iDreamPost
android-app
ios-app

కార్తీ షారుఖ్ కథలు ఒకటేనా..

కార్తీ షారుఖ్ కథలు ఒకటేనా..

రేపు విడుదల కాబోతున్న కార్తీ సర్దార్, వచ్చే ఏడాది రానున్న షారుఖ్ ఖాన్ జవాన్ కథలు ఒకటేననే ప్రచారం కోలీవుడ్ లో జోరుగా జరుగుతోంది. రెండు సినిమాల్లో హీరో పాత్ర స్పై(గూఢచారి)కావడమే ఈ గాసిప్ కి ప్రధాన కారణం. అంతే కాదు ఎప్పుడో తప్పిపోయిన తండ్రి కోసం అదే వృత్తిని ఎంచుకున్న కొడుకు సాగించే అన్వేషణే ఈ స్టోరీ అని అందుకే దగ్గరి పోలికలు ఉంటాయని సోషల్ మీడియాలో చాలా ట్విట్లు వచ్చాయి. అయితే ఇది వాస్తవం కాదట. సదరు చిత్రాలకు ఎడిటర్ గా పని చేసిన రూబెన్ దీని గురించి క్లారిటీ ఇస్తూ రజనీకాంత్ విజయ్ కాంత్ ఎలా అన్నదమ్ములు కాదో ఇది కూడా అలాంటి అభూతకల్పనే తప్ప మరొకటి కాదని తేల్చేశారు.

ఇందులో నిజమెంతనేది రెండూ చూశాకే అర్థమవుతుంది కానీ అప్పటిదాకా వేచి చూడక తప్పదు. విశాల్ అభిమన్యుడు తీసిన పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన సర్దార్ ప్రమోషన్లు గట్టిగానే చేస్తున్నారు. నాగార్జున ముఖ్య అతిధిగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. కార్తీ ప్రత్యేకంగా తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. బజ్ ఏమంత ఆశించిన స్థాయిలో లేకపోయినా మౌత్ టాక్, రివ్యూలతోనే పికప్ అవ్వాల్సి ఉంటుంది. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన సర్దార్ లో కార్తీ చాలా షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ పోషించాడు. ఇటీవలే విక్రమ్ ఇదే తరహాలో చేసిన కోబ్రా బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితం అందుకున్న నేపథ్యంలో సర్దార్ ఎలాంటి రిజల్ట్ దక్కించుకుంటాడో చూడాలి.

ఇక జవాన్ విషయానికి వస్తే విజయ్ తో వరసగా పోలీసోడు, అదిరింది, విజిల్ చేసిన దర్శకుడు ఆట్లీ దీన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా విజయ్ సేతుపతి విలన్ గా చాలా ఆకర్షణలు జోడించారు. మొదటిసారి అనిరుద్ రవిచందర్ బాద్షాకు మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. ఓ సౌత్ డైరెక్టర్ కు షారుఖ్ అవకాశం ఇవ్వడం ఇదే మొదటిసారి. జీరో తర్వాత ఏకంగా మూడేళ్ళ గ్యాప్ తీసుకుని వెండితెరకు దూరంగా ఉన్న కింగ్ ఖాన్ జనవరిలో రాబోయే పఠాన్, వేసవిలో రిలీజయ్యే ఈ జవాన్ రెండూ బలమైన కంబ్యాక్ ఇస్తాయనే నమ్మకంతో ఉన్నాడు. కథలో కొత్తదనం లేకపోయినా కమర్షియల్ మేజిక్ చేసే ఆట్లీ ఈసారి ఏం చేయనున్నాడో..