iDreamPost
android-app
ios-app

కాంతార దర్శకుడిది పెద్ద కథే..!

కాంతార దర్శకుడిది పెద్ద కథే..!

కన్నడ నేటివిటీకి సంబంధించిన సినిమా తెలుగులో భారీ వసూళ్లు రాబట్టడం ఒక్క కాంతార విషయంలోనే జరిగింది. కర్ణాటక సంప్రదాయాలు, ఆచారాలను కమర్షియల్ ఫార్మట్ లో చెప్పిన తీరుకి మన ఆడియన్స్ భారీ వసూళ్లు ఇచ్చారు. దీన్ని పంపిణి చేసిన అల్లు అరవింద్ దర్శకుడు కం హీరో రిషబ్ శెట్టికి పబ్లిక్ గా ఓపెన్ ఆఫర్ ఇవ్వడం విశేషం. ఇంతకీ ఈ రిషబ్ ఎవరూ ఇంతకు ముందు ఎలాంటివి తీశాడని ఆసక్తి కలగడం సహజం. అవేంటో చూద్దాం. 2010లో ఇతను ఇండస్ట్రీకి వచ్చాడు. ఫిలిం డైరెక్షన్ లో డిప్లొమా చేశాక ఏఎంఆర్ రమేష్ దగ్గర సైనెడ్ మూవీ కోసం అసిస్టెంట్ గా చేరాడు. ఆ తర్వాత ఒక టీవీ సిరీస్ కి సహాయకుడిగా ఉన్నాడు.

నం ఏరియానల్లి ఒందు దినతో రిషబ్ యాక్టింగ్ డెబ్యూ జరిగింది. తుగ్లక్ తో కొంత గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అట్టహాస, లూసియా, ఉలిదవరు కాందంటేలు సక్సెస్ ఫుల్ అయ్యాయి. డైరెక్టర్ గా తొలి అవకాశం 2016లో రికీతో దక్కింది. టెక్నికల్ గా ఇది మంచి పేరు తీసుకొచ్చింది. అదే ఏడాది కిరిక్ పార్టీ రిషబ్ శెట్టికి దర్శకుడిగా అతి పెద్ద బ్రేక్. రష్మిక మందన్న, రక్షిత్ శెట్టిలకు ఓవర్ నైట్ స్టార్ డం ఇచ్చిన ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇది. తెలుగులో నిఖిల్ తో వేరే డైరెక్టర్ తో రీమేక్ చేశారు కానీ ఫ్లాప్ అయ్యింది. కిరిక్ పార్టీ ఆ టైంలో యూత్ ని ఓ రేంజ్ లో ఊపేసింది. 2018లో సీనియర్ నటులు అనంత్ నాగ్ తో సాహిప్రాషాలే కాసరగోడు తీస్తే ఏకంగా 20 కోట్లు వసూలు చేసింది. దీనికి రిషబ్ శెట్టికి జాతీయ అవార్డు వచ్చింది.

ఇవి చేస్తూనే ఆర్టిస్టుగానూ రిషబ్ శెట్టి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కెజిఎఫ్ నిర్మాణంలో ఉన్న టైంలో కాంతార సబ్జెక్టుతో హోంబాలే నిర్మాతను కలుసుకోవడం, మంచి బడ్జెట్ తో రూపొందించడం, అది గొప్ప విజయం సాధించడం చూస్తున్నాం. నటుడిగా తన టాలెంట్ ని బెల్ బాటమ్ లో చూడొచ్చు. ఇప్పుడు రిషబ్ శెట్టి తర్వాత చేయబోయే రుద్రప్రయాగ్ కూడా చాలా విభిన్నమైన నేపథ్యంలో రూపొందబోతోంది. నిర్మాతగానూ ఇటీవలే శివమ్మ లాంటి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఒక పక్క హీరోగా చేస్తూనే విలక్షణమైన కథలతో దర్శకుడిగానూ గుర్తింపు తెచ్చుకోవడం అరుదు. రిషబ్ శెట్టి ఈ రెండింట్లోనూ అద్భుత విజయాలు సొంతం చేసుకున్నాడు.