iDreamPost
android-app
ios-app

కనకదుర్గ అమ్మవారికి ఏ అలంకారానికి ఏ ఆభరణమో తెలుసా?

  • Published Oct 03, 2024 | 3:32 PM Updated Updated Oct 03, 2024 | 3:32 PM

Devi Navaratri Avatars 2024: తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగ విజయదశమి. దసరా సందర్భంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దేవీ నవరాత్రి సందర్బంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది.

Devi Navaratri Avatars 2024: తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగ విజయదశమి. దసరా సందర్భంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దేవీ నవరాత్రి సందర్బంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది.

కనకదుర్గ అమ్మవారికి ఏ అలంకారానికి ఏ ఆభరణమో తెలుసా?

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ. ముల్లోకాలకు మూలమైన లక్ష్మీ, సరస్వతి, పార్వతులకే మూలమైన మహాశక్తి దుర్గమ్మ. అమ్మవారిని ప్రార్థిస్తే.. కీర్తి ప్రతిష్టలు,అష్టైశ్వర్యాలు, సంతాన ప్రాప్తి, జ్ఞానం ఇలా ఒకటేమిటి కోరిన కోరికలు తీర్చే కల్పతల్లి.. జగజ్జనని చల్లని తల్లి. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులలో దుర్గా దేవిని దర్శించుకొని పూజిస్తే.. ఐహిక సుఖాలతో పాటు మోక్షం పొందవొచ్చని పండితులు చెబుతున్నారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శరన్నరాత్రుల్లో భాగంగా గురువారం నుంచి ఇంద్రకిలాద్రిపై కొలువైన జగన్మాత బాలా త్రిపుర సుందరిగా సాక్షాత్కరిస్తుంది.ఈ ఉత్సవాల్లో దుర్గమ్మ అలంకారాలు కూడా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అవి ఏంటో చూద్దాం..

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన ఉన్న కనకదుర్గమ్మకు నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తుంటారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తలు తరలి వస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా.. కొంగు బంగారంగా బెజవాడ కనకదుర్గగా వాసికెక్కింది. శరన్నవరాత్రుల్లో దుర్గమ్మను దర్శించుకుంటే జీవితం తరిస్తుందని భక్తులు నమ్ముతారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంగా అలంకరిస్తారు. ఇందుకోసం భక్తులు తీసుకు వచ్చే కానుకలతో పాటు సంప్రదాయంగా వస్తున్న వాటిని కనకదుర్గమ్మకు అలంకరిస్తుంటారు. ఆ అలంకారాల్లో ఏ ఆభరణాలు ఏ ఏ రూపాలకు ధరిస్తారో అనే ఆసక్తి భక్తులకు ఉంటుంది.. వాటి వివరాలు తెలుసుకుందాం.

బాలా త్రిపుర సుందరి రూపం:
శరన్నవరాత్రుల్లో మొదటి రోజు కనకదుర్గమ్మ అమ్మవారు బాలా త్రిపుర సందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఆ సమయంలో బంగారు పూలజడ, కంఠాభరణాలు, అభయ హస్తాలు, బంగారం వడ్డాణం అలంకరిస్తారు.

గాయత్రీ దేవి రూపం:
దసరా నవరాత్రుల్లో రెండో రోజు శ్రీ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది అమ్మవారు. ఆ సమయంలో బంగారు ఆభయ హస్తాలు, కంఠాభరణాలు, స్వర్ణ పంచ ముఖాలు, పచ్చల హారంతో అలంకరిస్తారు.

అన్నపూర్ణాదేవి అవతారం:
నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ సమయంలో అమ్మవారు స్వర్ణ పాత్ర, హస్తాలు, బంగారు త్రిశూలంతో అలంకరిస్తారు.

లలితా త్రిపుర సుందరీదేవి అవతారం:
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు శ్రీ లలితా త్రిపుర సందరీదేవీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఆ సమయంలో అమ్మవారికి ముదురు రంగు బంగారు వస్త్రంతో పాటు స్వర్ణ కిరీటం, కంఠాభరణాలు, స్వర్ణాభరాణాలు, అభయ హస్తాలతో అలంకరిస్తారు.

మహాచండీ దేవి అవతారం:
దసరా పండుగ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శ్రీ మహాచండీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. లోక కంటకులైన రాక్షసులను సంహరించడానికి అమ్మవారి మహాచండీ అవతారం ఎత్తారు. ఈ సందర్బంగా సింహవాహనం, ఖడ్గం, కర్ణాభరణాలు, కంఠాభరణాలు, హస్తాలు అలంకరిస్తారు.

మహాలక్ష్మీదేవి అవతారం:
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో కనిపిస్తారు. ఈ సందర్బంగా గజరాజు, అభయ హస్తాలు, వడ్డాణం, కర్ణాభరణాలు, ధనరాజులు, కంఠాభరణాలు అలంకరిస్తారు.

సరస్వతి దేవి అవతారం :
దసరా పండుగ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శ్రీ సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ సందర్భంగా అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పిస్తారు. పగడాల హారం, బంగారు వీణ, స్వర్ణ హస్తాలు, వడ్డాణంతో అలంకరిస్తారు.

దుర్గా దేవి అవతారం :
ఎనిమిదవ రోజు దుర్గాష్టమి పర్వదినం.ఈ  రోజున దుర్గా దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్బంగా అమ్మవారికి ఎర్రని వస్త్రం సమర్పిస్తారు. ఈ రోజు అమ్మవారికి సూర్యచంద్రులు, శార్ధూల వాహనం, బంగారు త్రిశూలం, శంకు చక్రాలతో అలంకరిస్తారు.

మహిషాసుర మర్ధినిదేవి అవతారం :
తొమ్మిదవ రోజు మహార్నవమి పర్వదినం. ఆ రోజే మహిషుడనే రాక్షసుడిని సంహరించిన అమ్మవారు మమిషాసుర మర్ధినిగా దర్శమిస్తారు. ఈ సందర్బంగా సింహా వాహనం, బంగారు త్రిశూలం, కంఠాభరణాలు, స్వర్ణ ఖడ్గం, కర్ణాభరణాలు తో అలంకరిస్తారు.

రాజ రాజేశ్వరి దేవి అవతారం :
శరన్నవరాత్రులలో ఆశ్వీయుజ శుద్ధ దశమి (విజయ దశమి) రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. నవరాత్రుల్లో ఈ రోజే ఆఖరి రోజు. ఈ సందర్భంగా స్వర్ణాభరణాలు, అభయ హస్తాలు, చెరకుగడతో అలంకరిస్తారు. బంగారు పూలజడ, కాసుల పేరు, దేవీ పాదాలు అలంకరిస్తారు.  చూశారు కదా? దసరా సందర్భంగా అమ్మవారికి అలంకరించే ఆభరణాలు ఇవే