Dharani
Dharani
ఈ ఏడాది పండుగల విషయంలో కొన్ని సందేహాలు పుట్టుకొస్తున్నాయి. తెలుగు క్యాలెండర్ ప్రకారం పండుగలు జరుపుకుంటూ ఉంటాం. ఈ క్రమంలో కొన్ని తిథులు రెండు రోజుల మధ్య కొనసాగుతుండటంతో.. పండగలు చేసుకునే అంశంలో అనేక అనుమానాలు తెలత్తుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే రాఖీ పండుగ సందర్భంగా ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఇక తాజాగా రానున్న వినాయక చవితి పండుగ విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 18, 19వ తేదీలలో వినాయక చవితి వచ్చింది. దీంతో కొందరు సెప్టెంబర్ 18 సోమవారం నాడు వినాయక చవితి జరుపుకోవాలని.. మరికొందరు సెప్టెంబర్ 19వ తేదీ మంగళవారం జరుపుకోవాలని చెబుతున్నారు. పండగ విషయంలో మరోసారి అందరిలోనూ సందిగ్ధత నెలకొంది. పైగా స్కూళ్లు, కాలేజీలకు ఏ రోజు సెలవు ప్రకటించారు అనే దాని మీద కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే.. సెప్టెంబర్ 18,19 రెండు రోజులు వినాయక చవితి అని ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం.. 2023 పోర్టల్ క్యాలెండర్‌లో గణేష్ చతుర్థికి సెప్టెంబర్ 18 సెలవుగా ప్రకటించింది. ఈ సెలవును ‘సాధారణ సెలవులు’ కేటగిరీ కింద ప్రకటించారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 28న జరిగే గణేష్ నిమజ్జనంతో పండుగ ముగుస్తుంది. మరి రెండు రోజులు పండగ అంటున్నారు కాబట్టి.. ప్రభుత్వాలు సెలవు తేదీని మారుస్తాయేమో చూడాలి. దీని మీద అధికారిక ప్రటకన వెలువడిన తర్వాతే ఓ స్పష్టత వస్తుంది.
కాణిపాకం, తిరుమల పండితులతో పాటు ఇతర పూజారులు కూడా ఇప్పటికే పలు వేదికల మీదుగా.. వినాయక చవితి పండుగ తేదీపై స్పష్టత ఇచ్చారు. ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 12:39 గంటల వరకు తదియ తిథి ఉంటుందని.. ఆ తర్వాత నుంచి చతుర్థి తిథి ప్రారంభమై.. మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 19 రాత్రి 8:43 గంటలకు ముగియనుంది అని తెలిపారు. ఉదయం తిథి ప్రకారం అయితే.. గణేష్ చతుర్థి పండుగను సెప్టెంబర్ 19వ తేదీనే జరుపుకోవాల్సి ఉంటుంది.
అయితే కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దేవస్థానం మాత్రం సెప్టెంబర్ 18వ తేదీనే వినాయక చవితి అని స్పష్టం చేసింది. అలాగే.. భాగ్యనగర కమిటీ కూడా సెప్టెంబర్ 18వ తేదీనే వినాయక చవితి నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో.. హైదరాబాద్‌లో కూడా సెప్టెంబర్ 18నే వినాయక చవితి పండుగ జరుపుకోనున్నారు.