ, కేరళతో పాటు మరో 5 రాష్ట్రాలకు లెవల్–2
* దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికీ దక్కని లెవల్–1
* 2020–21కి రాష్ట్రాల పనితీరు గ్రేడింగ్ విడుదల చేసిన కేంద్రం
* 2017 నుంచి 2019 వరకూ లెవల్ 6లో ఏపీ
* చిత్తశుద్ధితో విద్యారంగాన్ని సంస్కరిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
* ఫలితంగా నాలుగు స్థాయిలు ఎగబాకి ఏకంగా లెవల్–2కు
‘పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువే’ అని మనసా వాచా నమ్మి.. విద్యా రంగంలో ఊహించని మార్పులు తెస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి సత్ఫలితాలనిస్తోంది. విద్యా రంగంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న అగ్రశ్రేణి రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ సగర్వంగా నిలిచింది. 2019లో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టేనాటికి విద్యారంగంలో లెవల్–6లో ఉన్న ఆంధ్రప్రదేశ్.. ఆ తరువాత రెండేళ్లకే ఏకంగా లెవల్–2కు చేరుకుంది.
విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను వివిధ పథకాల్లో భాగస్వాములను చేస్తూ.. స్కూళ్ల రూపురేఖలు మార్చటం దగ్గర నుంచి విద్యార్థుల పుస్తకాలు, భోజనం, స్కూలు బ్యాగులు, షూ, యూనిఫారాలు అన్నింటా నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారిని చేయి పట్టుకుని నడిపిస్తున్న తీరు.. కేంద్ర విద్యా శాఖ తాజాగా విడుదల చేసిన పెర్‌ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో ప్రస్ఫుటమయ్యింది.
కార్పొరేట్ స్కూళ్లలో సైతం కొన్నింటికి మాత్రమే అందుబాటులో ఉన్న ఎడ్యుటెక్ విద్యను 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరికీ అందుబాటులోకి తీసుకొస్తూ, ద్విభాషా పాఠ్యపుస్తకాలను పరిచయం చేస్తూ తీసుకున్న చర్యలతో పాఠశాల విద్యలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. 2020–21 విద్యా సంవత్సరంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు విద్యారంగంలో కనబరిచిన పనితీరుకు సంబంధించిన ఈ సూచికల గ్రేడింగ్‌ను (పీజీఐ) కేంద్ర విద్యా శాఖలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం గురువారం విడుదల చేసింది.
2020–21 పెర్‌ఫార్మెన్సు గ్రేడింగ్ ఇండెక్సులో ఆంధ్రప్రదేశ్ లెవెల్–2లో నిలిచింది. లెవెల్–1ను మాత్రం ఈ విద్యా సంవత్సరంలో దేశంలోని ఏ రాష్ట్రమూ సాధించలేకపోయింది. లెవెల్–2లో మన రాష్ట్రంతో పాటు కేరళ, పంజాబ్, చండీఘడ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌లు నిలిచాయి. పెర్‌ఫార్మెన్సు గ్రేడింగ్ ఇండెక్సును వివిధ అంశాల వారీగా 1000 పాయింట్లను ప్రామాణికంగా తీసుకొని కేంద్రం ఆయా రాష్ట్రాలకు లెవెల్ స్థాయిలను ప్రకటిస్తుంటుంది.
ఇందులో 901 నుంచి 950 మధ్య పాయింట్లను సాధించిన రాష్ట్రాలు లెవెల్ 2లో నిలుస్తాయి. 2017–18, 2018–19 సంవత్సరాల్లో వరసగా లెవల్–6కు పరిమితమైన ఆంధ్రప్రదేశ్… ఇప్పుడు ఏకంగా నాలుగు స్థాయిలు మెరుగుపరుచుకుని అగ్ర రాష్ట్రాల సరసన లెవల్–2లో నిలవటం విశేషం.
విద్యారంగ ప్రమాణాల పెంపునకు వీలుగా పీజీఐ
14.9 లక్షల పాఠశాలలు, వివిధ సామాజిక, ఆర్థిక రంగాలకు చెందిన సుమారు 26.5 కోట్ల విద్యార్థులు, 95 లక్షల మందిఉపాధ్యాయులతో భారత విద్యా వ్యవస్థకు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యావ్యవస్థగా పేరుంది. విభిన్నమైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులున్న మన దేశంలో.. విద్యా రంగంలో ఉన్నతమైన ప్రమాణాలు సాధించడం, అందరికీ ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి వీలైన ప్రణాళికలను రూపొందించడం వంటి లక్ష్యాలతో కేంద్రం ఏటా ఈ పెర్‌ఫార్మెన్సు గ్రేడింగ్ ఇండెక్సులను ప్రకటిస్తోంది.
దీనికోసం ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని విద్యా రంగ పరిస్థితులను మదింపుచేసి ఈ పీజీఐ స్థాయిలను నిర్ణయిస్తోంది. 1000 పాయింట్ల పీజీఐలో.. ఆయా రాష్ట్రాలు సాధించిన అభ్యసన ఫలితాలు, పాఠశాలల అందుబాటు, పాఠశాలల్లో ప్రాధమిక సదుపాయాల కల్పన, అందరికీ సమాన విద్య అందుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని పాయింట్లను కేటాయిస్తూ.. దాని ఆధారంగా ఆయా రాష్ట్రాల లెవల్‌ను ప్రకటిస్తున్నారు.
ఏపీకి ఏయే అంశాల్లో ఎన్నెన్ని పాయింట్లు..
ఆంధ్రప్రదేశ్‌కు లెర్నింగ్ అవుట్‌కమ్, క్వాలిటీలో 180గానూ 154 పాయింట్లు , విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ రేషియో 80గానూ 77, మౌలికసదుపాయాల్లో 150గానూ 127, సమానత్వంలో 230కి గానూ 210, పాలన యాజమాన్యంలో 360కిగానూ 334 పాయింట్లు దక్కాయని కేంద్రం తెలిపింది.