ఈ నెల దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన సినిమాల్లో విన్నర్ గాడ్ ఫాదరే అయినప్పటికీ స్వాతిముత్యంకు కూడా పాజిటివ్ టాకే వచ్చింది. అయితే సీనియర్ అగ్ర హీరోల మధ్య పోటీ తట్టుకోలేక దాన్ని సానుకూలంగా మార్చుకోలేకపోయింది. కట్ చేస్తే ఇప్పుడీ మూవీ ఎల్లుండి అంటే 24న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సరిగ్గా ఇరవై రోజులు పూర్తి కావడం ఆలస్యం స్మార్ట్ స్క్రీన్ పై ప్రత్యక్షం అన్నమాట. నాగార్జున భారీ బడ్జెట్ చిత్రం ది ఘోస్ట్ నవంబర్ 2 నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి తేనున్నారు. దీనికిచ్చిన గ్యాప్ పట్టుమని నెల కూడా లేదు. డిజాస్టర్ కావడం వల్ల ఇలా నిర్ణయం తీసుకున్నారా లేక ముందే ఇచ్చేశారా తెలియదు.
ఇవే కాదు ఈ మధ్యకాలంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, దొంగలున్నారు జాగ్రత్త, అల్లూరి, శాకినీ డాకిని, ఫస్ట్ డే ఫస్ట్ షో, రంగ రంగ వైభవంగా ఇవన్నీ పట్టుమని నాలుగు వారాలు దాటకుండానే డిజిటల్ లోకి వచ్చేశాయి. ఫ్లాపులే కావొచ్చు కానీ ఇంత తక్కువ నిడివి పెట్టుకోవడం వల్ల థియేటర్ రెవిన్యూ మీద ప్రభావం పడుతుందన్న డిస్ట్రిబ్యూటర్ల వాదన గురించి ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు.ఆ మధ్య నిర్మాతలు షూటింగులు బంద్ చేసి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఓటిటి రిలీజ్ కనీసం ఎనిమిది వారాల తర్వాతే ఉండాలని నిబంధన పెట్టుకున్నారు. తీరా చూస్తే అదేమీ అమలవుతున్న సూచనలు కనిపించడం లేదు
సరే ఇవన్నీ ముందస్తుగా చేసుకున్నఅగ్రిమెంట్లు అనుకుంటే ఇకపై వచ్చే వాటికి ఎంతమేరకు కఠినంగా ఉంటారనేది అనుమానమే. ఎందుకంటే మరీ రెండు నెలల గ్యాప్ అంటే ఓటిటిలు తామిచ్చే రేట్లను విపరీతంగా తగ్గించేస్తారు. దానివల్ల కలిగే నష్టం నిర్మాతకే తప్ప ఇంకెవరికీ ఉండదు. థియేటర్లలో ఆడని వాటిని అట్టిపెట్టుకోవడం వల్ల వచ్చే లాభం లేదు కాబట్టి కండీషన్లను సవరించి ఫలితం వచ్చాక ప్రొడ్యూసర్ల ఇష్టానికే వదిలేసేలా ఆప్షన్ ఇస్తే బెటర్ గా ఉండొచ్చు. ఈ విషయంలో జీ5 తీసుకున్న నిర్ణయాలు భేష్ అని చెప్పొచ్చు. కార్తికేయ 2ని యాభై రోజుల తర్వాత బింబిసారని డెబ్భై అయిదు రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసింది. ఇంటర్నేషనల్ యాప్స్ అలా చేసే ఛాన్స్ ఉంటుందంటారా