iDreamPost
android-app
ios-app

విరాట్ కోహ్లీ నేర్పిన నీతి.. పాక్‌పై చారిత్రక ఇన్నింగ్స్..

విరాట్ కోహ్లీ నేర్పిన నీతి.. పాక్‌పై చారిత్రక ఇన్నింగ్స్..

వివాదాల మాట ఎట్లా ఉన్నప్పటికీ క్రికెట్ పండితులందరూ అంగీకరించే విషయం ఏమంటే ఆదివారంనాడు భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన దాయాదుల పోరు ప్రపంచ టీ-20 క్రికెట్ లో ‘నభూతో నభవిష్యతి’ అని. భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ చిరస్మరణీయమైన 82 పరుగులతో నాటౌట్ గా మిగిలి నిలిచి వెలిగిన సంగతితో పాటు అతనితో పాటు వంద పరుగుల భాగస్వామ్యం పంచుకొని నలభై పరుగులు తీసిన హార్థిక్ పాండ్యానూ, చివరి బంతి కొట్టడానికి రంగంలో దిగి పాకిస్తాన్ బౌలర్ విసిరిన వైడ్ బాల్ ను ఆడకుండా తెలివిగా వదిలేసి చివరి బంతిలో అవసరమైన ఒక పరుగు తీసి భారత్ కు విజేతగా నిలపడం ద్వారా తన మనోధైర్యాన్నీ, ఆవేశరహితమైన మనస్థిమితాన్నీ, ఆలోచనాత్మకమైన విధానాన్ని చాటుకున్న అశ్విన్ నూ ఈ సందర్భంగా క్రికెట్ ప్రియులంతా అభినందించి తీరాలి. ఒక దశలో నాలుగు వికెట్లకు 31 పరుగులు చేసిన ఇండియా గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. చివరి బంతి వరకూ ఫలితం అనూహ్యంగానే ఉంది. అదే క్రికెట్ ఆటలోని మాధుర్యం. ఎప్పుడైనా, ఏదైనా మలుపు తిరగవచ్చు. ఓడుతుందనుకున్న జట్టు గెలివవచ్చు. గెలుస్తుందనుకున్న జట్టు ఓడిపోవచ్చు. అందుకే ‘‘క్రికెట్ ఈజ్ ఏ గేమ్ ఆఫ్ అన్ సర్టెనిటీస్’’ అని అంటారు.

👉 టార్గెట్ 160 ఉ‌న్నప్పుడు 31/4 పరిస్ధితిలో ఉన్నా కూడా గెలవచ్చు అనే ఆశాభావంతో ఉండాలని తెలిసింది.

👉 టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్న టీమ్ మీద 3 ఓవర్స్ కి 48 పరుగులు కొట్టాల్సి వచ్చినప్పుడు, 130 కోట్ల ప్రజల కళ్లు మన మీద ఉంటాయని తెలిసినప్పుడు వంద ఏనుగలు మీద పడేంత ప్రెషర్ ఉన్నా కూడా మెదడును చురుకుగా, మనసుని శాంతంగా ఉంచుకోవడం తెలిసింది.

👉 కళ్లముందు టార్గెట్ కొండలా కనబడుతున్నా కూడా ఊహించని ఓ ఫుల్ టాస్ బాల్ ను సిక్స్ కొట్టి, ఆ బాల్ సిక్స్ వెళ్లకముందే అది ‘నో బాల్ ‘ అని అప్పీల్ చేసేవిధంగా మెదడు క్విక్ రియాక్షన్ ఉండాలని తెలిసింది.

👉 ఫ్రీ హిట్ బాల్ కి అవుట్ ఉండదని అందరికి తెలుసు.. కోట్లమంది గుండెలు అరచేతిలో పెట్టుకొని ఉన్న సమయంలో, లక్షమంది క్రౌడ్ గోల మధ్య ఫ్రీ హిట్ బాల్ బౌల్డ్ అయితే నాటౌటే కాదు రనౌట్ చేసేవరకు ఎన్ని రన్స్ అయినా తీయవచ్చు అనే విషయాన్ని అర సెకన్ లేట్ చేయకుండా నాన్ స్ట్రైకింగ్ లో బిత్తరపోయి ఉన్న కార్తీక్ ను అలర్ట్ చేసి మూడు రన్స్ పరిగెత్తించేంత క్రికెట్ పరిజ్ఞానం, రూల్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆటగాడికి ఉండాలని తెలిసింది.

👉 కార్తీక్ కి వేసినట్టే తనకి కూడా లెగ్ స్టెంప్ వేస్తాడని అలెర్ట్ గా ఉండాలని అశ్విన్ కి చెప్పిన విధానం చూస్తే చిట్టచివరి అడుగు వేసేటప్పుడు గ్రౌండ్ లో గడ్డిపరక కదలికని అయినా క్షుణ్ణంగా అంచనా వేయాలని తెలిసింది.

👍 ఏదేమైనా జస్ట్ 2 పాయింట్లు సాధించిన వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ కాదు 130 కోట్ల మనోభావాలకు సంబంధించిన మ్యాచ్ లో ఒళ్లు, కళ్లు, మెదడు, మనసు అన్ని ఆధీనంలో ఉంచుకుంటే లక్ష్యం నెరవేర్చుకోవచ్చని తెలిపాడు కోహ్లీ..

ఇది క్రికెట్ చరిత్రలో ఇదొక్కటే గొప్ప మ్యాచ్ కాదు.. కానీ, చరిత్రలో నిలిచిన గొప్ప మ్యాచ్ లలో ఇది కూడా ఒకటిగా ఉంటుంది..