iDreamPost
android-app
ios-app

కష్టపడి చదివి NEET లో సత్తాచాటిన కూలి!

  • Published Nov 22, 2024 | 5:44 PM Updated Updated Nov 22, 2024 | 5:44 PM

NEET: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ పేదవాడు. రోజూ కూలి పనులు చేస్తూనే నీట్ పరీక్షలో విజయం సాధించాడు.

NEET: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ పేదవాడు. రోజూ కూలి పనులు చేస్తూనే నీట్ పరీక్షలో విజయం సాధించాడు.

కష్టపడి చదివి NEET లో సత్తాచాటిన కూలి!

అతనో కూలి. ఏ రోజుకారోజు కూలిపనులకు వెళ్తేగానీ కడుపు నిండని కుటుంబంలో పుట్టిన పేదవాడు. పేద వాడి తల రాతని మార్చేది కేవలం చదువే అని గ్రహించాడు. చదువుపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. అందరిలా పెద్ద చదువులు చదవాలని గొప్ప కలలు కన్నాడు. కలలు కనాలి వాటిని నిజం చేసుకోవాలి అన్న అబ్దుల్ కలాం మాటలని దృష్టిలో పెట్టుకున్నాడు. వాటిని సాకారం చేసుకోవడానికి ఎంతో శ్రమించాడు. రోజూ కూలి పనులకు వెళ్తూనే తీరిక సమయాల్లో కష్టపడి చదివాడు. అలా తనకు ఇష్టమైన చదువుని కష్టపడి చదివి దేశంలోకెల్లా అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటైన NEET లో సత్తా చాటాడు. ప్రస్తుతం తన లాంటి లక్షలాది పేదవారికి ఆదర్శంగా నిలిచాడు. ఇక ఈ యోధుడి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వెస్ట్ బెంగాల్‌కు చెందిన 21 ఏళ్ల రోజువారీ కూలీ సర్ఫరాజ్, రోజుకు కేవలం రూ. 300 సంపాదిస్తూ, నీట్ 2024 పరీక్షలో 720కి 677 స్కోర్‌ను సాధించాడు. గత రెండేళ్ళుగా, సర్ఫరాజ్ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, డాక్టర్ కావాలనే తన కలను కొనసాగిస్తూ ఇటుక రాయి పనిని చేస్తున్నాడు. ప్రతి రోజూ పనిలో 200-400 ఇటుకలను మోసుకెళ్ళి, కఠినమైన శారీరక శ్రమను చేస్తున్నాడు. ఆర్థిక కష్టాలు, సామాజిక హేళనలకు ఏమాత్రం లొంగకుండా సర్ఫరాజ్ కష్టపడి చదువుకున్నాడు. పొద్దున్నే 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కష్టపడి పని చేసి మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా చదువుకునేవాడు. చదువుకుంటూ సర్ఫరాజ్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. పగిలిన స్క్రీన్‌ ఫోన్‌ నే తన బడిగా వాడుకున్నాడు. ఆ ఫోన్ ద్వారానే చదువుకున్నాడు. యూట్యూబ్ లో అలఖ్ పాండే NEET వీడియోలు చూస్తూ ప్రిపేర్ అయ్యాడు. సరైన పైకప్పు లేని తన ఇంట్లోనే చదువుకున్నాడు. అతని ప్రయాణంలో అతని తల్లి ఎంతో కీలకమైన పాత్రను పోషించింది. తన బిడ్డ కష్టాన్ని చూసి రాత్రిపూట నిద్రపోకుండా మేలుకొని ఉండేది. తన బిడ్డ అవసరాలను తీర్చేది.

NEET 2024లో ఉత్తీర్ణత సాధించిన సర్ఫరాజ్ కోల్‌కతాలోని నిల్ రతన్ సిర్కార్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందాడు. అతని సంకల్పం, అపార కృషికి అలఖ్ పాండే ఫిదా అయ్యాడు. సర్ఫరాజ్ కి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. అతని ఇంటికి వెళ్ళి కలిశాడు. సర్ఫరాజ్ కాలేజీ ఫీజు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. అతనికి కొత్త స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇంకా అతని చదువు కోసం 5 లక్షల అప్పుగా ఇచ్చాడు. ఇలా కష్టాలు వేధిస్తున్నా కూడా క్రుంగి పోకుండా కష్టపడి చదివి NEET క్లియర్ చేశాడు సర్ఫరాజ్. ఇక NEET ని క్లియర్ చేసిన ఈ 21 ఏళ్ల కూలి గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.