జిమ్ చేస్తూ హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయిన శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇంకా అభిమానుల హృదయాల్లో సజీవంగానే ఉన్నారు. చివరి చిత్రం జేమ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. కంటెంట్ ఎలా ఉన్నా కమర్షియల్ లెక్కల్లో ఇది పెద్ద విజయం సాధించింది. కానీ థియేట్రికల్ రిలీజ్ కౌంట్ ప్రకారం చూసుకుంటే పునీత్ మరో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి లక్కీ మ్యాన్ ఇటీవలే విడుదలయ్యింది. ఇది ఓ మై కడవులే(తెలుగు ఓరి దేవుడా)కు రీమేక్. పెద్దగా ఆడలేదు కానీ సింపతీ మీద మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. రేపు గంధద గుడి రాబోతోంది. వెండితెరపై అతను కనిపించే చిట్టచివరి స్క్రీన్ ప్రెజెన్స్ ఇదే అవుతుంది.
ఈ గంధదగుడికి పెద్ద హిస్టరీనే ఉంది. 1973లో స్వర్గీయ డాక్టర్ రాజ్ కుమార్ ఈ టైటిల్ తో భారీ చిత్రమొకటి చేశారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం. పాత రికార్డులన్నీ దుమ్ము దులిపి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అంత భారీ ఎత్తున తీయడం గురించి మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. దీని ఇన్స్ పిరేషన్ తోనే దర్శకేంద్రులు రాఘవేంద్రరావు ఎన్టీఆర్ తో అడవి రాముడు తీశారు. తారకరాముడు కొత్త ఇన్నింగ్స్ కి బలమైన పునాది వేసిన మూవీ ఇది. 1995లో శివ రాజ్ కుమార్ దీనికి సీక్వెల్ చేశారు. గందద గుడి 2 బాగానే ఆడింది. ఆ తర్వాత మళ్ళీ ఎవరూ ఆ పేరు జోలికి వెళ్ళలేదు. దునియా విజయ్ మాస్తి గుడి చేశారు కానీ అది వేరే.
తిరిగి ఇన్నేళ్ల తర్వాత గంధదగుడితో పునీత్ థియేటర్లలో అడుగు పెడుతున్నారు. ఇదో ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమా. రెగ్యులర్ కంటెంట్ కానీ పాటలు, కామెడీ లాంటివేవీ ఉండవు. ఒకరకంగా చెప్పాలంటే ఇది అతని డ్రీం ప్రాజెక్టు. నాన్న క్లాసిక్ టైటిల్ తో ఎప్పటికి మిగిలిపోయే ఒక గొప్ప మాస్టర్ పీస్ ని ఇవ్వాలనే ఉద్దేశంతో గంధద గుడికి శ్రీకారం చుట్టారు. తీరా దాన్ని చూసుకోకుండానే ఈ లోకం వదిలి వెళ్లారు. ఇవాళ ముందే వేస్తున్న ప్రీమియర్ల టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి. నటుడిగా కంటే ఎక్కువ మంచి మానవతావాదిగా పేరు తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ ని ఇంకోక్కసారి చూసేందుకు మూవీ లవర్స్ సిద్ధపడుతున్నారు.