iDreamPost
android-app
ios-app

Ratha Saptami 2024: రథసప్తమి నాడు జిల్లేడు ఆకులతో స్నానం.. శాస్త్రీయ కారణం!

  • Published Feb 15, 2024 | 8:12 PM Updated Updated Feb 15, 2024 | 8:12 PM

రథ సప్తమి రోజున జిల్లేడు ఆకులను తలపై పెట్టుకొని.. రేగి పండ్లను భుజాల మీద పెట్టుకుని స్నానం చేయాలని చెబుతారు. అయితే ఇలా ఎందుకు చేయాలి. అసలు జిల్లేడు ఆకులకు, రథసప్తమికి ఉన్న సంబంధం ఏమిటి? దీని వెనుక ఆధ్యాత్మిక కారణంతో పాటు శాస్త్రీయ కారణం ఏదైనా ఉందా?

రథ సప్తమి రోజున జిల్లేడు ఆకులను తలపై పెట్టుకొని.. రేగి పండ్లను భుజాల మీద పెట్టుకుని స్నానం చేయాలని చెబుతారు. అయితే ఇలా ఎందుకు చేయాలి. అసలు జిల్లేడు ఆకులకు, రథసప్తమికి ఉన్న సంబంధం ఏమిటి? దీని వెనుక ఆధ్యాత్మిక కారణంతో పాటు శాస్త్రీయ కారణం ఏదైనా ఉందా?

Ratha Saptami 2024: రథసప్తమి నాడు జిల్లేడు ఆకులతో స్నానం.. శాస్త్రీయ కారణం!

సూర్యారాధనకు సంబంధించి అనేక విషయాలు వేదాలు, పురాణాలు, ఇతిహాసాల్లో చెప్పబడింది. రాముడు, రావణుడ్ని సంహరించే ముందు సూర్యోపాసన చేసినట్లు రామాయణంలో చెప్పబడింది. అగస్త్యముని చెప్పిన ‘ఆదిత్య హృదయం’ స్తోత్రాన్ని రాముడు ఉపాసించాడు. ఇక మహాభారతంలో కూడా సూర్యారాధన గురించి చెప్పబడింది. తన వెంట అడవికి వచ్చిన వేలాది మంది సైనికులకు ఆహారాన్ని సమకూర్చడానికి ధర్మరాజు సూర్యోపాసన చేసి అక్షయపాత్రను పొందాడని మహాభారతం చెబుతుంది. అటువంటి సూర్యభగవానుడిని మహా విష్ణువు అవతారమైన ఆ రాముడే ఆరాధించాడంటే దాని వల్ల ఎంత ఫలితం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

భూమిపై ఉండే జీవరాశులకు, వాటి మనుగడకు ఈ సూర్యుడే కారణం. అందుకే సూర్యుడిని కనిపించే దైవంగా ఆరాధిస్తారు. సూర్యుడు లేకపోతే సృష్టి లేదు. పంటలు పండాలంటే సూర్యరశ్మి కావాలి. అందుకే సూర్యభగవానుడిని అన్నదాత అని అంటారు. ఆరోగ్యపరంగా కూడా సూర్యరశ్మి మనిషికి ఎంతో అవసరం. సూర్య కిరణాల ద్వారా విటమిన్ డి అందుతుంది. విటమిన్ డి ఎంత అవసరమో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. వైద్యులు సైతం విటమిన్ డి కోసం సూర్యనమస్కారాలు చేయమని చెబుతున్నారు. ఉదయాన్నే ఎండలో నిలబడితే శరీరానికి కావాల్సినంత డి విటమిన్ అందుతుంది. పుట్టిన పిల్లలను కూడా విటమిన్ డి లోపించకుండా ఉండడం కోసం సూర్యుడికి ఎదురుగా ఉంచమని చెబుతారు.

అన్నదాత, ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యభగవానుడిని ఈ రథ సప్తమి నాడు ప్రత్యేకించి పూజిస్తారు. జీవరాశులకు ఉపయోగపడే ప్రకృతిని ఆరాధించడం అనేది సనాతన ధర్మంలో ఉన్న గొప్ప లక్షణం. సమస్త జీవరాశికి ఉపయోగపడే ప్రకృతి వనరులకు కృతజ్ఞతగా ఆరాధించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. అందులో సూర్యుడ్ని ప్రధానంగా ఆరాధిస్తారు. రోజు మొదలయ్యేదే ఆ సూర్య భగవానుడితో. ఆయన జన్మించిన రోజునే రథసప్తమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి 16న వచ్చింది. అయితే ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేస్తారు. అయితే దీనికి శాస్త్రీయ కారణం ఉంది.

జిల్లేడు ఆకులకు సూర్యశక్తిని అత్యధికంగా గ్రహించే శక్తి ఉంది. ఈ జిల్లేడు ఆకులను అర్కపత్రాలు అని అంటారు. అర్క చెట్లకు ఉండే పత్రాలను అర్క పత్రాలు అని అంటారు. సూర్యుడిని అర్కః అని అంటారు. సూర్యశక్తిని అధికంగా గ్రహించే శక్తి ఈ అర్కపత్రాలకు ఉంది కాబట్టి వీటికి మన పూర్వీకులు ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. ఈ ఆకులను తలపై, శరీరంపై పెట్టుకుని స్నానం చేయడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. శరీరంలో ట్యాక్సిన్ ని ఈ జిల్లేడు ఆకులు లాగేసుకుంటాయి. పూర్వం పుండ్లు, గాయాలను నయం చేయడానికి ఈ అర్క చెట్ల నుంచి వచ్చే పాలను ఉపయోగించేవారు. ఆ పాలతో నల్లని జిగురు పదార్ధాన్ని తయారు చేసి దాన్ని ఒక గుడ్డ మీద వేసి పుండ్ల మీద, గాయాల మీద రాసేవారు. దీన్ని చిల్లుల పలాస్త్రి అని అనేవారు. ఈ జిగురు పదార్ధాన్ని వేడి చేసి పుండ్ల మీద అంటిస్తే నొప్పి, వాపు తగ్గుతుంది. అంతేకాకుండా పుండ్లలో ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉండబట్టే వాటిని ఆచారాలతో ముడిపెట్టి మన పూర్వీకులు మనకు అందించారు.