nagidream
సూర్యుడు లేనిదే సృష్టి లేదు. సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటికీ మూలం ఆ సూర్య భగవానుడు. అటువంటి సూర్యభగవానుడిని ప్రత్యేకించి ఆరాధించే రోజు ఈ రథసప్తమి. మరి రథసప్తమి విశిష్టత ఏంటి? ఈరోజు ఆచరించవలసిన నియమాలు ఏంటి?
సూర్యుడు లేనిదే సృష్టి లేదు. సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటికీ మూలం ఆ సూర్య భగవానుడు. అటువంటి సూర్యభగవానుడిని ప్రత్యేకించి ఆరాధించే రోజు ఈ రథసప్తమి. మరి రథసప్తమి విశిష్టత ఏంటి? ఈరోజు ఆచరించవలసిన నియమాలు ఏంటి?
nagidream
హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి 16న అనగా శుక్రవారం వచ్చింది. కశ్యప మహాముని కుమారుడైన సూర్యభగవానుడి జన్మించిన రోజే ఈ రథ సప్తమి. ఆయన కరుణ కటాక్షాల కోసం రథసప్తమి వేడుకను జరుపుకుంటారు. మిగతా నెలల్లో ఉన్న సప్తమి కంటే ఈ నెలలో వచ్చే రథసప్తమికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పర్వదినాన స్నానం, జపం, అర్ఘ్య ప్రదానం, తర్పణం, దానాలు వంటివి చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆయురారోగ్యాలతో, సంపదలతో సంతోషంగా ఉంటారని అంటున్నారు.
సప్తమి రోజున షష్టి తిథి ఉంటే కనుక షష్టి సప్తమి తిథులను పద్మము అని అంటారు. ఈ పద్మము సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం. ఆ సమయంలో జిల్లేడు ఆకులను తల మీద పెట్టుకుని, రెండు భుజాలపైన రేగు పండ్లు పెట్టుకుని స్నానం చేస్తే ఏడు జన్మల పాపం తొలగిపోతుందని చెబుతున్నారు. రేగి పండుని సూర్యభగవానుడికి ప్రతీకగా భావిస్తారు. ఇక జిల్లేడు ఆకుని అర్క పత్రం అని అంటారు. సూర్యుడికి అర్కః అనే పేరు కూడా ఉంది. సూర్యుడికి ఈ జిల్లేడు ఆకులంటే ఇష్టం.
ఈ ఏడు జిల్లేడు ఆకులు సూర్యభగవానుడి రథానికి ఉండే ఏడు గుర్రాలకు చిహ్నం. అంతేకాదు ఏడు జన్మల్లో చేసిన పాపాలను.. ఏడు రకాల వ్యాధులను నశింపజేస్తాయని నమ్ముతారు. రథసప్తమి నాడు బంగారంతో గానీ వెండితో గానీ లేదా రాగితో గానీ రథమును చేయించాలి. కుంకుమాదులు, దీపముతో రథాన్ని అలంకరించి అందులో ఎర్రని రంగు కలిగిన సూర్యుని ప్రతిమను ఉంచి పూజలు చేయాలి. అనంతరం ఆ రథాన్ని గురువుకి దానం ఇవ్వాలి. సూర్యభగవానుడి అనుగ్రహం పొందాలంటే.. సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి.
సూర్యుడు దిక్కుగా ముగ్గు వేయాలి. ఉదయం 8 గంటల లోపు వాకిట్లో పొయ్యి పెట్టి కొత్త బెల్లం, కొత్త బియ్యం, చెరకు, ఆవు పాలతో పాయసం చేసి చిక్కుడు ఆకులపై ఉంచి సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టాలి. అనంతరం ఆ ప్రసాదాన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నమ్ముతారు. రథసప్తమి నాడు నదులు, చెరువుల్లో తలపై దీపం పెట్టి ఆ దీపాన్ని నీటిలో వదిలేస్తే మరుజన్మ ఉండదని నమ్ముతారు. రథసప్తమి నాడు దానాలు చేస్తే మంచిది. అయితే సూర్యోదయం తర్వాతే చేయాలి. ఈ రథసప్తమి నాడు మీకు, మీ కుటుంబానికి శుభం చేకూరాలని కోరుకుంటూ రథసప్తమి శుభాకాంక్షలు.